నటీనటులు: ఆది, సాషా చెత్రి, అనీష్ కురువిల్లా, కృష్ణుడు, రావు రమేష్ తదితరులు
దర్శకత్వం: అడివి సాయి కిరణ్
నిర్మాణం: ప్రతిభా అడవి, కట్టా ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బిహెచ్, సత్ష్ డేగల
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫర్: జైపాల్ రెడ్డి
విడుదల తేదీ: అక్టోబర్ 18, 2019
రేటింగ్: 2.5/5
దేశభక్తి అనేది బలమైన కమర్షియల్ అంశం. దాన్ని సరిగా తీస్తే.. రోజాలాంటి సినిమాలొస్తాయి. కానీ భావోద్వేగాల్ని సరైన దిశలో మేళవించగలగాలి. నేటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్ని సరైన రీతిలో కథలో ఆవిష్కరించగలగాలి. కశ్మీర్ అంశం కచ్చితంగా ఎప్పటికీ బలమైన దేశ భక్తి కథే అవుతుంది.
ఎవరు చెప్పినా - ఎన్ని రకాలుగా ఆవిష్కరించినా, ఇంకా చెప్పగలిగే కోణాలు చాలా ఉన్నాయి. అందుకే... కశ్మీరీ పండిట్స్ కోణంలోంచి కశ్మీరీ సమస్యని చెబుతూ `ఆపరేషన్ గోల్డ్ ఫిష్`ని రూపొందించారు. మరి... ఇందులో దేశభక్తి ఎంత? భావోద్వేగాల మేళవింపు ఎంత? కమర్షియల్‌గా ఈ సినిమా ఎంత వరకూ వర్కవుట్ అవుతుంది?
* కథ
కశ్మీరీ పండిట్స్‌ని ఊచ కోత కోసిన ప్రముఖ ఉగ్రవాది ఘాజీ బాబా (అబ్బూరి రవి)ని పట్టుకుని చట్టానికి అప్పగిస్తాడు కమాండో అర్జున్ పండిట్ (ఆది). ఘాజీ బాబాకు న్యాయ స్థానం ఉరి శిక్ష విధిస్తుంది. ఈలోగా ఘాజీ బాబాని విడిపించడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతారు. అందులో భాగంగా విదేశాంగ మంత్రి (రావు రమేష్) కూతుర్ని కిడ్నాప్ చేసి, ఆమెని చంపుతామని బెదిరించి, ప్రతిగా తమ నాయకుడ్ని విడిపించాలని చూస్తుంది.
మంత్రి కూతుర్ని రక్షించి, ఉగ్రవాదుల కుట్రని భగ్నం చేసే బాధ్యత అర్జున్ పండింట్ తీసుకుంటాడు. మంత్రి కూతుర్ని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారా, లేదా? చేస్తే వాళ్ల చెర నుంచి అర్జున్ పండిట్ ఎలా తప్పించాడు? అనే విషయాల్ని తెరపై చూడాల్సిందే.
* నటీనటులు
కమాండో అర్జున్ పండిట్‌గా ఆది సాయికుమార్ నటించాడు. ఇప్పటి వరకూ ఇలాంటి సీరియస్ పాత్రని తాను చేయలేదు. అంత వరకూ కొత్తగానే ఉంటుంది. సీరియస్‌గా కనిపించడం తప్ప, ఆది చేసిందేం లేదు. ఎయిర్ టెల్ పాపని ఈ సినిమా కోసం హీరోయిన్ గా ఎంచుకున్నారు.
తను ఎయిర్ టెల్‌తో గుర్తింపు పొందిన మోడల్ అని ఎవరో చెబితే గానీ, థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడూ గుర్తించలేడు. అబ్బూరి రవిలోని నటుడ్ని పరిచయం చేయడానికి ఈ సినిమా తీశారేమో అనిపిస్తుంది. ఈ పాత్ర వరకూ సర్‌ప్రైజింగ్ ప్యాకేజీ అనుకోవాలి. మనోజ్ నందం కూడా ఆకట్టుకుంటాడు. మిగిలినవాళ్లుచేసిందేం లేదు.
* సాంకేతిక వర్గం
టెక్నికల్‌గా ఈ సినిమా చాలా వీక్‌గా ఉంది. డీఐ కూడా సరిగా చేయలేదు. ఆర్.ఆర్ ఎఫెక్టీవ్‌గా లేదు. స్క్రిప్టు ఇంకా పకడ్బందీగా రాసుకోవాల్సింది. ఉన్నది ఒక్కటే ట్విస్టు. అది కూడా తేలిపోయింది. యాక్షన్ సన్నివేశాల్ని డిజైన్ చేసిన పద్ధతి సరిగా లేదు. కశ్మీరీ పండిట్స్ సమస్య లోతుల్లోకి దర్శకుడు వెళ్లలేదు. ఎమోషనల్ సీన్స్ సరిగా వర్కవుట్ కాలేదు. కాలేజీ నేపథ్యంలో సాగే సన్నివేశాల్ని ట్రిమ్ చేయాల్సింది.
* విశ్లేషణ
నిజానికి మంచి కాన్సెప్ట్ ఇది. ఓ రకంగా చెప్పాలంటే అంగ రక్షకుడు కథని అటూ ఇటూ తిప్పి, కశ్మీరీ సమస్యకు ముడి పెట్టి తీసే ప్రయత్నం చేశారు. అంగరక్షకుడులో హీరో.. హీరోయిన్ పక్కనే ఉంటాడు. ఇక్కడ మాత్రం హీరోయిన్‌కి కనపడకుండా దూరం నుంచే రక్షిస్తుంటాడు. ఉగ్రవాదులపై కమాండోలు చేసే దాడులు, ఉగ్రవాదుల రహస్య సంకేతాల్ని పసిగట్టడం.. ఇలాంటి అంశాలు సాధారణంగానే ఆసక్తికంగా ఉంటాయి. `ఆపరేషన్ గోల్డ్ ఫిష్`లో అలాంటి సన్నివేశాలు చూసే అవకాశం దక్కింది. కథ.. ఎప్పుడైతే కాలేజీ నేపథ్యంలోకి వెళ్లిందో.. అక్కడి నుంచే విసుగు మొదలవుతుంది.
ఈ కథని చెప్పేందుకు ఎంచుకున్న నేపథ్యం సరికాదనిపిస్తుంది. అక్కడ జరిగే సన్నివేశాలు బాగా బోర్ కొట్టిస్తాయి. కామెడీ చేసేందుకు చేసిన ప్రయత్నాలేం సఫలీకృతం కాలేదు. పైగా విసుగొస్తుంది. కథలో మూడ్ పాడు చేస్తుంది. ద్వితీయార్థంలో కూడా అంతే. ఉగ్రవాదులకూ - కమాండోలకు మధ్య జరిగే పోరు ఇది. ఎంత రసవత్తరంగా ఉండాలి? ఎన్ని సార్లు ఎత్తుకు పై ఎత్తులు వేయాలి? కానీ అవేం కనిపించలేదు. ఈమధ్య ఇలాంటి నేపథ్యంలోనే కొన్ని వెబ్ సిరీస్‌లు వచ్చాయి. అందులో ఉన్న ఆసక్తి.. ఈ సినిమాలో కనిపించలేదు. పతాక సన్నివేశాలకు ముందు ఓ ట్విస్టు వస్తుంది. ఆ ట్విస్టు థ్రిల్ ఏమీ కలిగించదు. సరికదా... ఈ మాత్రం దానికి ఇప్పటి వరకూ దాయడం ఎందుకు ? అనిపిస్తుంది.
ఇలాంటి తెలివితేటలు మిగిలిన విషయాల్లో చూపిస్తే బాగుండేది. ఉగ్రవాదులు ఓ చోట దాక్కుంటే వాళ్లపై కమాండోలు చేసే ఆపరేషన్ ఏ స్థాయలో ఉండాలి? కానీ.. బడ్జెట్‌లు సహకరించకపోవడం వల్ల.. ఇద్దరు ముగ్గురు కమాండోలని దింపి.. ఆపరేషన్ పూర్తి చేయాలని భావించారు. దాంతో ఆ సన్నివేశాలు కూడా.. సరిగా రాలేదు. ఇలాంటి సినిమాలు చూస్తున్నంత సేపూ ఓ ఎమోషన్ ప్రేక్షకుడ్ని కుదిపేయాలి. అణువణువూ దేశభక్తి రగల్చాలి. ఓ పాత్ర చనిపోతే.. ప్రేక్షకుడు ఎమోషనల్ అవ్వాలి. కృష్ణుడు పాత్రని ఉగ్రవాదులు చంపేసినా ఎలాంటి ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఈ కథతో అప్పటికే ప్రేక్షకుడు డిస్కనెక్ట్ అయిపోతాడు.
* ప్లస్ పాయింట్స్
దేశ భక్తి నేపథ్యం
* మైనస్ పాయింట్స్
కథనం
సాంకేతిక విలువలు
* ఫైనల్ వర్డిక్ట్: ఆపరేషన్ ఫెయిల్.
- రివ్యూ రాసింది శ్రీ