నటీనటులు: సుధాకర్ కొమకుల, నిరోషా, నిత్య శెట్టి తదితరులు.
దర్శకత్వం: డి హరినాథ్ బాబు
నిర్మాత: శ్రీకాంత్ దడువై
సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫర్: వెంకట్ దిలీప్
ఎడిటర్: ఎస్ బి ఉద్దవ్
విడుదల తేదీ: మే 03, 2019
రేటింగ్: 2.75/ 5
అనుభవానికి మించిన పాఠం లేదు. జీవితం ఎప్పుడూ ఈ పాఠాల్ని నేర్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. వాటిని అర్థం చేసుకుని.. తప్పుల్ని సరిదిద్దుకుని ముందుకు సాగితేనే విజయం వరిస్తుంది. - ఈ పాఠాన్ని ఓ కథగా మలిచి, పాత్రల్ని జోడించి, సినిమాగా తీసే ప్రయత్నం చేస్తే అదే.... `నువ్వు తోపురా`. సొంతూరులో ఎలాంటి బాదరబందీ లేకుండా పెరిగిన కుర్రాడు.. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం వెళ్లి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో చెప్పిన కథ ఇది. ఇంకాస్త డిటైల్డ్‌గా చెప్పుకుంటే...
* కథ
సూరి (సుధాకర్ కోమాకుల)ది సరూర్ నగర్. `నాకంటే తోపు లేడిక్కడ` అనుకుంటూ సరదాగా స్నేహితులతో గడిపేస్తుంటాడు. బీటెక్ మధ్యలోనే ఆపేశాడు. ఎలాంటి బాధ్యతలూ లేవు. రమ్య (నిత్య శెట్టి)ని చూసి ప్రేమిస్తాడు. తనేమో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోతుంది. సూరికి కూడా అనుకోకుండా అమెరికా వెళ్లే ఛాన్స్ వస్తుంది. రమ్య కోసం... అమెరికాలో అడుగుపెడతాడు. అక్కడికి వెళ్లాక తన జీవితం మొత్తం మారిపోతుంది. నా అనుకున్న వాళ్ల విలువ, సొంత ఊరు గొప్పదనం అర్థమవుతాయి. ఆ ప్రయాణంలో సూరి ఏం నేర్చుకున్నాడు? ఎలా ఎదిగాడు? రమ్యని అమెరికాలో కలిశాడా, లేదా? వారి ప్రేమకథ ఏమైంది? అనేదే మిగిలిన సినిమా.
* నటీనటులు
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌తో ఆకట్టుకున్నాడు సుధాకర్. ఈ సినిమాలోనూ తన ప్రతిభ బాగానే చూపించాడు. హీరోకి కావల్సిన లక్షణాలు తనలో ఉన్నాయి. అన్ని రకాల ఎమోషన్స్‌నీ పండించగలగుతున్నాడు. నిత్య శెట్టి ఓకే అనిపిస్తుంది. అందం పరంగా, అభినయం పరంగా తనకి యావరేజ్ మార్కులే. నిరోషా లాంటి ప్రతిభ ఉన్న నటిని సరిగావాడుకోలేదేమో అనిపిస్తుంది. వరుణ్ సందేశ్ అతిథి పాత్రలో కనిపిస్తాడు. మిగిలిన వాళ్లంతా పాత్ర పరిధి మేర నటించారు.
* సాంకేతిక వర్గం
కెమెరా పనితనానికి మంచి మార్కులు పడతాయి. అమెరికా నేపథ్యంలో సాగే సన్నివేశాల్ని కలర్ ఫుల్‌గా తీర్చిదిద్దారు. పాటలు, మాటలు నచ్చుతాయి. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ లో విషయం ఉంది. ఇంకాస్త కసరత్తు చేసుంటే కచ్చితంగా మంచి సినిమా అవుదును.
* విశ్లేషణ
మొసలి బలమైనదే. కానీ దాని బలం నీళ్లలోఉన్నంత వరకే. ఒడ్డున వస్తే.. ఒక్కసారిగా దాని సత్తువ తగ్గిపోతుంది. మనిషి కూడా అంతే. సొంతూరులో తనకంటే తోపుగాడు ఉండడు. కానీ ఊరు కాని ఊరులో ఆ పొగరు పనిచేయదు.. - నువ్వు తోపురా కథలో దర్శకుడు కూడా ఇదే అంశాన్ని చెప్పాలనుకున్నాడు. దానికి కాస్త ఎమోషన్, ఫ్రెండ్‌షిప్,డ్రామా మిక్స్ చేసి తీసిన సినిమా ఇది. సరూర్ నగర్‌లో సూరి అనే కుర్రాడు..తనని తాను ఎలా తెలుసుకోగలిగాడు అనే పాయింట్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. తొలి సన్నివేశాలు సరదాగా సాగిపోతాయి.
సరూర్ నగర్‌లో సూరి చేసే అల్లరి, రమ్యతో ప్రేమ.. వాటితో టైమ్ పాస్ అయిపోతుంది. తెలంగాణ యాసలో చెప్పే డైలాగులు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేస్తాయి. ద్వితీయార్థం అంతా అమెరికాలోనే సాగింది. అమెరికాలో సరూర్ నగర్ సూరి పడే పాట్లు, అక్కడ తనకి ఎదురైన అనుభవాలు.. ద్వితీయార్థానికి కీలకం. మనుషుల విలువని సూరి ఎలా తెలుసుకున్నాడు? అనే పాయింట్‌పై ద్వితీయార్థం సాగుతుంది. ఇక్కడే దర్శకుడు ఎమోషన్‌ని బాగా పండించగలిగాడు. అక్కడక్కడ ఫన్... కాస్త ఎమోషన్ మిక్స్ చేసుకుంటూ కథని బాగానే నడిపాడు. కథలో క్రైమ్ ఎలిమెంట్స్ తో యాక్షన్‌కి కూడా స్కోప్ దొరికింది.
హ్యూమన్ యాంగిల్ ఉన్న కథ ఇది. దాన్ని అన్ని హంగులతో చెప్పాలన్న ప్రయత్నం మంచిదే. ఈ విషయంలో దర్శకుడు సఫలీకృతమయ్యాడు. అయితే కీలకమైన సన్నివేశాల చోట తడబడ్డాడు. సూటిగా చెప్పాల్సిన సన్నివేశాన్ని లాగ్ చేశాడు. కాస్త డిటైల్డ్‌గా చెప్పాల్సిన చోట... తొందరతొందరగా ముగించాడు. ఇదే కథ, అనుభవం ఉన్న దర్శకుడి చేతిలో పడితే మరోలా ఉండేదేమో. పతాక సన్నివేశాల్ని కూడా తొందరగా ముగించేయాలన్న తపన కనిపిస్తుంది. కథ పరంగా దర్శకుడు తీసుకున్న పాయింట్ మంచిది. ఇంకాస్త ఆసక్తికరమైన సన్నివేశాలతో నడిపించి ఉంటే.. ఇది కూడా తోపు సినిమాల్లో ఒకటిగా మిగిలేది.
* ప్లస్ పాయింట్స్
+ కథ, సంభాషణలు
+ ఎమోషన్ సీన్స్
* మైనస్ పాయింట్స్
- స్లో నేరేషన్
- అక్కడక్కడ గందరగోళం
* ఫైనల్ వర్డిక్ట్: తోపూ కాదు... ఫ్లాపూ కాదు
- రివ్యూ రాసింది శ్రీ.