తారాగణం: విజయ్ దేవరకొండ, మెహ్రీన్, నాజర్, సత్యరాజ్,యషిక ఆనంద్, ప్రియదర్శి & తదితరులు
నిర్మాణ సంస్థ: స్టూడియో గ్రీన్
సంగీతం: స్యాం C.S.
ఛాయాగ్రహణం: సంతాన కృష్ణన్ రవిచంద్రన్
ఎడిటర్: రేమండ్
కథ-కథనం: షాన్ కరుప్పుసామి
నిర్మాత: KE జ్ఞానవేల్ రాజా
కథనం-దర్శకత్వం: ఆనంద్ శంకర్
రేటింగ్: 2.25/5
ఇటీవల కాలంలో నోటా సినిమాకు వచ్చినంత హైప్ అంతా ఇంతా కాదు. గీత గోవిందం చిత్రంతో యువతలో తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. విజయవాడ, హైదరాబాద్‌లో జరిగిన నోటా పబ్లిక్ మీట్స్‌లో విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్ ఏమిటో తెలిసిపోయింది. దాంతో సహజంగానే నోటాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.
తమిళంలో విజయ్ దేవరకొండకు అరంగేట్ర చిత్రమిదే కావడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరుముగన్ చిత్రంతో తమిళనాడులో టాలెంటెడ్ డైరెక్ట్‌గా గుర్తింపును తెచ్చుకున్న ఆనంద్‌శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఈ. జ్ఞానవేళ్ రాజా నిర్మించారు. రాజకీయ నేపథ్య ఇతివృత్తంతో రూపొందిన నోటా ప్రేక్షకుల్ని ఎంత వరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కథ..
సినిమా నటుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన వాసుదేవ్ (నాజర్) అనంతరకాలంలో రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి అవుతాడు. ఒక ప్రభుత్వ పథకానికి సంబంధించిన అవినీతి ఆరోపణల విషయంలో సీబీఐ విచారణ ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో తన పదవికి రాజీనామా చేస్తాడు. తాను నిర్దోషిగా బయటపడేలోపు లండన్‌లో ఉండే కొడుకు వరుణ్ (విజయ్ దేవరకొండ)ను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోమని కోరతాడు. వీడియో గేమ్ డిజైనర్‌గా స్థిరపడాలనుకున్న వరుణ్ అయిష్టంగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తాడు.
ఈలోపు ఢిల్లీలో జైలు నుంచి విడుదలై వస్తున్న సబ్రమణ్యంపై హత్యాప్రయత్నం జరగడంతో కోమాలోకి వెళ్లిపోతాడు. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పుతాయి. ఈ పరిస్థితుల్ని వరుణ్ ఎలా ఎదుర్కొన్నాడు? అయిష్టంగానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన వరుణ్ రౌడీ సీయంగా ప్రజల అభిమానాన్ని ఎలా పొందాడు? ఈ క్రమంలో జర్నలిస్ట్ మహేంద్ర (సత్యరాజ్) వరుణ్‌కు ఏ విధంగా సహాయం చేశాడు? సుబ్రహ్మణ్యం, మహేంద్రలకున్న సంబంధం ఏమిటి? తన తండ్రి జీవితం తాలూకు ఓ రహస్యాన్ని వరుణ్ ఎలా తెలుసున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా చిత్ర కథ.
నటీనటుల పనితీరు..
సాధారణంగా పొలిటికల్ డ్రామాల్లో నటించడానికి ఎంతో అనుభవమున్న అగ్ర కథానాయకులే సుముఖంగా ఉండరు. కానీ కెరీర్ తొలినాళ్లలోనే ఈ తరహా ఛాలెంజింగ్ రోల్‌ని స్వీకరించాడు విజయ్ దేవరకొండ. తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. యువ ముఖ్యమంత్రి పాత్రలో భిన్న షేడ్స్‌తో తన పాత్రను రక్తికట్టించాడు. రౌడీ సీఎంగా పాత్రకు చక్కగా కుదిరాడు. ఓ సాధారణ కథను విజయ్ తన భుజాలపై మోసాడు.
ఇక నాజర్, సత్యరాజ్ కీలకమైన పాత్రల్లో నటించారు. ద్వితీయార్థంలో నాజర్ మేకప్ ఎబ్బెట్టుగా అనిపించింది. జర్నలిస్ట్‌గా సత్యరాజ్ పాత్ర సినిమా ఆసాంతం ఆసక్తికరంగా సాగింది.
కథానాయిక మెహరీన్‌ది అతిథి పాత్ర అని చెప్పొచ్చు. ఆమె అభినయించడానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా పోయింది.
సినిమా కథనంతా విజయ్ దేవరకొండ, నాజర్, సత్యరాజ్ పాత్రల చుట్టూ అల్లుకోవడంతో మిగతా పాత్రలకు అంతగా ప్రాధాన్యతలేకుండా పోయింది. ఇతర పాత్రల్లో సంచన నటరాజన్, ప్రియదర్శి ఫర్వాలేదనిపించారు.
విశ్లేషణ..
నోటా దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైన పొలిటికల్ డ్రామానే. అనూహ్య పరిస్థితుల్లో సీఏంగా పదవీబాధ్యతలు స్వీకరించే ఓ యువకుడి కథ. ప్లేబాయ్‌గా జీవితాన్ని గడిపే వరుణ్ తండ్రి జైలుపాలు కావడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో కథ మొదలవుతుంది. ప్రథమార్థమంతా వరుణ్ పాత్ర చిత్రణలో పరివర్తనపై దృష్టిపెట్టాడు దర్శకుడు. అమ్మాయిలతో సరదాగా జీవితాన్ని గడిపే వరుణ్ ముఖ్యమంత్రి బాధ్యతలపై కనీన అవగాహన వుండదు. కార్యకర్తలు చేసిన బస్సు దహనంలో ఓ పాప మరణిస్తుంది. ఆ సంఘటన రాజకీయాల పట్ల వరుణ్ దృక్పథాన్ని మార్చివేస్తుంది. అక్కడి నుంచి వ్యవస్థను ప్రక్షాళన చేయాలని తపిస్తాడు వరుణ్.
ఈ క్రమంలో వరుణ్ తీసుకునే నిర్ణయాలు కథపై ఆసక్తిని పెంచుతాయి. పాప చనిపోయిన సందర్భంలో చెప్పిన సంభాషణలు, ఇంటర్వెల్ బ్యాంగ్‌లో రౌడీ సీయం వస్తున్నాడని స్వీట్ వార్నింగ్ ఇవ్వడం ఎఫెక్టివ్‌గా అనిపించాయి. ప్రథమార్థమంతా గ్రిప్పింగ్‌గా సాగింది. ద్వితీయార్థంలో వరద బారి నుంచి ప్రజల్ని రక్షించడానికి వరుణ్ సృష్టించిన వార్ రూమ్ చుట్టూ అల్లుకున్న డ్రామా ఉత్కంఠతను పంచుతుంది. అయితే అక్కడి నుంచి కథ గాడి తప్పుతుంది. అసంబద్ధ సన్నివేశాలతో పూర్తిగా నాటకీయత లోపించినట్లు అనిపించింది. స్వామిజీ పాత్ర...దాని చుట్టూ అల్లుకున్న పనామా హవాలా ఎపిసోడ్‌లో ఏమాత్రం లాజిక్ కనిపించదు.
కథను సాగతీయడానికే ఆ సన్నివేశాల్ని సృష్టించారనిపిస్తుంది. కథలో తమిళ రాజకీయ ఛాయలే ఎక్కువగా కనిపించాయి. తెలుగువారు ఈ తరహా కథతో కనెక్ట్ కావడం కష్టమే అనిపిస్తుంది. జైలు శిక్ష అనుభవిస్తున్న సీఎంను సాధారణ గదిలో బంధించడం, సిగరెట్, వాటర్ బాటిల్ కోసం అతను పైరవీ చేయడం సిల్లీగా అనిపిస్తుంది. కథానాయిక మెహరీన్ పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇక ప్రీ క్లైమాక్స్‌లో కథాగమనం కొంత ఉత్కంఠను పంచినా చివరకు సాధాసీదాగా ముగించారనిపిస్తుంది. అక్కడక్కడా వర్తమాన అంశాల్ని టచ్ చేసినట్లు అనిపించినా వాటిని పూర్తిస్థాయిలో ఆవిష్కరించలేదనిపిస్తుంది.
* ప్లస్ పాయింట్స్
+ విజయ్ దేవరకొండ
+ టైటిల్
* మైనస్ పాయింట్స్
- కథ, కథనం
- సెకండాఫ్
తీర్పు..
నోటా కథలో ఎలాంటి కొత్తదనం లేదు. సన్నివేశాల్లో వాస్తవికత, నాటకీయత లోపించాయి. అయితే విజయ్ దేవరకొండ పర్‌ఫార్మెన్స్ సినిమాకు పెద్దబలంగా నిలుస్తుంది. కథపై మరింత దృష్టిపెడితే ఈ రౌడీ సీయం ప్రేక్షకులను ఆకట్టుకునేవాడే. బాక్సాఫీస్ వద్ద నోటా విజయం సందేహాస్పదమే.
రివ్యూ రాసింది శ్రీ.