నటీనటులు : రామ్స్, శ్వేతా వర్మ, రవి వర్మ, జై చంద్ర తదితరులు
దర్శకత్వం : శ్రీ కృష్ణ, రామ సాయి
నిర్మాతలు : కౌశిక్ కుమార్, రామ సాయి
సంగీతం : స్మరన్ సాయి
సినిమాటోగ్రఫర్ : కార్తీక్ పార్మర్
ఎడిటర్ : రానా ప్రతాప్
రేటింగ్: 2.75/5
ఓటీటీలు వచ్చాక.. చిన్న సినిమాలకు మరింత ఊతం వచ్చింది. బలమైన కథ, కొత్త ఆలోచనలు ఉండీ, చిన్న బడ్జెట్ లో సినిమాలు తీయగల సామర్థ్యం ఉంటే చాలు. అలాంటి ప్రయత్నాలకు ఓటీటీ వేదిక కల్పిస్తోంది. ఓటీటీ వల్ల ఉపయోగం ఏమిటంటే.. కమర్షియల్ సూత్రాల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. అన్ని వర్గాల వారికీ నచ్చే కథ చెప్పాలన్న నియమం కూడా ఉండదు. టార్గెట్ ఆడియన్స్ కి నచ్చితే సరిపోతుంది. ముఖ్యంగా థ్రిల్లర్స్ కి ఓటీటీ మంచి వేదిక. అమేజాన్ లో విడుదలైన `పచ్చీస్` కూడా థ్రిల్లరే. దాదాపుగా కొత్త వారితో నిర్మించిన చిత్రమిది. మరి.. `పచ్చీస్`లో ఉన్న కొత్తదనమేంటి? ఏ వర్గానికి నచ్చుతుంది?
* కథ
రామ్ (అభిరామ్) ఓ ఆవారా అబ్బాయి. బసవరాజు దగ్గర పనిచేస్తుంటాడు. పేకాట, బెట్టింగ్..లకు బాసిసై.. లక్షలు పోగొట్టుకుంటాడు. ఆర్కే (రవివర్మ) దగ్గర బాకీ పడతాడు. ఆ డబ్బు తీర్చకపోతే.. ఆర్కే చంపేస్తాడన్న భయంతో, ఆర్కేకి దొరక్కుండా తిరుగుతుంటాడు. ఈ సమస్యలన్నీ పోవాలంటే.. పెద్ద రిస్క్ చేయడం తప్పనిసరి అని భావించి, ఆ రిస్క్‌లో దిగుతాడు. బసవరాజు, మల్లికార్జున్ (శుభలేఖ సుధాకర్) మధ్య విబేధాలుంటాయి. మల్లికార్జున్ మనుషుల్లో ఒకరు అండర్ కవర్ పోలీస్. ఆ విషయంలో.. బసవరాజుకి తెలుసు. అండర్ కవర్ పోలీస్ అని భావించిన ఓ వ్యక్తిని.. మల్లికార్జున్ మనుషులు చంపేస్తారు. కానీ.. అసలు పోలీస్ మల్లి గ్యాంగ్ లో తిరుగుతూనే ఉంటాడు. ఆ వ్యక్తి నాకు తెలుసు అంటూ రామ్.. మల్లికార్జున్ మనుషులకు ఫోన్ చేస్తాడు. ఆ వ్యక్తి పేరు చెప్పాలంటే కోటి రూపాయలు కావాలని డిమాండ్ చేస్తాడు. అక్కడి నుంచి రామ్ కోసం. మల్లికార్జున్ మనుషుల వేట మొదలవుతుంది. మరి రామ్ కి అండర్ కవర్ ఆఫీసర్ ఎవరో తెలుసా? అసలు మల్లి గ్యాంగ్ లో అండర్ కవర్ పోలీస్ ఉన్నాడా, లేదా? అనేదే మిగిలిన కథ.
* విశ్లేషణ
జూదం మత్తులో యువత పూర్తిగా మునిగిపోతోంది. ఈజీ మనీ కోసం అలవాటు పడడం, ఆ తరవాత... అప్పుల పాలవ్వడం, ఆ అప్పుల్ని తీర్చడానికి మరో తప్పు చేడయం చూస్తూనే ఉన్నాం. `పచ్చీస్` కూడా అదే టోన్ తో మొదలవుతుంది. అయితే... అండర్ కవర్ పోలీస్ అన్నది మరో బేస్ పాయింట్ గా మారింది. అభి ఆర్కే అప్పు ఎలా తీరుస్తాడు? అనే పాయింట్ మీదే సినిమా రన్ అయితే.. రొటీన్ అయిపోదును. అండర్ కవర్ పోలీస్ ఎవరన్న ఆసక్తిని రగిలించి, దర్శకుడు ఈ కథకు ఓ స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేశాడు. సినిమా సీరియస్ మోడ్ తోనే ప్రారంభం అవుతుంది. అండర్ కవర్ పోలీస్ అనుకుని... ఓ వ్యక్తిని హత్య చేయడం, హత్య గావింపబడిన వ్యక్తి గురించి, ఓ అమ్మాయి అన్వేషణ మొదలెట్టడం, ఆర్కేని రామ్ తప్పించుకుని తిరుగుతుండడం, రాజకీయాలు, దందాలు, బెట్టింగ్, పేకాట... ఇలా ఫస్టాఫ్ అంతా ఇంట్రస్టింగ్ గానే సాగుతుంది.
ద్వితీయార్థంలో మెయిన్ పాయింట్... అండర్ కవర్ పోలీసే. అతనెవరో తెలుసుకోవాలన్న ఉత్సుకతని ప్రేక్షకులలోనూ కలిగించాడు దర్శకుడు. మామూలు కమర్షియల్ సినిమాల్లో కనిపించే అంశాలేవీ ఇందులో ఉండవు. ముఖ్యంగా పాటలకు కత్తెర వేసి మంచి పని చేశారు. హీరోయిన్ కూడా ఉండదు. హీరో క్యారెక్టర్ లో ఎక్కువగా నెటిటీవ్ లక్షణాలే కనిపిస్తాయి. కళ్లముందు ప్రాణ స్నేహితుడు మరణించినా చలించడు. కనీసం ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చడు. ఆ పాత్ర స్వభావమే అంత. ప్రతీ సన్నివేశాన్నీ అత్యంత సహజంగానే చిత్రీకరించారు. లొకేషన్లు, నటీనటుల ప్రతిభ.. అంతా సహజంగానే ఉంటుంది. ఈ సినిమాకి క్లైమాక్స్ ట్విస్ట్ కీలకం. కొంతమంది ఆ ట్విస్టుని ముందే ఊహించినా, చాలామందికి థ్రిల్ కలిగిస్తుంది. ఒకే పాయింట్ పై రెండు గంటల సినిమా నడిపించడం.. అంత ఈజీ కాదు. ఎక్కడో ఓ చోట ట్రాక్ తప్పుతుంది. కానీ.. `పచ్చీస్`ని చాలా పకడ్బందీగా నడిపించాడు దర్శకుడు. ఓహో.. అనిపించేంత సినిమా కాకపోయినా.. కాలక్షేపానికి ఏమాత్రం ఢోకా ఉండదు. థ్రిల్లర్ ప్రియులకు బాగా నచ్చతుంది కూడా.
* నటీనటులు
పర్‌ఫెక్ట్ కాస్టింగ్ అంటుంటారే.. ఆ పదానికి ఉదాహరణ.. పచ్చీస్. ప్రతీ ఒక్కరూ తమ పాత్రల్లో రాణించారు. అత్యంత సహజంగా కనిపించారు. కాస్ట్యూమర్ గా పనిచేసిన రామ్ కి నటుడిగా ఇదే తొలి సినిమా. అభిరామ్ గా... ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఆర్కేగా కొత్త అవతారం చూపించాడు రవి వర్మ. వందల సినిమాలు చేసినా.. తనకు ఇప్పటి వరకూ ఇలాంటి పాత్ర పడలేదు. ఓరకంగా తనకు టర్నింగ్ పాయింట్ అవుతుంది.
* సాంకేతిక వర్గం
కెమెరా వర్క్ బాగుంది. నేపథ్య సంగీతానికీ మంచి మార్కులు పడతాయి. ఆర్ట్ విభాగం కూడా చక్కగా పనిచేసింది. మాటలు సహజంగా ఉన్నాయి. దర్శకుడిలో ప్రతిభ ఉంది. చెప్పాలనుకున్న పాయింట్.. సూటిగా, అత్యంత సహజంగా చూపించాడు. రియలిస్టిక్ చిత్రాలు, థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు పచ్చీస్ తప్పకుండా నచ్చుతుంది.
* ప్లస్ పాయింట్స్
నటీనటులు
క్లైమాక్స్ ట్విస్ట్
టెక్నికల్ టీమ్
* మైనస్ పాయింట్స్
అక్కడక్కడ స్లో నేరేషన్
* ఫైనల్ వర్డిక్ట్: టైమ్ పాస్ కి ఓకే