అన్ని అనుకున్నట్లు జరిగుంటే సెప్టెంబర్ 28న ప్రభాస్ సలార్ సినిమా విడుదలయ్యేది. నిజానికి ఓ భారీ సినిమా విడుదలకు పర్ఫెక్ట్ డేట్ ఇది. సెప్టెంబర్ 28 గురువారమైనప్పటికీ సెలవు దినం. తర్వాత శుక్రు శని అది వీకెండ్. సోమవారం గాంధీ జయంతి.. సెలవు. ఈ రకంగా చాలా మంచి డేట్ ఇది. అన్ని లెక్కలు వేసుకునే సలార్ ని సెప్టెంబర్ 28కి లాక్ చేశారు. ఐతే సినిమా సిజీ వర్క్ పూర్తి కాకపోవడంతో ఇప్పుడా డేట్ కి రావడం లేదు సలార్.
సలార్ డేట్ ని వాడుకునే పనిలో పడ్డాయి మిగతా సినిమాలు. కొన్ని సినిమాలు అదే డేట్ కి రిలీజ్ అనౌన్స్ చేస్తుంటే, ముందే రావాల్సిన సినిమాలు కూడా సలార్ డేట్ లోకి వెళుతున్నాయి. రామ్ 'స్కంద' సెప్టెంబర్ 15న రావాలి. చాలా ముందుగానే ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేసేశారు. ఐతే ఇప్పుడా సినిమా సెప్టెంబర్ 28కి వెళ్ళిపోయింది. అలాగే కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ కూడా అదే డేట్ కి వదులుతున్నారు. 'ప్రభాస్ గారి సినిమా రాకపోవడంతో మేము అదే డేట్ కి వస్తున్నాం' అని ప్రచారం కూడా మొదలుపెట్టింది రూల్స్ రంజన్ టీం.
సితార నాగవంశీ 'మ్యాడ్' అనే సినిమాని నిర్మించారు. మొన్న టీజర్ వదిలారు. సినిమా రెడీగా వుంది. మంచి డేట్ కోసం చూస్తున్న నిర్మాతలు.. సెప్టెంబర్ 28నే ఎంచుకున్నారు. ఇవే కాదు ఇంకొన్ని చిన్న, తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా అదే డేట్ రావడానికి ఫిక్స్ అయ్యాయి. మొత్తానికి సెప్టెంబర్ 28 హాట్ కేక్ లా మారింది.