నటీనటులు : వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల తదితరులు
దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల
నిర్మాతలు : సురేష్ బాబు, కలైపులి ఎస్ తాను
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫర్ : సామ్ కే నాయుడు
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
రేటింగ్: 2.75/5
తమిళనాట ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన సినిమా `అసురన్`. ఓ బలమైన సామాజిక అంశాన్ని సృశిస్తూ సాగిన సినిమా ఇది. ధనుష్ తన విశ్వరూపం చూపించేశాడు. మూడు పదుల ధనుష్... తన కంటే రెట్టింపు వయసున్న పాత్ర పోషించడం `అసురన్`కి ఓ ప్రత్యేకత తీసుకొచ్చింది. అవార్డుల వర్షం కురిసింది. కమర్షియల్ గానూ పెద్ద హిట్టయ్యింది.
ఇక ఈ సినిమాని రీమేక్ చేయడానికి అడ్డేముంది? అందుకే `నారప్ప`గా తెలుగులో రీమేక్ చేసేశారు. థియేటర్లలో విడుదల కావాల్సిన సినిమా ఇది. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ఓటీటీకి వెళ్లింది. ఈరోజు నుంచి (జులై 20) అమేజాన్ లో చూడొచ్చు. మరి `నారప్ప` ఎలా ఉంది? `అసురన్`కి ధీటుగా ఉందా? జిరాక్స్ కాపీలా మారిందా?
* కథ
అనంతపురం నేపథ్యంలో సాగే కథ ఇది. నారప్ప (వెంకటేష్)ది వ్యవసాయ కుటుంబం. ఊర్లో ఉన్న మూడెకరాల భూమే... తనకు ఆధారం. అయితే.. ఆ మూడెకరాలపైనే భూస్వామి అయిన పండుస్వామి (నరేన్) కన్ను పడుతుంది. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటాడు. ఆ భూ తగాదాలోనే పండుస్వామి కొడుక్కీ.. నారప్ప కొడుకు మునికన్న (కార్తీక్ రత్నం)కీ తగాదా అవుతుంది. అది కాస్త పెద్దదై... మునికన్నని పండుస్వామి మనుషులు చంపేస్తారు.
ఈ హత్య కళ్లారా చూసిన నారప్ప రెండో కొడుకు సీనబ్బ (రాఖీ) పగ పెంచుకుని.. పండుస్వామిని చంపేస్తాడు. దాంతో పండుస్వామి మనుషులు... నారప్పనీ, అతని కుటుంబాన్నీ తరుముతుంటారు. ఎలాగైనా సరే.. కోర్టులో లొంగిపోయి తన కొడుకుని రక్షించుకోవాలన్నది నారప్ప ఆశ. అందుకోసం... పండుస్వామి మనుషుల నుంచి తప్పించుకొని కోర్టుకి చేరుకోవాలనుకుంటాడు. మరి తన ప్రయత్నం నెరవేరిందా? తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడా? అసలు నారప్ప కథేమిటి? అతనికి గతంలో జరిగిన అన్యాయం ఎలాంటిది? అనేది తెరపై చూడాలి.
* విశ్లేషణ
అసురన్ మామూలు కథ కాదు. ఓ తండ్రి ప్రతీకారం కథలా కనిపిస్తున్నా అంతర్లీనంగా సామాజిక అంశాలు మెండుగా ఉన్నాయి. తమిళనాట జరిగిన ఓ యదార్థ ఘటనని ఆధారంగా చేసుకుని, ఈ కథని రాసుకున్నారు. అందుకే అక్కడి జనాలకు త్వరగా కనెక్ట్ అయ్యింది. దానికి ధనుష్ విశ్వరూపం తోడైంది. తెలుగులో ఈ కథని చేస్తున్నప్పుడు ఇక్కడి వాతావరణానికి అనువుగా కొన్ని మార్పులూ చేర్పులూ ఆశిస్తాం. కానీ.... దర్శకుడు ఆ సాహసం చేయలేదు. `అసురన్`ని మక్కీకి మక్కీ దించడానికే ప్రయత్నించాడు.
తమిళనాడు తరహా ఘటనలు ఇక్కడా జరిగాయి కాబట్టి... ఇది మన కథే అనిపిస్తుంది కూడా. పాత్రల డిజైనింగ్, సన్నివేశాలు, సంభాషణలు, ఆఖరికి కెమెరా మూమెంట్స్ కూడా.. `అసురన్`ని ఫాలో అయిపోయాడు దర్శకుడు. తొలి భాగం ఎంగేజింగ్ గానే సాగుతుంది. తొలి సన్నివేశం నుంచే... కథ చెప్పడం మొదలెట్టాడు దర్శకుడు. అక్కడి నుంచి కథ ఎక్కడా పక్క దారి చూడదు. పక్కకు వెళ్లదు. భూముల గొడవ, మునికన్న హత్య, ఆ తరవాత.. అడవుల్లో తప్పించుకుని తిరగడం ఇవన్నీ గ్రిప్పింగ్ గానే తీశాడు. యాక్షన్ సన్నివేశాలు, హింస, రక్తపాతం ఉన్నా అవి రెగ్యులర్ సినిమాల్లో చూసిన ఫైటింగుల్లా ఉండకపోవడం రిలీఫ్ గా అనిపిస్తుంది.
ద్వితీయార్థంలో నారప్ప ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలవుతుంది. అది సుదీర్ఘంగా సాగింది. దాంతో.. తొలి సగం ఓ కథ, రెండో సగంలో మరో కథ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. వెంకీ గెటప్ సూట్ కాలేదనిపిస్తుంది. పైగా అభిరామితో చేసిన సన్నివేశాలు, వాళ్ల లవ్ ట్రాక్ లో... వెంకీ - అభిరామిల ఏజ్ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కొన్ని సన్నివేశాలు బాగా ఎమోషనల్ గా సాగుతాయి. ముఖ్యంగా అభిరామి చెప్పులు వేసుకుంటే అగ్ర వర్ణాల వాళ్లు ఎలా బిహేవ్ చేశారు? ఎంతలా అవమానించారు? అనేవి మనసుని తాకేలా, ప్రశ్నించేలా, ఆగ్రహించేలా చూపించాడు.
తన కుటుంబాన్ని సజీవ దహనం చేసిన శత్రువులపై.. కథానాయకుడు పగ తీర్చుకోవడం కూడా.. ఎమోషనల్ గా సాగింది. వాటితో పోలిస్తే.. క్లైమాక్స్ చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. మొత్తానికి అక్కడక్కడ.. ఆకట్టుకుంటూ, కాస్త స్లో నేరేషన్ తో ఇబ్బంది పెడుతూ `నారప్ప` సాగింది. `అసురన్` చూసినవాళ్లకు నారప్ప ఏ యాంగిల్ లోనూ కొత్తగా అనిపించదు. మూల కథలో, ప్రాణం లాంటి సన్నివేశాల్లో ఏ దర్శకుడూ మార్పులు చేయడు. కనీసం.. యాడింగ్ సీన్లయినా మారుస్తారు. నారప్పలో అదీ కనిపించదు.
* నటీనటులు
వెంకటేష్ కి మరో మంచి పాత్ర దక్కింది నారప్పతో. తను తప్ప ఈ పాత్రకు ఇంకెవ్వరూ న్యాయం చేయలేరు అన్నంత బాగా చేశాడు. యంగ్ గెటప్ లో కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. ఓల్డ్ లుక్ లో అదరగొట్టేశాడు. చాలా సన్నివేశాల్లో ఏడిపించేశాడు కూడా. పరుత్తివీరన్ తరవాత.. ప్రియమణికి మళ్లీ అంత మంచి పాత్ర ఇక్కడే దక్కింది. కార్తకీ్ రత్నం మరోసారి ఆకట్టుకుంటాడు. నాజర్, నరేన్, రాజీవ్ కనకాల షరా మామూలే.
* సాంకేతిక వర్గం
మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథకు ప్రాణం పోసింది. ఫొటోగ్రఫీ చాలా సహజంగా ఉంది. `అసురన్` మ్యాజిక్ రిపీట్ అయ్యింది. మాటలు సహజంగా ఉన్నాయి. అయితే రాయలసీమ మాండలికంపై మరింతగా కసరత్తు చేయాల్సింది. శ్రీకాంత్ అడ్డాలకు వెంకటేష్, సురేష్ బాబు తగినంత స్వేచ్ఛ ఇచ్చారా? లేదా అనే అనుమానం కలుగుతుంది. కాకపోతే... తను తన పనిని సక్రమంగా చేశాడు.
* ప్లస్ పాయింట్స్
వెంకటేష్
ఇతర నటీనటులు
ప్రధమార్థం
ఎమోషన్
యాక్షన్ సీన్లు
* మైనస్ పాయింట్స్
ద్వితీయార్థం
* ఫైనల్ వర్డిక్ట్: వెంకీ మ్యాజిక్