తారాగణం: నందమూరి బాలకృష్ణ, విద్యా బాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గబాటి, సుమంత్, ప్రకాష్ రాజ్, నరేష్ వికె, మురళీ శర్మ, కైకాల సత్యనారాయణ, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యా మీనన్, బ్రహ్మానందం & తదితరులు
నిర్మాణ సంస్థ: ఎన్.బి.కె.ఫిలిమ్స్
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఎడిటర్: ఎ.రామకృష్ణ
సినిమాటోగ్రఫీ: జ్ఙానశేఖర్
మాటలు: బుర్రా సాయిమాధవ్
నిర్మాతలు: బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
విడుదల: 9 జనవరి 2019
రేటింగ్: 3.5/5
కొన్ని జీవితాల గురించి తెలుసుకొంటున్నప్పుడు ఓ కథ విన్నట్టే అనిపిస్తుంది. కానీ కథలు కథలుగా చెప్పుకొనేంత జీవితం మాత్రం అతి కొద్దిమందికే ఉంటుంది. అలాంటి జీవితం ఎన్టీఆర్‌ది. ఆయన వెండితెర ప్రయాణం... ఓ చరిత్ర. ఆయన రాజకీయ ప్రయాణం ఓ సంచలనం. వ్యక్తిగా ఆయన క్రమశిక్షణ, నిబద్ధత, సాహసం, పౌరుషం... ఓ స్ఫూర్తి. ఇలా ఏ కోణంలో చూసినా ఎన్టీఆర్ ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి జీవితాన్ని తెరపైకి తీసుకు రావడం ఎంత అవసరమో, అంత సాహసం కూడా. ఆ సాహసోపేతమైన ప్రయత్నాన్ని విజయవంతంగా పూర్తి చేశారు క్రిష్. బాలకృష్ణ అన్నీ తానై తన తండ్రి పాత్రలో నటించడంతో పాటు... స్వయంగా నిర్మించారు కూడా. తెలుగు ప్రేక్షకులతోపాటు పొరుగు భాషలు కూడా ఆసక్తికరంగా ఎదురు చూసిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకొందాం...
కథ
ఎన్టీఆర్ అంటే గొప్ప కథానాయకుడు, మహానాయకుడు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన ఆ స్థాయికి ఎలా వచ్చారు? మంచి ఉద్యోగం సంపాదించుకొన్న ఆయన దాన్ని వదిలిపెట్టి, కథానాయకుడు ఎందుకు కావాలనుకొన్నారు? అయ్యాక భారతీయ తొలి సూపర్‌స్టార్‌గా ఎదిగి, ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్న ఆయన, ఉన్నట్టుండి ఆ వైభవాన్ని పక్కనపెట్టి ప్రజా జీవితంలోకి రావాలని ఎందుకనుకొన్నారు? ఆ ప్రయాణంలో ఎలాంటి కష్టనష్టాల్ని ఎదుర్కొన్నారు? కుటుంబం నుంచి ఎలాంటి సహకారం అందింది? తదితర విషయాలతో ఈ చిత్రం సాగుతుంది.
నటీనటుల పనితీరు..
తెరపై పాత్రలే తప్ప నటులెవ్వరూ కనిపించలేదు. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ ఒదిగిపోయారు. సినిమా గెటప్పుల్లో నూటికి నూరుపాళ్లు ఎన్టీఆర్‌నే గుర్తుచేశారు. మేకప్ లేని ఎన్టీఆర్‌గా కనిపిస్తున్నప్పుడు మాత్రం అక్కడక్కడా బాలకృష్ణ కనిపిస్తారంతే. ఏఎన్నార్‌గా సుమంత్ కనిపించిన విధానం మాత్రం పర్‌ఫెక్ట్ అనిపిస్తుంది. బసవతారకం పాత్ర సినిమాకి ఆయువుపట్టు అని చెప్పొచ్చు. ఆమె భావోద్వేగాలు పలికించిన విధానం ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్‌కి ఎప్పుడూ లక్ష్మణుడిలా పక్కన ఉండే తమ్ముడు త్రివిక్రమరావు పాత్రలో దగ్గుబాటి రాజా చాలా బాగా నటించారు. శ్రీదేవిగా రకుల్, సావిత్రిగా నిత్యమేనన్, కృష్ణకుమారిగా ప్రణీత, షావుకారు జానకిగా షాలినిపాండే తళుక్కున మెరుస్తారు. హరికృష్ణ పాత్రలో కల్యాణ్‌రామ్ చేసే సందడి కూడా ఆకట్టుకుంటుంది. ఆ పాత్రకి కూడా మంచి ప్రాధాన్యం దక్కింది. చాలా పాత్రల పరిధి తక్కువే అయినప్పటికీ ప్రతి పాత్ర గుర్తుండిపోయేలా చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. పాత్రలకి తగ్గట్టుగా నటుల్ని ఎంచుకొన్న విధానంలోనూ దర్శకుడి పనితనం మెచ్చుకొనేలా ఉంది.
విశ్లేషణ...
ఎన్టీఆర్ జీవితం అందరికీ తెలిసిందే కదా, అందులో సినిమాకి కావల్సిన ఆసక్తి ఏముంటుందనే ప్రశ్న రావొచ్చు. కానీ ఎన్టీఆర్ జీవితంలో చాలామందికి తెలియని విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా నవతరానికి. ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకొన్న కీలక మలుపులన్నింటినీ గుదిగుచ్చి ఈ సినిమాని తీశాడు దర్శకుడు క్రిష్. ప్రతీ సన్నివేశం భావోద్వేగభరితంగా సాగుతుంది. ఎన్టీఆర్ ఎదిగిన తీరు, ఆయన సాహసం ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపేలా చెప్పిన విధానం మెప్పిస్తుంది.
ఎన్టీఆర్ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెంతో నాటకీయ పరిణామాలు. వాటన్నింటినీ ఎంతో సహజంగా తెరకెక్కించి ఎంతో మంది ఆరాధ్యదైవంలా భావించే ఎన్టీఆర్ జీవితాన్ని కళ్లకు కట్టారు క్రిష్. ఈ కథ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయం నుంచి మొదలవుతుంది. ఆమె కోణంలోనే కథ సాగుతుంది. ఎన్టీఆర్ సాహసం, నిజాయతీ, కుటుంబానికి విలువనిచ్చిన తీరు, ఆయన క్రమశిక్షణ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలతో ప్రేక్షకుడు కథలో లీనమైపోతాడు. అచ్చంగా తెరపై ఎన్టీఆర్ జీవితాన్నే చూస్తుంటారు. ఎక్కడా పాత్ర కనిపించదు, అన్నీ జీవితాలే. ఎన్టీఆర్ కథానాయకుడిగా ఎదగడం కోసం మద్రాసు చేరుకోవడం, అక్కడి అందరిలాగే సినిమాలు కష్టాలు పడిన తీరుని తెరపై ఆకట్టుకునేలా చూపించారు క్రిష్.
ఆ తర్వాత ఆయన నటవైభవం మొదలు కావడం, ఎన్టీఆర్‌ని ఓ దేవుడిలాగా చూడటం వంటి సన్నివేశాలు కథని మరో స్థాయికి తీసుకెళతాయి. ప్రతి ఐదు నిమిషాలకోసారి ఎన్టీఆర్ పోషించిన పాత్రలు, వాటి వెనక ఎన్టీఆర్ సాహసాల్ని తెరపై చూపించాడు దర్శకుడు. దాంతో ప్రతి సన్నివేశం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. అదే సమయంలో ఆయన కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్ని కూడా చక్కగా తెరపైకి తీసుకొచ్చారు. ఎన్టీఆర్, బసవతారకం మధ్య అనుబంధం... ఎన్టీఆర్ - ఏఎన్నార్‌ల స్నేహం, వారి మధ్య పోటీ వాతావరణం మనసుల్ని హత్తుకుంటుంది. రాయలసీమ కరువు, దివిసీమ ఉప్పెన.. ఆ సమయాల్లో ఇద్దరు కథానాయకులు కదిలిన తీరుని కూడా తెరపై సహజంగా చూపించారు.
ప్రతి సన్నివేశంలోనూ ఏదో ఒక కొత్త పాత్ర ప్రవేశిస్తూ ప్రేక్షకుల్లో ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తుంటుంది. ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఎంత సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకునేవారు, ప్రజల కష్టాల్ని చూసి ఎలా స్పందించేవారనే విషయాల్ని చాలా బాగా తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు. తెలుగువారికి జరుగుతున్న అన్యాయాన్ని, తెలుగువారి దీన స్థితిని చూసి సహించలేక ఎన్టీఆర్ తీసుకొన్న రాజకీయ నిర్ణయంతో ఈ కథ ముగుస్తుంది. చంద్రబాబు, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి పాత్రలు పతాక సన్నివేశాల్లో దర్శనమిస్తాయి.
సాంకేతిక వర్గం...
సాయిమాధవ్ బుర్రా సంభాషణలు చిత్రానికి మరింత వన్నెతెచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి గురించి, ఎమర్జెన్సీ సమయంలోనూ, ఇన్కమ్‌ట్యాక్స్ అధికారుల దాడుల సమయంలోనూ...వచ్చే సంభాషణలు ఆకట్టుకుంటాయి. జ్ఞానశేఖర్ కెమెరా పనితనం, ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం చిత్రం స్థాయికి తగ్గట్టుగా ఉంది. దర్శకుడు క్రిష్ కథని మలిచిన విధానం, నటుల ఎంపిక, పాత్రలకి ఇచ్చిన ప్రాధాన్యం మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు కూడా సినిమాకి నిండుతనాన్ని తెచ్చాయి.
* ప్లస్ పాయింట్స్
+ కథ
+ ఎన్టీఆర్, ఏఎన్నార్, బసవతారకం పాత్రలు
+ నటీనటులు
+ భావోద్వేగాలు
+ సంభాషణలు
* మైనస్ పాయింట్స్
- నిడివి సుదీర్ఘంగా సాగడం
పైనల్ వర్డిక్ట్: భావితరాలకి కూడా గుర్తుండిపోయేలా ఎన్టీఆర్ చరిత్రని ఆవిష్కరించిన చిత్రమే 'ఎన్టీఆర్ కథానాయకుడు'
రివ్యూ రాసింది శ్రీ.