నందమూరి హరికృష్ణ, ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మనిషి. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి కుమారుడిగా ఇటు సినిమా రంగంలో మరియు రాజకీయ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. మెట్ట మొదటిసారి బాల నటుడిగా 'శ్రీ కృష్ణావతారం' చిత్రంతో తెరంగ్రేటం చేసిన అయన దాన వీర శూర కర్ణ, శ్రీరాములయ్య, శివరామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో మరియు సీతయ్య వంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు.
సినిమా రంగంలోనే కాకుండా తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ ప్రచారంలో తన తండ్రికి బాసటగా ఉంటూ చైతన్య రథ సారధిగా, అలుపెరుగని కృష్ణుడిలా రాష్ట్రాన్ని చుట్టేశారు. అంతే కాకుండా తెలుగుదేశం పార్టీ విజయం తర్వాత కేబినెట్ లో రవాణా శాఖా మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పనిచేసారు. 2014లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో రాజ్య సభలో సమైక్య గొంతుని వినిపించారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఈరోజు తెల్లవారు జామున హైదరాబాద్ నుండి నెల్లూర్ కి ఒక వివాహానికి హాజరవ్వడానికి వెళ్తున్న హరికృష్ణ గారు నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి దగ్గర రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మరియు నందమూరి కుటుంబ సభ్యులు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు.
వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ, iQlikmovies.com తరపున వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.