'పద్మావత్' మూవీ రివ్యూ & రేటింగ్స్

మరిన్ని వార్తలు

తారాగణం: దీపికా పదుకొనే, రన్వీర్ సింగ్, షాహిద్ కపూర్, జిమ్ సరబ్, అదితిరావు తదితరులు...
నిర్మాణ సంస్థలు: భన్సాలీ ప్రొడక్షన్స్ & వయాకాం 18మోషన్ పిక్చర్స్
ఆధారం: మాలిక్ మహమ్మద్ జయసి- 'పద్మావట్'
సంగీతం: సంజయ్ లీలా భన్సాలి
నేపధ్య సంగీతం: సంచిత్ బల్హారా
ఛాయాగ్రహణం: సుదీప్ చటర్జీ
ఎడిటర్: జయంత్ జాధర్ & అకివ్ అలీ
కథనం: సంజయ్ లీలా భన్సాలి & ప్రకాష్ కపాడియా
నిర్మాతలు: సంజయ్ లీలా భన్సాలీ, సుదాన్షు & అజిత్
దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలి 

రేటింగ్: 3/5 

ఈ చిత్ర ప్రయాణం విడుదలకి ముందే విడుదలైన తరువాత వచ్చే అంతటి పబ్లిసిటీని మూటకట్టుకుంది. అయితే  సినిమా యూనిట్ కావాలనే ఈ కాంట్రవర్సీని కోరుకుందా లేక ఈ చిత్రాన్ని ప్రారంభం నుండి వ్యతిరేకిస్తున్న కర్ణిసేన వ్యతిరేకత వల్ల ఇలా జరిగింది అనేది అప్రస్తుతం. అయితే కర్ణిసేన చర్యల వల్ల అటు పద్మావత్ టీం ఒక్కటే కాదు ఇటు సామన్య జనం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతలా వార్తలోకేక్కిన పద్మావతి చిత్రం.. అదే అదే పద్మావత్ చిత్రం గురించిన సమీక్ష ఈ క్రింద మీకోసం- 

పద్మావత్ కథ:

ఆఫ్ఘానిస్తాన్ లో ఉండే ఖిల్జీలు తమ ప్రాభల్యం పెంచుకునే దానిలో భాగంగా కుతంత్రాలు పన్ని ఢిల్లీ గద్దేనేక్కుతారు. ఈ క్రమంలోనే అల్లావుద్దీన్ ఖిల్జీ (రన్వీర్ సింగ్) తన బాబాయ్ అయిన సలాలుద్దిన్ ఖిల్జీని దొంగ దెబ్బతీసి ‘సుల్తాన్’ స్థానాన్ని పొందుతాడు. ఇక మరో వైపు, మేవాడ్ రాజ్ పుత్ రాజు అయిన రతన్ సింగ్ (షాహిద్ కపూర్) సింఘల దేశ యువరాణి అయిన పద్మావతి (దీపిక పడుకునే)ని చూడడం ఆమెతో తొలిచూపు లోనే ప్రేమలో పాడడం జరుగుతుంది, తరువాత ఆమెని తన భార్యగా స్వీకరించి మేవాడ్ రాజ్యానికి రాణిగా గౌరవిస్తాడు.

ఇక మొదటినుండి కామాంధుడు, ఈ ప్రపంచంలో ఏదైనా అందమైన వస్తువు ఉంటే అది అతని సొంతం అవ్వాలని కోరుకునే మనస్తత్వం కలిగిన అల్లావుద్దీన్ ఖిల్జికి రాణి పద్మావతిని గురించి తెలుస్తుంది. ఆమె అపురూప సౌందర్యరాశి అని తెలియడంతో ఆమెని ఎలాగైనా పొందాలి అని కాంక్షిస్తాడు.

మరి పద్మావతిని పొందాలి అన్న ఇతని కోరిక నెరవేరిందా? ఖిల్జీ ప్రయత్నాలని రతన్ సింగ్ ఆపగలిగాడా లేదా అనేది తెరపైన చూడొచ్చు...

 

నటీనటుల పనితీరు: 

రన్వీర్ సింగ్: అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో జీవించాడు అనే చెప్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ చిత్రం మొత్తంలో రన్వీర్ పండించిన నటన ప్రతి ఒక్కరిని తోసి రాజేసేలా ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ పాత్రలో ఉండే క్రూరత్వం, కామం, దొంగ దెబ్బతీసే లక్షణాలని అత్యద్భుతంగా తన నటన ద్వారా పలికించాడు.

అదితిరావు హైదరి: అల్లావుద్దీన్ ఖిల్జీ భార్యగా తన పరిది మేరకు బాగా నటించింది. తెరపైన కనిపించేది కొంచెం సేపే అయినా అందరిని ఆకట్టుకోగలిగింది. 

దీపికా పదుకొనే​: టైటిల్ పాత్ర పోషించిన ఈ భామ, తన అభినయం అలాగే అందంతో ఈ పాత్రకి పూర్తీ న్యాయం చేసింది. ముఖ్యంగా రెండవ అర్ధభాగంలో ఆమె నటనకి ఆస్కారం ఉండే సన్నివేశాలు ఉండడంతో ఆమె వాటిని చక్కగా సద్వినియోగం చేసుకుంది.

షాహిద్ కపూర్: రాజ్ పుత్ రాజుగా షాహిద్ రాజ్ పుత్ ల రాజసం చూపించాడు. అలాగే ఎంతటి క్లిష్ట సమయాల్లోనూ ధర్మాన్ని కాపాడటంలో తమ ప్రాణాలు కోల్పోవడానికి కూడా వెనుకాడని రాజ్ పుత్ రాజు పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు.

జిమ్ సరబ్: అల్లావుద్దీన్ ఖిల్జీకి వ్యక్తిగత సహాయకుడిగా ఒక వైవిధ్యమైన పాత చేశాడు. ఇతని పాత్ర ఆడియన్స్ కి ఒక సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. 

విశ్లేషణ: 

దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి పేరు వినగానే గుర్తొచ్చేది భారీతనం ఉన్న చిత్రాలు. ఆ భారీతనం చిత్ర నిర్మాణంలోనే కాకుండా కథలో సైతం ఉండేలా జాగ్రత్త పడే అతికొద్దిమంది దర్శకుల్లో ఈయన ఒకరు. ముందుగా ఈ చిత్రం కోసం ఆయన పడిన శారీరక శ్రమ కన్నా వివాదాల కారణంగా పడిన మానసిక శ్రమకి మనం ముందుగా సంజయ్ ని అభినందించక తప్పదు. 

ఇక ఈ చిత్రం గురించి మాట్లాడాల్సి వస్తే, ఈ కథని మాలిక్ మహమ్మద్ జయసి రాసిన ‘పద్మావట్’ అనే ఒక కవిత ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. అయితే ఆ కవితలో ఉన్న ముఖ్య భాగాన్ని అలాగే ఉంచేసి తనకి నచ్చిన విధంగా చిన్న చిన్న మార్పులు చేసుకున్నాడు సంజయ్. ఈ కథ ప్రకారం చూస్తే, ఈ చిత్రంలో యుద్ధం కన్నా డ్రామా సన్నివేశాలే ఎక్కువగా ఉంటాయి.

అందుకే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి కూడా ఈ సినిమా మొత్తం లో పోరాటాలకు తక్కువ ప్రాధన్యం ఇచ్చి ముఖ్య పాత్రలు అవి ప్రవర్తించే తీరు పైనే దృష్టి పెట్టాడు. ఇది మనం సినిమా చూస్తే, ఇట్టే అర్ధమైపోతుంది. ఇక అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలోని పార్వష్యాలు బాగానే చూపెట్టాడు దర్శకుడు, అయితే ఎందుకో మొదటి భాగంలో మాత్రం ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 

ఈయన నడిపిన కథనం ప్రకారం, అల్లావుద్దీన్ పాత్ర మిగితా పాత్రలన్నిటిని మింగేస్తుంది. ఎందుకంటే ఆ పాత్ర అంతలా ప్రేక్షకుల మనసుపైన ముద్రవేస్తుంది. ఇక మొదటి భాగంతో పోల్చుకుంటే రెండవ భాగం ప్రేక్షకులని అలరిస్తుంది, ముఖ్యంగా పతాక సన్నివేశాలని  సంజయ్ ఒక దృశ్యకావ్యంలో చిత్రీకరిస్తాడు. ఆఖరి 10నిమిషాలు ధియేటర్ లో ప్రేక్షకులకి రోమాలు నిక్కపోడుచుకునేలా చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు.   

మీరు సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇటువంటి భావనకి తప్పక లోనవుతారు. అయితే పూర్తీ సినిమాలో ఇలా కొన్ని చోట్ల తప్ప మిగితా సన్నివేశాల్లో ఎందుకో సంజయ్ లీలా భన్సాలి మార్క్ కనిపించదు, కథతో ఆయన చేసే ప్రయోగాలు ఇందులో కనిపించవు.

ఏదేమైనప్పటికీ... ఈ చిత్రం పైన కాసుల వర్షం తప్పక కురుస్తుంది. అయితే సంజయ్ లీల భన్సాలి నుండి వచ్చిన మంచి చిత్రాల జాబీతాలో ఈ చిత్రం నిలుస్తుంది తప్ప గొప్ప చిత్రాలలో మాత్రం చోటు దక్కించుకోకపోవచ్చు. 

సాంకేతిక వర్గం పనితీరు..

సుదీప్ చటర్జీ ఛాయాగ్రహణం ఈ సినిమా స్థాయిని కచ్చితంగా పెంచింది అనే చెప్పాలి అలాగే సంచిత్ ఇచ్చిన నేపధ్య సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు అనే చెప్పొచ్చు.

ఇక ప్రొడక్షన్ డిజైన్ టీం ని అభినందించకుండా ఉండలేము అదే విధంగా నిర్మాతలు కూడా ఖర్చుకి ఏమాత్రం వెనుకాడకుండా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించడం విశేషం.

ప్లస్ పాయింట్స్:


+ కథ
+ నటీనటులు
+ పతాక సన్నివేశాలు
+ భారీతనం

మైనస్ పాయింట్స్:

- నిడివి
- పాటలు అంతగా ఆకట్టుకోలేదు

ఆఖరి మాట:

పద్మావత్: ఇది ఒక మంచి చిత్రమే కాని గొప్ప చిత్రం కాదు.

రివ్యూ బై సందీప్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS