నవాబ్ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

తారాగణం: అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, అదితి రావు, ఐశ్వర్య రాజేష్ & డయానా, ప్రకాష్ రాజ్, జయసుధ & తదితరులు
నిర్మాణ సంస్థ: మద్రాస్ టాకీస్ & లైకా ప్రొడక్షన్స్
సంగీతం: ఏఆర్ రెహ్మాన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ఛాయాగ్రహణం: సంతోష్ శివన్
నిర్మాతలు: సుభాస్కరన్ & మణిరత్నం
రచన-దర్శకత్వం: మణిరత్నం 

రేటింగ్: 3/5

మణిరత్నం సినిమా అంటే చాలు.. అందులో ఎవరు నటించారు? ఎలాంటి కథ? అనే ఆలోచనలు లేకుండానే థియేటర్స్ కి వెళ్ళిపోతుంటారు. ఇది మణిరత్నంకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్. అలాంటి వ్యక్తికి చాలాకాలం నుండి సరైన హిట్ రావడంలేదు. వైవిధ్య చిత్రాలని తీస్తున్నప్పటికీ ఫలితం మాత్రం దొరకడం లేదు.

అయితే ఈ సారి మాత్రం భారీ తారాగణంతో నవాబ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు మణిరత్నం. మరి ఈ చిత్రమైనా ఆయనకి ఒక మంచి హిట్ ఇస్తుందా లేదా అన్నది ఈ క్రింద చూద్దాం...

కథ:

భూపతి రెడ్డి (ప్రకాష్ రాజ్).. సిటీ లోనే అతిపెద్ద గ్యాంగ్ స్టర్. ఆయనకి ముగ్గురు కొడుకులు- వరద(అరవింద్ స్వామి), త్యాగు (అరుణ్ విజయ్) & రుద్ర (శింబు). ఒకరోజు భార్యతో కలిసి వెళుతున్న భూపతి రెడ్డి పైన హత్యాయత్నం జరుగుతుంది. దీనితో అందరూ అప్రత్తమవుతారు. తమ తండ్రిని ఎవరు చంపించడానికి చూసారు అంటూ ముగ్గురు కొడుకులు ఆరా తీస్తుంటారు. ఇది తెలుసుకోవడానికి తమకి మిత్రుడైన రసూల్ (విజయ్ సేతుపతి) సహాయం కోరతాడు వరద.

ఇంతలోనే గుండెపోటుతో ప్రకాష్ రాజ్ మరణిస్తాడు. ఇక ఆయన మరణం తరువాత ఆ స్థానంలోకి ఎవరు రావాలన్న వివాదం మొదలవుతుంది. ఇదే ఆ ముగ్గురి మధ్య గొడవకి కారణమవుతుంది.

ఇంతకి భూపతి రెడ్డి ని చంపేందుకు ప్రయత్నించింది ఎవరు? ఈ ముగ్గురిలో ఎవరికి తండ్రి స్థానం దొరికింది అనేది ఈ చిత్ర కథ.

నటీనటుల పనితీరు...

అరవింద్ స్వామి- ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఉండే పెద్ద కొడుకు వరద పాత్రలో జీవించాడనే చెప్పాలి. తన పాత్రకి సంబంధించిన చాలా రకాల హావభావాలు ప్రకటించాడు అరవింద్.

అరుణ్ విజయ్- తెలివైన రెండవ కొడుకుగా... బంధాల కన్నా బిజినెస్ కే ఎక్కువగా విలువనిచ్చే పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు.

శింబు- దేనికి భయపడని.. చివరకు తన తండ్రికి కూడా జడవని పాత్రలో శింబు భలేగా నటించాడు. చాలా సహజంగా ఉంది ఈయన నటన.

 

విజయ్ సేతుపతి: ఈ చిత్రంలో ఒక మంచి పాత్రే దక్కింది అని చెప్పాలి. ఈయన పాత్రే మనకి సినిమాలో కావాల్సినంత రిలీఫ్ ఇస్తుంది.

 

మిగతా నటీనటులు- ప్రకాష్ రాజ్, జయసుద, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్ & డయానా లు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.  

విశ్లేషణ:

మణిరత్నం సినిమాలో యాక్షన్, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా ఎన్ని ఉన్నా సరే అంతర్లీనంగా ఏదో ఒక పాయింట్ ఉంటుంది. ఈ చిత్రంలో కూడా అలాంటిదే ఒక పాయింట్ చెబుతాడు- అదే .. ఈ ప్రపంచంలో అందరూ ‘సున్నా’నే కాకపోతే బయటకి మాత్రం అది కనపడకుండా రకరకాల ముసుగులతో కనిపిస్తుంటారు అని చెప్పే ప్రయత్నం చేశాడు.

ఇక కథ విషయానికి వస్తే, తండ్రి పోయాక ఆ స్థానంలో ఎవరు తీసుకోవాలి అన్న ఆలోచన ఒక ముగ్గురు క్రిమినల్ మనస్తత్వం ఉన్న వారికి కలిగితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? కోరుకున్న దానికోసం బంధాలని కూడా లెక్క చేయని క్రూరమైన మనస్తత్వాలని ఈ చిత్రంలో చూడొచ్చు. 

అయితే ఇటువంటి యాక్షన్ డ్రామా చిత్రాన్ని ఓ థ్రిల్లర్ లా చూపే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కాకపోతే కథనం బలహీనంగా ఉండడంతో ద్వితీయార్ధంలో చివరకు వచ్చే ట్విస్టులని మనం ముందే ఊహించగలుగుతాము . ఇదే ఈ సినిమా పైన తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇలా ముందే అర్ధమవుతుండడంతో క్లైమాక్స్ బలహీనంగా కనిపిస్తున్నది. ఆఖరున వచ్చే ట్విస్టు అంతగా ఆకట్టుకొక పోవడానికి ముఖ్య కారణం కథనంలోని లోపాలే అని చెప్పొచ్చు.

సాంకేతికంగా..

సంతోష్ శివన్ కెమెరాపనితనం అద్భుతం అనే చెప్పాలి. మణిరత్నం దర్శకత్వానికి సంతోష్ శివన్ విజువల్స్ ప్రాణం పోశాయి. ఇక రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సన్నివేశాలని కరెక్ట్ గా ఎలివేట్ చేసేలా ఉంది. కథనంలోనే కొన్ని లోపాలు ఉన్నాయి, ముఖ్యంగా ద్వితీయార్ధంలో ఉన్న లోపాల కారణంగా క్లైమాక్స్ ని ముందే ఊహించేయోచ్చు.

ప్లస్ పాయింట్స్:

+ నటీనటుల
+ ఛాయాగ్రహణం
+ దర్శకత్వం
+ బ్యాగ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

-  ఊహించగలిగే ట్విస్టులు
-  కథనం

ఆఖరి మాట: థ్రిల్లర్ లో పస తగ్గింది. 

రివ్యూ రాసింది సందీప్

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS