తారాగణం: సందీప్ కిషన్, శ్రీ, రెజినా, రాందాస్, చార్ల్
బ్యానర్: పొటెన్షియల్ స్టూడియోస్
మ్యూజిక్: జావేద్ రియాజ్
నిర్మాత: ప్రభు, ప్రకాష్ బాబు, గోపీనాథ్
దర్శకత్వం: లోకేష్
సందీప్ కిషన్ కథల ఎంపికపై టాలీవుడ్‌లో ఓ గౌరవం ఉంది. అతని ప్రయత్నాలు కొత్తగా ఉంటాయని, కమర్షియల్ కథలకు దూరంగా ఉన్న సినిమాలనే ఎంచుకొంటాడని అందరి నమ్మకం. అప్పుడప్పుడూ కొన్ని ప్రయత్నాలు బెడసి కొట్టినా... ఆ దారి వదల్లేదు. ఈసారీ సందీప్ కిషన్.. కమర్షియాలిటీని లెక్క చేయని కథ ఒకటి ఎంచుకొన్నాడు. అదే... నగరం. మరి ఈ సినిమా ఎలా ఉంది?? ఏ వర్గానికి చేరువ అవుతుంది?? సందీప్ ప్రయత్నం, ప్రయోగం ఎంత వరకూ ఫలితాన్ని అందించే అవకాశం ఉంది?? కాస్త వివరంగా తెలుసుకొంటే...
* కథ ఇలా...
సందీప్ కిషన్ నిరుద్యోగి. రెజీనాని ప్రేమిస్తాడు. కానీ రెజీనా మాత్రం... సందీప్ అంటే ఇష్టం లేనట్టే ప్రవర్తిస్తుంటుంది. రెజీనా కోసం ఓ ముఠాతో గొడవ పడతాడు సందీప్. అది... కాస్త పెద్దదై సందీప్‌ని ఊరు వదిలి వెళ్లిపోయేలా చేస్తుంది. శ్రీ అనే మరో కుర్రాడు తాను ప్రేమించిన అమ్మాయి కోసం పల్లెటూరు వదిలి నగరానికి వస్తాడు. ఇక్కడే ఓ ఉద్యోగం చేసుకొని... ఊర్లో తలెత్తుకొని తిరగాలన్నది అతని ప్రయత్నం. అయితే.. వచ్చిన రోజే ఓ ముఠా చేతిలో అనవసరంగా తన్నులు తినాల్సివస్తుంది. మరోవైపు ఇదే నగరంలో డ్రైవర్ ఉద్యోగం చేసుకొంటూ కుటుంబాన్ని పోషించుకోవడానికి చార్లీ అడుగుపెడతాడు. తనకీ ఈ నగరం అంటే కొత్తే! అదే రోజు పీకేపీ అనే డాన్ కొడుకు కిడ్నాప్ అవుతాడు. ఆ కిడ్నాప్‌తో సందీప్‌కిషన్, శ్రీ, చార్లిల జీవితాలు ఎలా తారుమారయ్యాయి అనేదే నగరం కథ.
* తీసిందిలా...
కథ ఇదీ.. అని చెప్పుకోవడానికి సింపుల్‌గా ఉండొచ్చు. కానీ... ఇందులో నాలుగు కథలున్నాయి. కథలు కాదు... జీవితాలున్నాయి. అవన్నీ ఓ సంఘటనతో ముడిపడి చెల్లాచెదురైపోతాయి. అదెలా.. తరవాత ఏం జరిగింది? అనేది ఉత్కంఠ భరితంగా తెరకెక్కించాడు దర్శకుడు. మూణ్ణాలుగు కథల్ని ఓ చోట చేర్చడం వేదం, మనమంతాలాంటి సినిమాల్లో చూశాం. నగరం ఫార్మెట్ కూడా అదే. కాకపోతే... ఇంకాస్త పకడ్బందీ స్ర్కీన్ ప్లేతో కట్టిపడేస్తాడు దర్శకుడు. సినిమాలో అరవై సన్నివేశాలుంటే... అందులో ఏ ఒక్కటి పక్కకు తీసినా కథా గమనం దెబ్బతింటుంది. అంతే పట్టుగా సాగుతుంది స్ర్కీన్ ప్లే. పాత్రల్ని పరిచయం చేయడానికంటూ దర్శకుడు ప్రత్యేకంగా సమయం తీసుకోలేదు. కథని బట్టే పాత్రలు వస్తుంటాయి. వచ్చిన ప్రతీ పాత్రా కథలో భాగంగానే కనిపిస్తుంది. అందుకే ప్రతి పాత్రకూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది.
చెప్పాలనుకొన్న పాయింట్‌ని అందంగా చెప్పడం ఓ పద్ధతి. పైపై మెరుగులు అద్ది ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ఇంకొంతమంది... ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. ఈ దర్శకుడు రెండో దారి ఎంచుకొన్నాడు. అందుకే ప్రతీ సన్నివేశం, సంఘటన వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. ద్వితీయార్థం కాస్త నెమ్మదించినట్టు అనిపిస్తుంది. అయితే.. పతాక సన్నివేశాల ముందు దర్శకుడు మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేస్తాడు. సినిమాని ముగించిన పద్ధతి బాగానే ఉన్నా.. ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది. హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాని ముగిస్తే.. కాస్త సినిమాటిక్‌గా ఉన్నా.. దాని ప్రభావం మాత్రం ఎక్కువగా కనిపించేది. కానీ.. దర్శకుడు సహజత్వానికే పెద్ద పీట వేయడంతో ఎక్కడా సినిమాటిక్ ముగింపుల జోలికి వెళ్లలేదు. అయితే... కొన్ని లోపాలు లేక పోలేదు. సినిమాని మరీ `రా`గా చూపించే ప్రయత్నం చేశాడు. డిటైలింగ్‌కి ఎక్కువ సమయం తీసుకొన్నాడు. సందీప్, రెజీనా తప్పిస్తే తెలిసిన మొహం ఒక్కటీ కనిపించదు. ద్విభాషా చిత్రమని చెబుతున్నా - అనువాద ఛాయలు నూటికి నూరుశాతం కనిపిస్తాయి. వినోదానికి ఎక్కడా స్కోప్ లేదు. ఇలాంటి సినిమాల్లో వినోదం ఆశించడం కూడా తప్పే. సీరియస్ సినిమాల్ని సీరియస్‌గా ఇష్టపడేవాళ్లకు ఇది సిన్సియర్ ప్రయత్నంగా అనిపిస్తుంది.
* చేశారిలా..
సందీప్ కిషన్ నటన మరోసారి ఆకట్టుకొంటుంది. నేను హీరోని కదా అని ఎక్కడా బిల్డప్పులకు పోలేదు. తన హెయిర్ స్టైల్ చూస్తే... ఈ పాత్రని ఎంతగా ప్రేమించాడో అర్థం అవుతుంది. రెజీనా ది చిన్న పాత్రే. అయినా ఓకే. శ్రీ చక్కగా నటించాడు. మధ్యతరగతి తండ్రి పాత్రలో చార్లి నటన ఆకట్టుకొంటుంది. కిడ్నాప్ గ్యాంగ్‌లో ఇరుక్కొన్న అమాయకుడి పాత్రలో కనిపించిన నటుడి నటన.. ఆకట్టుకొంటుంది. ఈసినిమాలో కాసిన్ని నవ్వులైనా పండాయంటే... అదంతా అతని అమాయకత్వం వల్లే.
* సాంకేతికంగా చూస్తే... సంగీతం, ఛాయాగ్రహణం మంచి మార్కులు పొందుతాయి. అందరికంటే ఎక్కువ మార్కులు స్ర్కీన్ ప్లేకి దక్కాలి. ఎందుకంటే చాలా క్లిష్టమైన ప్రయత్నం ఇది. ఇన్ని పాత్రలు, ఇన్ని సంఘటనలు ఒకే సంఘటనతో ముడిపెట్టడం ఆషామాషీ కాదు. దర్శకుడికి మంచి భవిష్యత్తు ఉంది.
* ప్లస్ పాయింట్స్
+ కథనం
+నటీనటులు
* మైనస్ పాయింట్స్
- స్లో నేరేషన్
- ముగింపు
* ఫైనల్ వర్దిక్ట్: 'నగరం' నచ్చేలానే ఉంది.
యూజర్ రేటింగ్: 2.75/5
రివ్యూ బై: శ్రీ