నటీనటులు: అల్లరి నరేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, ప్రియదర్శి తదితరులు
దర్శకత్వం : విజయ్ కనకమేడల
నిర్మాతలు : సతీష్ వేగేస్న
సంగీతం : శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫర్ : సిద్
ఎడిటర్: చోటా కె ప్రసాద్
రేటింగ్: 3.25/5
కమర్షియల్ సినిమాలు చేయడానికి తెలివితేటలు, కామన్ సెన్స్ ఉంటే చాలు.
ప్రయోగాలు చేయడానికి గట్స్ ఉండాలి. వాణిజ్య విలువలు అనే సరిహద్దు దాటి రావడానికి తెగింపు ఉండాలి. రెగ్యులర్ సినిమాల కథలన్నీ ఒకేలా ఉంటాయి. చెప్పడానికి ఏం ఉండదు. కానీ తిప్పి తిప్పి అదే చెబుతారు. కానీ.. చెప్పాల్సిన కథల జోలికి మాత్రం వెళ్లరు. ఎందుకంటే.. అలాంటి కథల్లో రిస్క్ ఎక్కువ. ఆ రిస్క్ తీసుకునేవాళ్లుంటేనే `నాంది`లాంటి కథలు సినిమాలుగా వస్తాయి. మరి `నాంది`లో ఎలాంటి కథ చెప్పారు? చెప్పిన విధానం ఎలా ఉంది?
* కథ
రాజగోపాల్ అనే సామాజిక వేత్త నడిరోడ్డుపై దారుణంగా హత్యకు గురవుతాడు. ఆ నేరం... సూర్య ప్రకాష్ (నరేష్)పై పడుతుంది. నిజానికి సూర్య ప్రకాష్ చాలా అమాయకుడు. మంచివాడు. తల్లిదండ్రులంటే ప్రేమ, గౌరవం. కష్టపడి చదివి, మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలన్న తాపత్రయం తనది. పెళ్లి కూడా కుదురుతుంది. ఓ మంచి ఫ్లాట్ కొనుక్కుని, జీవితంలో సెటిలైపోదామనుకుంటున్న తరుణంలో.. ఈ కేసు తన నెత్తిమీదకు వస్తుంది.
అయితే సాక్ష్యాధారాలు తనకు ప్రతికూలంగా ఉంటాయి. సిఐ కిషోర్ తనని ఈ కేసులో ఇరికిస్తున్నాడన్న సంగతి అర్థమవుతూనే ఉంటుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. కొడుకు బాధ చూళ్లేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యకు పాల్పడతారు. ఇది కూడా సీఐ కిషోర్ చేసిన హత్యే అని తెలుస్తుంది. కానీ.. అప్పుడు కూడా ఏం చేయలేడు. జైల్లో 5 సంవత్సరాలు మగ్గిపోతాడు. ఓ రోజు... ఓ లాయర్ (వరలక్ష్మీ శరత్ కుమార్) సూర్యని వెదుక్కుంటూ వస్తుంది. ఈ కేసులోంచి బయటపడేస్తా.. అని మాట ఇస్తుంది. మరి... సూర్య ప్రకాష్ బయటపడ్డాడా? బయటకు వచ్చాక తాను ఏం చేశాడు? అనేదే కథ.
* విశ్లేషణ
సెక్షన్ 211 బలమేంటో చూపించిన కథ ఇది. నిజానికి ఇలాంటి సెక్షన్ ఒకటుందని చాలామందికి తెలీదు. తప్పు చేయకుండా ఎవరైనా శిక్ష అనుభవిస్తే.. అందుకు కారణమైనవాళ్లని కోర్టుకి లాగొచ్చు... అని చెప్పే సెక్షన్ ఇది. దాని పూర్వాపరాల్ని బాగా పరిశీలించిన దర్శకుడు.. దాన్ని ప్రభావంతంగా తెరపై తీసుకొచ్చేందుకు ఓ మంచి కథని రాసుకున్నాడు. సూర్య ప్రకాష్‌ని అన్యాయంగా కేసులో ఇరికించిన వైనం, జైలులో అనుభవించే చిత్రవధలు, అమ్మానాన్నల్ని దారుణంగా కోల్పోవడం.. ఇవన్నీ కంటతడి పెట్టిస్తాయి. కథ కీ - ప్రేక్షకుడికీ ఓ ఎమోషనల్ కనెక్టివిటీ ఏర్పడేలా చేస్తాయి. ఈ కేసు లోంచి హీరో బయటపడితే బాగుణ్ణు అనుకునేలా చేస్తాయి. ద్వితీయార్థంలో లాయర్ ఆధ్య పాత్ర ప్రవేశిస్తుంది. ఓ రకంగా ఆ పాత్ర రెండో హీరో అనుకోవాలి. సూర్య ప్రకాష్‌ని ఈ కేసులోంచి బయటకు తీసుకురావడం ఒక ఎత్తయితే.. సెక్షన్ 211 ని ఉపయోగించి, సీఐని కోర్టుకు లాగడం మరో ఎత్తు. ఈ రెండు పాయింట్లతోనే ద్వితీయార్థం నడుస్తుంది.
సాధారణంగా ఇలాంటి కథల్లో హీరో జైలు గోడల నుంచి బయటకు వచ్చి. . విలన్లపై ప్రతీకారం తీర్చుకుంటాడు. అదంతా కమర్షియల్ సినిమాల స్ట్రాటజీ. దాన్ని దర్శకుడు పక్కన పెట్టాడు. లా లోని సెక్షన్లతోనే... ప్రతినాయకుడ్ని ఎలా ఎదుర్కోవాలో చూపించాడు. చాలా సన్నివేశాలు కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉంటాయి. కాకపోతే.. వాటిలోనూ కమర్షియల్ సినిమాల్లో ఉండే కిక్ ఉంటుంది. కొన్ని చోట్ల.. దర్శకుడు కావల్సినదానికంటే ఎక్కువ లిబర్టీ తీసుకున్నాడనిపిస్తుంది. కాకపోతే... ఇలాంటి కథల్ని జనరంజకంగా చెప్పడానికి అంతకంటే మార్గం లేదు కూడా.
211 సెక్షన్ పై జనాలకు ఓ అవగాహన వచ్చినట్టు, ఆ సెక్షన్ టాక్ ఆఫ్ ది కంట్రీ అయినట్టు చూపిస్తే బాగుండేది. ఈ కథకు ఓ బలమైన సామాజిక కోణం జోడించినట్టయ్యేది. ఈ కేసు, ఈ సెక్షన్ సూర్యప్రకాష్‌కి మాత్రమే పరిమితం కాదని, తనలాంటి నిర్దోషులకు చాలామందికి అండగా ఉంటుందన్న విషయాన్ని బలంగా చెప్పినట్టు అయ్యేది. కొన్ని కొన్ని లోపాలున్నా.. సర్దుకుపోవొచ్చు. ఎందుకంటే. దర్శకుడు నిజాయతీగా ఓ పాయింట్ ని చెప్పాలనుకున్నాడు. దాని కోసం అడ్డదారులు తొక్కకుండా... సక్రమమైన దారిలోనే వెళ్లాడు. సెకండాఫ్‌లో అక్కడక్కడ కాస్త స్లో అయినట్టు అనిపించినా - వాటిని భరించాలి. మొత్తానికి.. నరేష్ నుంచి ఓ కొత్త పాత్రనీ, ఓ కొత్త రకమైన కథని చూసే వీలు దక్కింది.
* నటీనటులు
నరేష్ ఈ సినిమాలో.. తనని తాను మార్చుకునే ప్రయత్నం చేశాడు. ఇంత వరకూ `అల్లరి నరేష్` అని పిలిచేవారు. ఇప్పుడు నాంది నరేష్ లా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కథకి, పాత్రకి ఏం కావాలో, ఏం చేయాలో సిన్సియర్‌గా చేశాడు. తనపై కామెడీ ఎఫెక్ట్ ఉందని చెప్పి, అలాంటి సన్నివేశాలు ఇరికించే ప్రయత్నం చేయలేదు. తన కష్టం తెరపై కనిపిస్తుంది. ఎప్పుడూ నవ్వించే ప్రవీణ్, ప్రియదర్శి కూడా.. ఈసారి బరువైన పాత్రలే చేశారు. ఏ పాత్రా వృథా కాలేదు. ఇక.. లాయర్‌గా వరలక్ష్మి శరత్ కుమార్‌కి నూటికి నూరు మార్కులూ పడతాయి. నరేష్ తరవాత అంతటి బలమైన పాత్ర తనదే. తండ్రి పాత్రలో దేవి ప్రసాద్ నటన ఆకట్టుకుంటుంది. ఆయన చాలా సహజంగా కనిపించారు.
* సాంకేతిక వర్గం
దర్శకుడు ఓ బలమైన కథ రాసుకున్నాడు. దాన్ని నిజాయతీగా చెప్పాడు. ఓరకంగా ఇది డైరెక్టర్ మూవీ. సంభాషణలు న్యాయ వ్యవస్థ పై కోపాన్ని, ప్రేమని చాటి చెప్పేలా ఉన్నాయి. సిద్ద్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. చాలాసార్లు కెమెరా సన్నివేశంలోని బలాన్ని మరింత స్పష్టంగా చూపించగలిగింది. నేపథ్య సంగీతం కూడా మూడ్ కి తగ్గట్టు సాగింది.
* ప్లస్ పాయింట్స్
కథ
నరేష్ నటన
సంభాషణలు
* మైనస్ పాయింట్స్
ద్వితీయార్థంలో కాస్త స్లో
* ఫైనల్ వర్డిక్ట్: న్యాయం జరిగింది