తారాగణం: శ్రీవిష్ణు, సాట్న టైటస్ తదితరులు
నిర్మాణ సంస్థ: ARAN మీడియా వర్క్స్
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం: రాజ్ తోట
నిర్మాతలు: ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణ రావు
రచన్-దర్శకత్వం: వేణు ఉడుగుల
రేటింగ్: 3/5
ఆనందం ఎక్కడుంది?
చేసే ఉద్యోగంలో ఉందా?
అందుకునే సంపాదనలో ఉందా?
స్థిరపడడం అంటే.. మంచి ఉద్యోగం చేయడమా? నచ్చిన ఉద్యోగంలో ఉండడమా?
జీవితంలో ఎదగడం అంటే ఏమిటి?
సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేయడమా?? మిగిలిన వాళ్లంతా చేతకానివాళ్లేనా??
- ఇవన్నీ నేటి తరాన్ని వేధిస్తున్న ప్రశ్నలు.
వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది 'నీది నాదీ ఒకే కథ'. 'అప్పట్లో ఒకడుండేవాడు', 'మెంటల్ మదిలో'లాంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు శ్రీవిష్ణు. మంచి కథల్ని ఎంచుకుంటూ, తనకు తగిన పాత్రలు చేసుకుంటూ రాణిస్తున్నాడు. మరి ఈసారి ఎలాంటి కథతో వచ్చాడు? ఈ కథలో ఉన్న కొత్త పాయింట్ ఏమిటి?
* కథ
రుద్రరాజు సాగర్ (శ్రీవిష్ణు) చదువుల్లో ఎప్పుడూ లాస్టే. డిగ్రీ పరీక్షలు రాస్తూనే ఉంటాడు. పరీక్షలంటే భయం. హాల్ టికెట్ కూడా లేకుండా పరీక్ష హాల్‌లోకి అడుగుపెట్టే రకం. `అయ్యా నన్ను పాస్ చేయండి. లేదంటే ఆత్మహత్యే గతి..` అంటూ.. ఇన్విజిలేటర్లకు ఉత్తరం రాసే బాపతు. తండ్రేమో (దేవి ప్రసాద్) ఓ బాధ్యత గల ఉపాధ్యాయుడు. ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దాడు. కానీ తన కొడుకేమో అప్రయోజకుడిలా తయారయ్యాడు. తండ్రి కోసం ఏదోలా మారాలి అని గట్టి ప్రయత్నమే చేస్తాడు రుద్రరాజు సాగర్. కానీ ఆ ప్రయత్నాలన్నీ బెడసి కొడతాయి. దానికి తోడు కొత్త కన్‌ఫ్యూజన్లకు తెర లేస్తుంది. `ఇక ఈ చదువులు, పరీక్షలు నావల్ల కాదు.. నాకు నచ్చిన ఉద్యోగం చేసుకుంటా` అని తండ్రి ముందు తన గోడు వెళ్లగక్కుకుంటాడు. అప్పుడు తండ్రి ఏం చెప్పాడు? సాగర్ ఎలాంటి అడుగులు వేశాడు? అనేదే ఈ సినిమా కథ.
* నటీనటుల ప్రతిభ
శ్రీవిష్ణు మంచి నటుడన్నది తెలిసిన విషయమే. మరోసారి తనదైన శైలిలో సహజంగా నటించాడు. చిత్తూరు యాసలో.. అతను పలికిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. భావోద్వేగ భరితమైన సన్నివేశాల్లో మరింత బాగా ఇమిడిపోయాడు. తప్పకుండా అతని నటనకు ప్రశంసలు, అవార్డులూ దక్కుతాయి.
దర్శకుడు దేవి ప్రసాద్‌ని తండ్రి పాత్ర కోసం ఎంచుకుని సాహసం చేశాడు దర్శకుడు. అతని ప్రయత్నం ఫలించింది. తండ్రి పాత్రని చాలా అద్భుతంగా పోషించారు దేవి ప్రసాద్. ఆ పాత్రలో ఇప్పటి వరకూ ప్రకాష్‌రాజ్, రావు రమేష్‌లను చూసి విసిగిపోయిన జనానికి ఆయన రిలీఫ్ ఇచ్చాడు.
కథానాయిక పాత్రకు కూడా ప్రాధాన్యంఉంది. కానీ తెలిసిన ఫేస్ అయితే బాగుంటుంది. కథానాయకుడి చెల్లాయి, అమ్మ పాత్రల్లో కనిపించిన నటులు కూడా రాణించారు.
* విశ్లేషణ
ఈ సినిమా కథని చెబుతుంటే... చాలామంది కుర్రాళ్లు, తండ్రులు కనెక్ట్ అయిపోవొచ్చు. ఇది కూడా మన కథే అనుకోవొచ్చు. అలా టైటిల్‌కి న్యాయం జరిగిపోతుంది. ఇది డీవీడీల్లోంచి పుట్టిన కథ కాదు. జీవితాల్లోంచి పుట్టింది. అందుకే.. కనెక్టింగ్ పాయింట్ తొందరగా దొరికేసింది. తల్లిదండ్రుల ఆలోచనలు వేరు, పిల్లల ఇష్టాలు వేరు. ఈ రెండింటికీ లింకు దొరకనప్పుడే ఇలాంటి కథలు, రుద్రరాజు సాగర్ లాంటి వ్యక్తులు పుట్టుకొస్తుంటారు. సాగర్ ఆలోచనలు, అలవాటు, పరీక్షలంటే పడే ఇబ్బందులు.. ఇవేం కొత్త విషయాలేం కావు. మనకు ఎప్పుడో కప్పుడు ఎదురయ్యేవే. అందుకే కథలోకి తొందరగా వెళ్లిపోతాం.
దేవి ప్రసాద్, ధార్మిక పాత్రలు సమాజంలో కనిపించేవే. ప్రతీ ఇంట్లోనూ దేవి ప్రసాద్ లాంటి నాన్న ఉంటాడు. మేధావి ముసుగులో, ఆ ఇమేజ్ ఛట్రంలో బతికేస్తున్న ధార్మిక లాంటి అమ్మాయిల్నీ చూస్తూనే ఉంటాం. మనకు పరిచయమైన పాత్రలే కాబట్టి.. ఆయా సన్నివేశాల్ని సహజంగా తీర్చిదిద్దాడు కాబట్టి... కథ చకచక నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే రాను రాను.. `దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు? ఏం చెబుతున్నాడు?` అనే ప్రశ్న వేధించడం మొదలవుతుంది. క్రమంగా ట్రాక్ తప్పిన సందర్భాలూ ఉన్నాయి.
ప్రధమార్థంలో తండ్రి ఎప్పుడూ కొడుకుపై ఒత్తిడి తీసుకురాడు. ప్రేమగానే చూస్తుంటాడు. అయితే.. కథానాయకుడు తనలో తాను కుమిలిపోతుంటాడు. అదెందుకో అర్థం కాదు. ధార్మిక పాత్ర వచ్చి కథానాయకుడ్ని మరింత కన్‌ఫ్యూజ్ చేస్తుంటుంది. మధ్యలో ఊటీ ప్రయాణం కూడా కథకు సంబంధం లేనిదే. పర్సనాలిటీ డెవలెప్ మెంట్ క్లాసులపై, ఆయా పుస్తకాలపై కథానాయకుడు విరుచుకుపడిన సన్నివేశాలు, అక్కడ రాసుకున్న సంభాషణలు బాగున్నాయి.
అలా.. సూటిగా, సూదిలా గుచ్చుకుపోయే సీన్లుంటే బాగుండేది. ఆ డోసు తగ్గింది. చివర్లో.. ఇష్టమైన వృత్తి చేసుకోవడంలోనే సంతోషం ఉంది.. అనే పాయింట్ చెప్పి కథ ముగించారు. అది కూడా బలవంతంగా వేసిన ముగింపు కార్డే. అయితే ఈ ప్రయాణంలో ఉదాత్తమైన నాన్న పాత్రపై కాస్త మరక వేసే ప్రయత్నం జరిగింది. అది కూడా ఇబ్బంది పెట్టే విషయమే. దర్శకుడి ప్రయత్నం బాగుంది. అతని కథలో నిజాయితీ ఉంది. చెప్పే విధానంలో ఇంకాస్త క్లారిటీ అవసరం అనిపించింది.
* సాంకేతిక వర్గం
వేణుకి ఇదే తొలి చిత్రం. ఇలాంటి పాయింట్ ఎంచుకోవడం సాహసమే. దాన్ని సూటిగా చెప్పడంలో విజయం సాధించాడు. కానీ చెప్పే విధానంలో ఇంకాస్త ఓర్పు, నేర్పు అవసరం. పాటలు బాగున్నాయి. సీన్లో డెప్త్ లేనప్పుడు కూడా నేపధ్య సంగీతం భీకరంగా వినిపించాడు. మాటలు ఆకట్టుకున్నాయి. అయితే ఒకే ఇంటి మనుషుల మధ్య రకరకాల యాసలు వినిపించాయి. పాటల్లో సాహిత్య విలువలు కనిపించాయి. కెమెరా పనితనం బాగుంది.
* ప్లస్ పాయింట్స్
+ టైటిల్
+ నేపథ్యం
+ నటీనటుల ప్రతిభ
* మైనస్ పాయింట్స్
- ద్వితీయార్థం
* ఫైనల్ వర్డిక్ట్: అందరి కథ
రివ్యూ రాసింది శ్రీ