తారాగణం: నాగ శౌర్య, యామిని భాస్కర్, కష్మీర, శివాజీరాజా తదితరులు
నిర్మాణ సంస్థ: Ira క్రియేషన్స్
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయాగ్రహణం: విజయ్ సీ కుమార్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: ఉష
రచన-దర్శకత్వం: శ్రీనివాస చక్రవర్తి
రేటింగ్: 2.5/5
దోస్తానా లాంటి కథలు చూస్తున్నప్పుడు ఆ హీరోల ధైర్యం చూస్తే ముచ్చటేస్తుంటుంది. భలే సాహసం చేశారే.. అనాలనిపిస్తుంది. తెలుగులో అలాంటి పాత్రలు చేయడానికి హీరోలకు ధైర్యం చాల్లేదు. నర్తనశాలతో ఆ సాహసం చేశాడు నాగశౌర్య. నర్తనశాల అనే పేరు పెట్టుకోవడానికి చాలా ధైర్యం కావాలి.. 'గే' పాత్ర పోషించడం కూడా రిస్కే. మరి ఈ రెండు రిస్కులు తీసుకున్న నాగశౌర్యకు ఏం మిగిలింది? 'ఛలో' అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ఎలా ఉంది?
* కథ
శివాజీరాజా తన ఇంట్లో ఆడపిల్ల పుట్టాలని కలలు కంటే.. మగపిల్లాడు (నాగశౌర్య) పుడతాడు. తన తండ్రి కోసం... మగ పిల్లాడు పుట్టినా ఆడ పిల్లలా ముస్తాబు చేసి.. 'మనింట్లో ఆడ పిల్లే పుట్టింది' అంటూ కవరింగు చేస్తుంటాడు. దాంతో చిన్నప్పటి నుంచీ... ఆడపిల్లలా పెరిగి, ఆడవాళ్ల కోసం ఆలోచించే కుర్రాడిగా మారిపోతాడు నాగశౌర్య. ఆడపిల్లలలో ధైర్యం పెంచడానికి జిమ్ గట్రా స్థాపించి, వాళ్లలో మానసిక స్థైర్యం పెంపొందిస్తుంటాడు.
అలాంటి అబ్బాయికి మానస (కష్మీరా) పరిచయం అవుతుంది. తన మంచి తనం నచ్చి ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. కొన్ని అపార్థాల ఫలితంగా సత్య (యామిని) అనే మరో అమ్మాయిని నిశ్చితార్థం చేసుకోవాల్సివస్తుంది. దాన్నుంచి తప్పించుకోవడానికి 'నేను గే' అనే అబద్దం ఆడేస్తాడు శౌర్య. ఆ అబద్ధం వల్ల ఓ సమస్యకు తాత్కాలిక పరిష్కారం దొరుకుతుంది. కానీ.. మరెన్నో సమస్యలు పుట్టుకొస్తాయి. అవేంటి? వాటి నుంచి తాను ఎలా బయటపడ్డాడు? అనేదే కథ.
* నటీనటులు
నాగశౌర్య తన పాత్రకు న్యాయం చేశాడు. గ్లామర్‌గా ఉన్నాడు, పాటల్లో మరింత బాగున్నాడు. గే సన్నివేశాల్లో, సిగ్గు పడాల్సినప్పుడు కూడా సిగ్గు లేకుండా నటించాడు. నటుడిగా ఏ లోపమూ చేయలేదు.
కష్మీర అందంగా ఉంది. యామిని మాత్రం హీరోయిన్ ఫేస్ కట్ కాదనిపిస్తుంది. ఓ పాటలో... హాట్‌గా కనిపించింది.
అజయ్ నటన ఆకట్టుకుంటుంది. తను ఈసినిమాకి బాగా హెల్ప్ అయ్యాడు. శివాజీరాజా, జయప్రకాష్‌రెడ్డి అనుభవాన్నంతా రంగరించారు. సత్యం రాజేష్ ఓ మాదిరిగా నవ్వించాడు. మిగిలిన వాళ్లంతా ఓకే.
* విశ్లేషణ
'గే' కథతో ఓసినిమా తెరకెక్కించడం, ఆ పాత్ర హీరోనే పోషించడం నిజంగా కొత్తగా అనిపిస్తాయి. ఈ కథ బలం కూడా అదే. అనుకోని పరిస్థితుల్లో హీరో 'గే'గా నటించాల్సివస్తుంది. అదే... అతని జీవితాన్ని, ప్రేమని తల్లకిందులు చేస్తుంది. ఆ పాయింట్ నచ్చి నాగశౌర్య ఈ కథకు ఒప్పుకుని ఉంటాడు. ఇలాంటి కథలు నడవాలంటే... వినోదం పండాలి. అందుకోసం మంచి కామెడీ సీన్లు రాసుకోవాలి. ఆ ప్రయత్నం జరిగింది కూడా.
కాకపోతే సంపూర్ణంగా కాదు. సన్నివేశాల్లో నవ్వించడానికే తీశారు. కానీ... అవేం పూర్తి స్థాయిలో పండలేదు. తొలి సగంలో గే జోలికి పోలేదు. హీరో పరిచయ సన్నివేశాలు, క్యారెక్టరైజేషన్లు, శివాజీరాజా వేసే తిక్క వేషాల వల్ల కలిగిన అనర్థాలు, సత్యం రాజేష్ కామెడీ ట్రాకు.. దాదాపుగా వీటితోనే నడిపించారు. కీలకమైన గే భాగాన్ని.. సెకండాఫ్‌కి పరిమితం చేయడం కూడా మంచి ఎత్తుగడే. కాకపోతే.. తొలి భాగం నవ్వుకోవడానికి సరిపడినంత స్టఫ్ లేకుండా పోయింది. అక్కడక్కడ సన్నివేశాలు ఓకే అనిపిస్తుంటాయి. ద్వితీయార్థంలో కామెడీతో పొట్ట చెక్కలైపోయే ప్రమాదం ఉందనుకుంటారు. కానీ... అది కూడా భ్రమే అని తేలిపోతుంది.
నాగశౌర్య - అజయ్‌ల మధ్య సాగే ఒకట్రెండు సన్నివేశాలు హిలేరియస్‌గా నవ్విస్తాయి. మిగిలినవన్నీ పైపై పూతలే. పైపై నవ్వులే. వినోదం పండించే సన్నివేశాల్ని ఇంకాస్త పకడ్బందీగా రాసుకుంటే బాగుండేది. నిజానికి ఈ స్కేల్‌లో ఎంతైనా వినోదం పంచవచ్చు. కానీ దర్శకుడు మరీ మొహమాటపడిపోయాడు. కొన్ని సన్నివేశాలు, కొన్ని పాత్రలు పాత చింతకాయ్ పచ్చడి వాసన కొడతాయి. క్లైమాక్స్ కూడా పరమ రొటీన్‌గా ఉంది. హీరోని ఒకే ఇంట్లో బంధించడం.. ఆ ఇంట్లో్నే పాత్రల్ని సన్నివేశాల్నీ తిప్పడంతో.. ఒకే సన్నివేశం మళ్లీ మళ్లీ చూసినట్టు అనిపిస్తుంది.
* సాంకేతికంగా
సాగర్ మహతి పాటలు యావరేజ్‌గా ఉన్నా, చిత్రీకరించిన విధానం బాగుంది. కెమెరా పనితనం వల్ల సినిమాకి కాస్ట్‌లీ లుక్ వచ్చింది. ఛలో్ తరవాత ఐరా సంస్థ నుంచి వచ్చిన సినిమా ఇది. వాళ్లు నాణ్యత విషయంలో రాజీ పడలేదు. దర్శకుడు రాసుకున్న పాయింట్‌లో నవ్యత ఉంది. అయితే.. ఈ కామెడీ సరిపోలేదు. ఇంకాస్త డోసు పెంచాల్సింది. ఆ విషయంలో విఫలమయ్యాడు.
* ప్లస్ పాయింట్స్
+ టైటిల్
+ హీరో క్యారెక్టరైజేషన్
+ అజయ్
* మైనస్ పాయింట్స్
- వర్కవుట్ కాని కామెడీ
* ఫైనల్ వర్డిక్ట్: @ నర్తనశాల.... 'గే' గోల.
రివ్యూ రాసింది శ్రీ.