నటీనటులు: విక్రమ్, లీన, అక్షర హాసన్ తదితరులు
దర్శకత్వం: రాజేష్ ఎమ్ సెల్వ
నిర్మాతలు : కమల్ హాసన్, టి.నరేష్ కుమార్, టి. శ్రీధర్
సంగీతం: జిబ్రాన్
సినిమాటోగ్రఫర్: శ్రీనివాస్ ఆర్ గుత్తా
విడుదల తేదీ: 19 జులై, 2019
రేటింగ్: 2/5
శివ పుత్రుడు, అపరిచితుడు సినిమాలతో విక్రమ్ అంటే ఏమిటో ప్రేక్షకులకు తెలిసిపోయింది. ప్రయోగాలకు ఏమాత్రం వెనుకంజ వేయడని, పాత్ర కోసం ఎన్ని త్యాగాలైనా చేస్తాడని అర్థమైంది. ఆ సినిమాలే విక్రమ్‌కి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టాయి. అయితే అవే ఈరోజు గుది బండగా మారాయి. విక్రమ్ ఏం చేసినా అందులో వైవిధ్యాన్ని వెదుక్కోవాలని చూస్తుంటారు ప్రేక్షకులు. విక్రమ్ ఏమాత్రం రొటీన్ సినిమా చేసినా - అది ఎక్కదు. మరీ ప్రయోగాల బాట పడితే, కమర్షియాలిటీకి దూరమైపోవాల్సివస్తుంది. అందుకే విక్రమ్ సినిమాలు తరచుగా బోల్తా కొడుతున్నాయి. గత కొన్నేళ్లుగా విక్రమ్‌కి హిట్టనేదే లేదు. ఈ దశలో విక్రమ్ నుంచి వచ్చిన మరో సినిమా `కె.కె`.
* కథ
కె.కె (విక్రమ్) ఓ మర్డర్ కేసులో దోషి. మలేషియా పోలీసులు అతన్ని వెదుకుతుంటారు. ఓ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరతాడు కె.కె. అతనికి సపర్యలు చేసే ఓ డాక్టర్ భార్య (అక్షర హాసన్)ని కిడ్నాప్ చేస్తాడు కె.కె.. సోదరుడు. కె.కెని ఆసుపత్రి నుంచి పోలీసులకు చిక్కకుండా బయటకు తీసుకొస్తేనే.. తన భార్యని విడిచిపెడతానని డాక్టర్‌ని బెదిరిస్తాడు.
గత్యంతరం లేని పరిస్థితుల్లో... కె.కెని ఆ ఆసుపత్రి నుంచి తప్పిస్తాడు డాక్టర్. అప్పటి నుంచీ... మలేసియన్ పోలీసులు వీరిద్దరి గురించి వేట మొదలెడతారు. మరోవైపు.. డాక్టర్ భార్య కూడా అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుంటుంది. ఆ తరవాత ఏమైంది? కె.కె వెనుక పోలీసులు పడడానికి మరో కొత్త కారణాలేమైనా ఉన్నాయా? తనది కాని సమస్యల్లో చిక్కుకున్న భార్యా భర్తలు అందులోంచి ఎలా బయటపడగలిగారు? అనేదే కథ.
* నటీనటులు
విక్రమ్ చేయదగిన సినిమా కాదిది. తనలాంటి నటుడికి ఏమాత్రం పరీక్ష పెట్టని పాత్రలో కనిపించాడు. సినిమా అంతా సీరియస్ లుక్‌లో, దాదాపుగా ఒకే కాస్ట్యూమ్‌లో కనిపిస్తాడు.
అక్షర హాసన్ చాలా బరువైన పాత్రలో కనిపించింది. అదీ కాసేపే. క్లైమాక్స్ లో ఏడుపులు, పెడబొబ్బలు, బాధలూ ఎక్కువయ్యాయి. వాసుగా కనిపించిన అబీ హాసన్ నటన ఆకట్టుకుంటుంది. మిగిలినవాళ్లంతా తమిళ మొహాలే. వాళ్లకిచ్చిన పాత్రలూ అంతంతమాత్రంగానే ఉన్నాయి.
* సాంకేతిక వర్గం
టెక్నికల్ టీమ్ గట్టిగా కష్టపడగలిగే సినిమా ఇది. అయితే వాళ్లూ మనసు పెట్టి పనిచేయలేదు అనిపిస్తుంది. కెమెరా వర్క్ మూడ్ కి తగ్గట్టుగా ఉంది. నేపథ్య సంగీతంలో ఒకే రకమైన బీజియమ్ మాటి మాటికీ వినిపించింది.
కథ, కథనాల విషయంలో దర్శకుడు చాలా తప్పులు చేశాడు. ఓ రొటీన్ కథని సాదా సీదా స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు. కథలో మలుపులు లేకపోవడం మరో పెద్ద లోటు.
* విశ్లేషణ
విక్రమ్ సినిమా అంటే ప్రేక్షకులు ఏదో ఓ కొత్తదనం ఆశిస్తారు. అది ప్రేక్షకుల తప్పు కాదు. వాళ్లని అలా ప్రిపేర్ చేసి ఉంచాడు విక్రమ్. అయితే `కె.కె`లో ఆ కొత్తదనం మచ్చుకైనా కనిపించదు. అసలు ఇలాంటి కథని విక్రమ్ అంత తేలిగ్గా ఎలా ఒప్పుకున్నాడా అనిపిస్తుంది. తొలి సారి ఎలాంటి కష్టం పడకుండా, సాదా సీదాగా నడిచిపోయే పాత్రని ఎంచుకోవడానికే ఈ సినిమాని ఎంచుకున్నాడా అనే అనుమానం కూడా వేస్తుంది. ఈకథని సింగిల్ లైన్‌లో చెప్పుకున్నా - `ఏముంది ఇందులో` అనిపించడం సహజం. అలాంటి కథ కోసం విక్రమ్, కమల్‌హాసన్ లాంటి దిగ్గజాలు కలిశారా? అనిపిస్తుంది. నిజానికి కమల్ చేయాల్సిన కథ ఇది. దాన్ని విక్రమ్‌కి అప్పగించి, తాను మాత్రం నిర్మాతగానే పరిమితం అయ్యాడు.
కథలోకి వెళ్లడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. ఆసుపత్రి వ్యవహారాలు, భార్యా భర్తల మధ్య సీన్లు.. ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించవు. అక్షర హాసన్‌ని కిడ్నాప్ చేసిన సన్నివేశం నుంచైనా కథ రక్తి కట్టాల్సింది. కానీ అదీ జరగలేదు. చాలా సేపటి వరకూ.. విక్రమ్ పాత్రని ఆసుపత్రి బెడ్ కే పరిమితం చేశాడు దర్శకుడు. విక్రమ్ ఎప్పుడు లేస్తాడా? ఎప్పుడు ఈ కథ పుంజుకుంటుందా? అని ఎదురు చూడడం ప్రేక్షకుల వంతైంది. విశ్రాంతి వరకూ విక్రమ్ పాత్ర దాదాపుగా డమ్మీగానే కనిపిస్తుంది. ఇది విక్రమ్ సినిమానా? లేదంటే ఆయన్ని అతిథి పాత్రకు పరిమితం చేశారా? అనే అనుమానం ప్రేక్షకుడికి కలుగుతుంది.
ద్వితీయార్థంలో ఛేజింగులు, ఫైటింగులతో కాస్త రక్తి కట్టించే ప్రయత్నం చేసినా - అవి కూడా చప్పగానే సాగాయి. ఆ మర్డర్ కేసులో ఎన్నో మలుపులు ఉంటాయని ప్రేక్షకులు ఆశిస్తారు. అయితే.. దాన్ని కూడా చాలా సింపుల్‌గా తేల్చేశారు. ఇలాంటి సినిమాల క్లైమాక్స్‌లు కాస్త థ్రిల్లింగ్‌గా వెరైటీగా ఉంటాయి. ఒకే ఒక్క సీన్‌తో అప్పటి వరకూ చూపించిన కథనీ, కథా గమనాన్నీ మార్చేస్తుంటారు. అలాంటి ట్విస్టు ఏమైనా వస్తుందేమో అని ఆశిస్తారు ప్రేక్షకులు. అక్కడా నిరాశే ఎదురైంది. కె.కె పాత్రని భారీగా పరిచయడం చేయడం, డబుల్ ఏజెంట్, కమాండో అంటూ రకరకాలుగా ఊరించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో అంతు పట్టదు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అటు యాక్షన్, ఇటు థ్రిల్లింగ్ అంశాలు ఏమీ లేకపోవడంతో.... సినిమా చప్పగా సాగింది. పాటలకు ఎక్కువ ఆస్కారం ఇవ్వకపోవడం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. లేదంటే... కె.కె గోల భరించడం మరింత కష్టమయ్యేదేమో...?
* ప్లస్ పాయింట్స్
+నిడివి తక్కువ
* మైనస్ పాయింట్స్
-కథ
-కథనం
-పేలవమైన ట్విస్టు
* ఫైనల్ వర్డిక్ట్: మిస్టర్ కె.కె.. రొటీన్ & బోరింగ్!
- రివ్యూ రాసింది శ్రీ.