'స్పైడర్' సినిమాలో కరడు కట్టిన విలన్‌గా కనిపించిన ఎస్.జె.సూర్య, హీరోగానూ, దర్శకుడిగానూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన హీరోగా నటించిన పలు చిత్రాలు తెలుగులోకి అనువాదమయ్యాయి గతంలో. పవన్ కళ్యాన్ హీరోగా నటించిన 'కొమరం పులి' చిత్రానికి ఎస్.జె.సూర్య దర్శకుడు.
ఇదిలా ఉంటే, తాజాగా మన హీరో కమ్ డైరెక్టర్ గారు 'మాన్స్టర్' అనే ఓ సినిమాలో నటించారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. టైటిల్‌ని బట్టి ఇదేదో పెద్ద జంతువు సినిమా అనుకునేరు. కానే కాదు, చిన్న ఎలుక సినిమా. చిన్న ఎలుకే కదా అని అంత తేలిగ్గా తీసేయకండి. 'ఈగ'తో సినిమా తీసి మన రాజమౌళి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేయలే. ఈ మధ్య విలక్షణ దర్శకుడు రవిబాబు పందిపిల్లతో 'బంటి' అనే సినిమాని తెరకెక్కించారు. అయితే, రిజల్ట్ ఆశించిన స్థాయిలో అందలేదులెండి. కానీ, ఎస్.జె.సూర్యని అంత తక్కువగా అంచనా వేయడానికి లేదు మరి. అసలింతకీ ఈ మాన్స్టర్ ఎలుక కథేంటంటే, హీరోని ముప్పు తిప్పలు పెట్టడమే.
తద్వారా కలిగే వినోదాన్ని ఆడియన్స్ ఎంజాయ్ చేయడమే అదీ సింపుల్‌గా ఈ కాన్సెప్ట్. అయితే ఈ తరహా కాన్సెప్ట్‌లో గతంలోనూ పలు చిత్రాలు వచ్చేశాయి. అయితే అప్పటికీ, ఇప్పటికీ ఉన్న తేడా సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది. విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యత పెరిగింది. సో ఈ సినిమాలో అంతకు మించి ఇంకేదో కొత్తగా చూపించబోతున్నారని ఊహించుకోవాలి. ఈ సమ్మర్‌లోనే సూర్య 'మాన్స్టర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. సెలవుల సీజన్ కాబట్టి, మన ఈ బుల్లి మాన్స్టర్ ఎలుక గారి అల్లరికి కాసులు బాగానే రాలొచ్చేమో చూడాలిక.