నటీనటులు : సంజయ్ రావ్, విశ్వంత్, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ తదితరులు
దర్శకత్వం : చెందు ముద్దు
నిర్మాత : ఆనంద్ ప్రసాద్
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫర్ : సునీల్ కుమార్
ఎడిటర్: వెంకట ప్రభు
రేటింగ్: 2.5/5
ప్రేక్షకులు ఎక్కడివాళ్లైనా సరే, దయార్థ హృదయులు. వాళ్లకో పాయింటు నచ్చితే చాలు. సినిమా చిన్నదా, పెద్దదా? అందులో స్టార్లున్నారా, కొత్తవాళ్లు చేశారా? అనే విషయాలు ఆలోచించరు. బడ్జెట్ గురించి అస్సలు పట్టించుకోరు. లక్షల్లో తీసిన సినిమాకైనా కోట్లు ధార బోస్తారు. సినిమా నచ్చకపోతే... వందల కోట్ల బడ్జెట్ అయినా ఏమాత్రం ఖాతరు చేయరు. ప్రేక్షకుల్ని నమ్మే చిన్న సినిమాలు, నిర్మాతలు ధైర్యం చేస్తారు. కథలో బలం ఉందంటే... రంగంలోకి దూకేస్తారు. కాకపోతే.. ఆ కథలో విషయం ఉండాలి. పిట్ట కథైనా, పెద్ద కథైనా... మ్యాజిక్ జరగాలి. మరి ఇప్పుడొచ్చిన ``ఓ పిట్టకథ`` ఎలాంటిది? అందులోని విషయం ఎంత?
* కథ
వెంకటలక్ష్మి (నిత్యాశెట్టి)కి తండ్రంటే ప్రాణం. వాళ్లిద్దరూ తండ్రీ కూతుర్లలా కాకుండా స్నేహితుల్లా ఉంటారు. చైనా నుంచి వచ్చిన బావ క్రిష్ (విశ్వంత్)కి వెంకటలక్ష్మి బాగా నచ్చుతుంది. తననే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. పరీక్షలు పూర్తయ్యాక సరదాగా అరకు వెళ్లిన వెంకటలక్ష్మి మాయం అయిపోతుంది. వెంకటలక్ష్మి ఏమైపోయిందో పోలీసులకూ అంతుపట్టదు. క్రిష్ అనుమానం అంతా... ప్రభు (సంజయ్ రావు)పైనే. ఇంతకీ ప్రభు ఎవరు? ప్రభుకి వెంకటలక్ష్మిని కిడ్నాప్ చేసేంత అవసరం ఏమొచ్చింది? అనేది తెరపై చూడాలి.
* విశ్లేషణ
సినిమా అంతా అయిపోయాక దర్శకుడు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అనే బదులు... కన్‌ఫ్యూజన్ స్టోరీ, కన్‌ఫ్యూజన్ స్క్రీన్ ప్లే, కన్‌ఫ్యూజన్ డైరెక్షన్ అని తన పేరు వేసుకున్నాడు. అంటే... సినిమా చూశాక ప్రేక్షకులు తప్పకుండా గందరగోళానికి గురవుతారని దర్శకుడు ముందే ఊహించాడన్నమాట. సినిమా కూడా అలానే ఉంది. థ్రిల్లర్ సస్పెన్స్ జోనర్ సినిమాలు చూసొచ్చాక ప్రేక్షకులు అది అలా ఎందుకు జరిగింది? ఇలా ఎందుకు జరిగింది? అని ప్రశ్నలు వేసుకోకూడదు. సినిమా చూస్తున్నప్పుడే ఈ ప్రశ్నలు తలెత్తాలి. దానికి సినిమాలోనే సమాధానాలు ఇచ్చేయాలి. అలా ఇవ్వలేదంటే కచ్చితంగా కథ, కథనాల్లో లోపం ఉన్నట్టే. ఈ సినిమాలోనూ అదే జరిగింది.
ప్రధమార్థం అంతా బావ మరదళ్ల సరదాలు, పల్లెటూరి ప్రేమ.. కిడ్నాప్ డ్రామా వీటిపై సాగుతుంది. ద్వితీయార్థంలో కొన్ని మలుపులుంటాయి. అంటే ఫస్టాఫ్ కథని బేస్ అన్నమాట. కీలకమైన విషయాలన్నీ ఇంట్రవెల్ తరవాతే ఉంటాయి. అలాంటప్పుడు ఫస్టాఫ్‌లో ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టే స్టఫ్ కావాలి. అది ఈ పిట్టకథలో మిస్సయ్యింది. కథ చాలా ఫ్లాట్‌గా మొదలవుతుంది. బావా మరదళ్ల సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. కిడ్నాప్ డ్రామా మొదలయ్యాక కథ జోరుగా సాగాలి. కానీ ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు మరింత రొటీన్‌గా ఉంటాయి.
రెండు ప్రధాన పాత్రల మీద అనుమానం వచ్చేలా చేయడంతో విశ్రాంతి కార్డు పడుతుంది. ద్వితీయార్థంలో కొన్ని మలుపులు ఉన్నాయి. కాకపోతే... వాటిలో కొన్ని ప్రేక్షకుడు ముందే ఊహిస్తాడు. వాటిని రివీల్ చేసే టెక్నిక్కు కూడా సరిగా లేదు. మార్పింగు, వాయిస్ ఆప్‌లను పట్టుకుని సస్పెన్స్ డ్రామాలు తీస్తానంటే ఎలా? కథ ఎలాగున్నా, స్క్రీన్ ప్లే బలంగా ఉండాలి. సన్నివేశాలు ఆకట్టుకునేలా సాగాలి. లేదంటే పిట్ట కథ కాదు, పర్వతంలాంటి కథైనా పేలిపోతుంది.
*నటీనటులు
బ్రహ్మజీ తనయుడు సంజయ్ ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాడు. బ్రహ్మాజీ తనయుడిని ప్రమోట్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. చాలామంది సెలబ్రెటీల్ని తీసుకొచ్చి ప్రమోట్ చేశాడు. ఆ కష్టం, శ్రమ కథని వెదికి పట్టుకుంటే బాగుండేది. తన నటన కూడా అంతంత మాత్రమే. విశ్వంత్‌కి కూడా గొప్ప పేరొచ్చే పాత్ర కాదు. కాకపోతే నిత్యాశెట్టి బాగుంది. తనలో స్వాతి పోలికలు కనిపిస్తాయి. బ్రహ్మాజీ తన కొడుకు సినిమా కదా అని నటించి ఉంటాడు. ఆ పాత్రకూ వెయిటేజీ లేదు.
* సాంకేతిక వర్గం
ఇలాంటి సినిమాలకు స్క్రిప్టు స్ట్రాంగ్‌గా ఉండాలి. కథలో మలుపులు ఆశ్చర్యపరచాలి. అవేమీ ఈ సినిమాలో కనిపించలేదు. ద్వితీయార్థంలో కొన్ని మలుపుల్ని నమ్ముకుని తీసిన సినిమా ఇది. కానీ ఆ మలుపుల్ని రివీల్ చేసే విధానమూ నచ్చదు. ఒకే సన్నివేశాన్ని రెండు మూడుసార్లు చూపించడం వల్ల... మరింత బోర్ కొడుతుంది. పాటలు, నేపథ్య సంగీతం అంతంత మాత్రమే. ఫొటోగ్రఫీ మాత్రం బాగుంది.
* ప్లస్ పాయింట్స్
ద్వితీయార్థంలో మలుపులు
* మైనస్ పాయింట్స్
నత్తనడక
బోరింగ్ స్క్రీన్ ప్లే
* ఫైనల్ వర్డిక్ట్: నిజంగానే పిట్టంత కథ