నక్షత్రం మూవీ రివ్యూ & రేటింగ్స్

మరిన్ని వార్తలు

తారాగణం: సందీప్‌ కిషన్‌, సాయిధరమ్‌ తేజ్‌, రెజినా, ప్రగ్యా జైస్వాల్‌, తనీష్‌, ప్రకాష్‌రాజ్‌ తదితరులు
సంగీతం: మణిశర్మ, భీమ్స్‌, భరత్‌ మధుసూధన్‌, హరి గౌర
సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్‌ నరోజ్‌
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాతలు: కె.శ్రీనివాసులు, ఎస్‌.వేణుగోపాల్‌, సజ్జు
నిర్మాణం: బుట్టబొమ్మ క్రియేషన్స్‌, విన్‌ విన్‌ విన్‌ క్రియేషన్స్‌

యావరేజ్ యూజర్ రేటింగ్: 2.5/5

కథా కమామిషు..

కృష్ణవంశీ నుంచి ఏ సినిమా వచ్చినా, అతని గత సినిమా వైఫల్యాల గురించి ఆలోచించకుండా కొత్త సినిమాపై అంచనాలు ఏర్పడుతుంటాయి. అదే ఆయన ప్రత్యేకత. తెలుగు సినీ పరిశ్రమలో అతి కొద్దిమంది క్రియేటివ్‌ డైరెక్టర్స్‌లో ఆయనా ఒకరు. అందుకే కృష్ణవంశీ నుంచి వస్తున్న 'నక్షత్రం'పైనా భారీ అంచనాలున్నాయి. మరి, ఆ అంచనాలేమయ్యాయో తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం. పోలీస్‌ రక్తం నరనరానా జీర్ణించుకుని, ఎస్‌ఐ అవ్వాలనే ఆశయంతో ఉండే యువకుడు రామారావు (సందీప్‌ కిషన్‌). కొన్ని కారణాలతో ఎస్‌ఐ సెలక్షన్‌ పరీక్షకు హాజరు కాలేకపోతాడు. పోలీస్‌ అవలేకపోతేనేం, పోలీస్‌ డ్రెస్‌తో అనధికారికంగా పోలీస్‌లానే సేవలందించొచ్చనుకుంటాడు రామారావు. అయితే పోలీస్‌ అధికారిణి కిరణ్‌రెడ్డి (ప్రగ్యాజైస్వాల్‌)కి అడ్డంగా దొరికేస్తాడు. రామారావు దగ్గర అలెగ్జాండర్‌ పోలీస్‌ డ్రెస్‌ చూసిన కిరణ్‌రెడ్డి, రామారావుని కమిషనర్‌ దగ్గరకి తీసుకెళుతుంది. ఇంతకీ అలెగ్జాండర్‌ ఎవరు? ఎస్‌ఐ అవలేకపోవడానికి రామారావుకి అడ్డుపడేదెవరు? కిరణ్‌రెడ్డికీ అలెగ్జాండర్‌కీ సంబంధమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులెలా చేశారు?

పోలీస్‌ అవ్వాలనే కసితో ఉండే యువకుడి పాత్రలో సందీప్‌ కిషన్‌ ఆకట్టుకుంటాడు. యాక్షన్‌, సెంటిమెంట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇలా అన్ని కోణాల్లోనూ సందీప్‌ కిషన్‌ మంచి ప్రతిభ కనబర్చాడు. ఎక్కడా అతని నటనకి వంక పెట్టడానికి వీల్లేనంతగా రామారావు పాత్రలో ఒదిగిపోయిన తీరు అభినందనీయం.

అలెగ్జాండర్‌ పాత్రలో సాయిధరమ్‌తేజ కన్పించింది కాస్సేపే అయినా, విజిల్‌ మూమెంట్స్‌ ఎన్నో అతను తెరపై కన్పించినప్పుడు థియేటర్‌లో చూడగలం. పవర్‌ఫుల్‌గా కనిపించాడుగానీ, అతని పాత్రని ముగించిన తీరు కొంచెం నిరాశపర్చింది. ఓవరాల్‌గా సినిమాకి మంచి ఊపు తెచ్చే పాత్రలో సాయిధరమ్‌తేజ మెప్పించాడు. తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో ప్రగ్యాజైస్వాల్‌ చాలా బాగా చేసింది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తే, పాటల్లో అల్ట్రా గ్లామరస్‌గా కనిపించి మెప్పించింది. హాట్‌నెస్‌ విషయంలో ప్రగ్యా జైస్వాల్‌ బాగానే మార్కులు కొట్టేసింది. రెజినా తక్కువేమీ చేయలేదు, ఆమెనీ గ్లామరస్‌గా చూపించాడు దర్శకుడు. అయితే పాత్ర పరంగా రెజినాకి వెయిట్‌ కాస్త తక్కువే ప్రగ్యా జైస్వాల్‌తో పోల్చినప్పుడు.

యంగ్‌ విలన్‌గా తనీష్‌ ఆకట్టుకుంటాడు. సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో ప్రకాష్‌రాజ్‌, హోం మినిస్టర్‌ పాత్రలో జెడి చక్రవర్తి మెప్పిస్తారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు.

విశ్లేషణ...

ఫస్టాఫ్‌ అంతా పాత్రల పరిచయంతోనే సరిపెట్టేశారు. సెకెండాఫ్‌లో కథ ఊపందుకుంటుంది. దాంతో ఫస్టాఫ్‌ డల్‌ అయ్యిందనే భావన కలగడం సహజమే. ఇంకో వైపున లాజిక్‌లు మిస్‌ అయ్యాడు దర్శకుడు. సాయిధరమ్‌ తేజ అప్పీయరెన్స్‌, హీరోయిన్ల గ్లామర్‌, సందీప్‌ కిషన్‌ నటన ఇవన్నీ సినిమాకి బలాన్ని చేకూర్చాయి. సెకెండాఫ్‌ వేగం అందుకున్నట్టే అందుకుని, అక్కడక్కడా కొంచెం స్లో అయినట్లనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే సినిమా ఓకే అనిపిస్తుందిగానీ, కృష్ణవంశీ నుంచి ఆశించే 'అంతకు మించి' అనే స్థాయిలో లేకపోవడం పెద్ద మైనస్‌గా చెప్పుకోవాలి. సెకెండాఫ్‌, క్లయిమాక్స్‌ సీన్స్‌ సినిమాకి బలం గనుక, థియేటర్‌ నుంచి బయటకొచ్చేటప్పటికి ఓకే అనే ఫీలింగ్‌ కలుగుతుంది.

 

సాంకేతిక వర్గం పనితీరు...

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్‌ ప్లేస్‌ సినిమాటోగ్రఫీదే. చాలా హెల్ప్‌ అయ్యింది సినిమాటోగ్రఫీ. కృష్ణవంశీ మార్క్‌ కనిపించింది అన్ని ఫ్రేమ్స్‌లోనూ. సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్బ్‌. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి అవసరమైన మేర ఉపయోగపడ్డాయి. ఎడిటింగ్‌ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేదన్పిస్తుంది. డైలాగ్స్‌ బాగున్నాయి. కథనం పరంగా కొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

ఫైనల్‌ వర్డ్‌..

'నక్షత్రం'లో స్టార్స్‌ బాగానే వెలిగారుగానీ...

రివ్యూ బై శేఖర్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS