తారాగణం: విశాల్, కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, రాజ్ కిరణ్ & తదితరులు
నిర్మాణ సంస్థ: విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ & పెన్ స్టూడియోస్
సంగీతం: యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం: శక్తివేల్
ఎడిటర్: ప్రవీణ్
నిర్మాతలు: విశాల్, ధవల్, అక్షయ్
రచన-దర్శకత్వం: లింగుసామి
రేటింగ్: 2/5
విశాల్‌ని కథానాయకుడిగా నిలబెట్టిన చిత్రం `పందెంకోడి`. ఈ సినిమాకి సీక్వెల్ చేస్తానని ఎప్పటి నుంచో చెబుతూనే వచ్చాడు. లింగు స్వామిని మళ్లీ వెంటబెట్టుకుని ఇన్నాళ్లకు సీక్వెల్‌ని తీసేశాడు. పందెం కోడి సమయంలో విశాల్‌కి ఓ ఇమేజ్ అంటూ లేదు. మార్కెట్ కూడా మొదలవ్వలేదు. కాబట్టి... ఎలాంటి అంచనాలూ లేకుండా ఆ సినిమా చూశారు. ఇప్పుడు అలా కాదు. విశాల్‌కంటూ ఓ గుర్తింపు ఉంది. తమిళంలో ఇంకాస్త ఎక్కువ ఉంది. మరి ఈ నేపథ్యంలో వచ్చిన ఈ సీక్వెల్ కోడి ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా? అప్పటి కోడి కూతకు.. ఈకోడి కూతకూ ఉన్న తేడా ఏమిటి?
* కథ
రాజా రెడ్డి (రాజ్ కిరణ్) ఏడు ఊర్లకు పెద్ద. రాయలసీమలో ఆయన గురించి తెలియని వాళ్లు ఉండరు. ప్రజలు దేవుడిగా కొలుస్తారు. ప్రతీ ఏడూ వీరభద్ర స్వామి వారి జాతర వైభవంగా జరుగుతుంటుంది. ఓ జాతరలో రెండు కుటుంబాల ఘర్షణ వల్ల.. ప్రాణ నష్టం జరుగుతుంది. ఎంతోమంది చనిపోతారు. అందులో భవానీ (వరలక్ష్మీ) భర్త కూడా ఒకడు. తనని చంపిన వాసునీ, అతని వంశాన్నీ నాశనం చేయాలని చూస్తుంది భవానీ. వాసుని ఎలాగైనా కాపాడతానని మాటిస్తాడు రాజా రెడ్డి. కుటుంబ కక్షల కారణంగా యేటా జరగాల్సిన జాతర జరక్కుండా ఆగిపోతుంటుంది. ఈసారి ఎలాగైనా జాతర చేయాలని రాజారెడ్డి నిర్ణయిస్తాడు. ఆ జాతరలోనే వాసుని చంపేయాలని భవాని ఎదురుచూస్తుంటుంది. మరి ఈ పగ, ప్రతీకారాలు ఎలా చల్లారాయి? అందు కోసం రాజా రెడ్డి కొడుకు వాసు (విశాల్) ఏం చేశాడు? అనేదే కథ.
* నటీనటులు
పదేళ్లుగా విశాల్ ఏం చేశాడో, ఇందులోనూ అదే చేశాడు. తన రూపం ఎలా మారడం లేదో.. నటనా అలానే మారడం లేదు. ఏం చేసినా సిన్సియర్‌గా చేయడం విశాల్‌కి అలవాటు. ఈపాత్రనీ అలానే చేసుకుంటూ వెళ్లిపోయాడు. మహానటి తరవాత మరీ ఇంత మాస్ పాత్రలో కీర్తిని ఊహించడం కష్టమే. అల్లరి పిల్లగా ఆమె నటన బాగుంది. రాజ్ కిరణ్ అనుభవజ్ఞుడే. ఆయన గురించి చెప్పేదేముంది? మిగిలిన వన్నీ తమిళ మొహాలే. వరలక్ష్మి పాత్ర బాగున్నా..ఆ క్రూరత్వాన్ని మనవాళ్లు ఎంత వరకూ ఒప్పుకోగలరన్నది పాయింటు.
* విశ్లేషణ
పగ, ప్రతీకారాల కథ మనకు తెలియంది కాదు. తమిళ ప్రేక్షకులూ చూసీ చూసీ విసిగిపోయారు.ఈసారీ అలాంటి కథనే ఎంచుకున్నాడు లింగుస్వామి. రెండు ఊర్లు, అందులోని కుటుంబాల కొట్లాట.. వాటి చుట్టూ నడిచే సన్నివేశాలతో సినిమా మొదలవుతుంది. సినిమా ప్రారంభంలోనే ఇందులో హింస, రక్తపాతం ఎక్కువగా ఉంటుందన్న విషయం ప్రేక్షకుడికి చూచాయిగా అర్థమైపోతుంది.
తొలి సగం కూడా సగం యాక్షన్ దృశ్యాలతో నింపేశారు. వాటిమధ్య విశాల్ - కీర్తి సురేష్‌ల లవ్ ట్రాక్ కాస్త ఉపశమనం కలిగిస్తుంది. కీర్తి లవ్ ట్రాక్ లేకపోతే.. ఈ సినిమా చాలా బోరింగ్‌గా మారిపోయేది. పందెంకోడి 1లో మీరా జాస్మిన్ ఎలాంటి పాత్ర చేసిందో.. ఇందులో కీర్తికి అలాంటి పాత్రే అప్పగించారు. ఓ రకంగా చెప్పాలంటే.. దాదాపుగా మీరా పాత్రకు ఇది రిప్లికా లా ఉంటుంది. రాజా రెడ్డిపై శత్రువులు ఎటాక్ చేయడంతో.. విశ్రాంతి కార్డు పడుతుంది.
తండ్రికి గాయమైందన్న సంగతి ఊరికి తెలియకుండా.. జాగ్రత్తగా కాపాడుకునే సన్నివేశాలు ఉత్కంఠత రేకెత్తిస్తాయి. అయితే ద్వితీయార్థంలో కీర్తి పాత్ర హడావుడి తగ్గుతుంది. దాంతో ఆ పాత్ర నుంచి వచ్చే వినోదమూ మిస్ అవుతుంది. యాక్షన్ దృశ్యాల్లో కొత్తదనం లేకపోవడం, తమిళ నేటివిటీ మరీ మితిమీరి ఉండడం ప్రతికూల అంశాలుగా మారాయి.
వరలక్ష్మి విలనిజం బాగానే ఉన్నా, చాలామందికి నచ్చకపోవచ్చు. మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు. ఓ అమ్మాయిని క్రూరమైన పాత్రలో చూపించడం మనవాళ్లు ఇంకా జీర్ణం చేసుకోలేరు. పందెంకోడి విజయవంతం అవ్వడానికి కారణం.. స్క్రీన్ ప్లే ఎత్తుగడలు. అవి ఇందులోనూ కొన్ని ఉన్నాయి. కానీ.. ఆ స్థాయి మ్యాజిక్ మాత్రం కనిపించలేదు.
* సాంకేతిక వర్గం
తమిళ నేటివిటీతో మునిగిపోయిన సినిమా ఇది. బోర్డులు మార్చారే గానీ.. లిప్ సింక్ చాలా విషయాల్లో కుదర్లేదు. సంగీతం, నేపథ్య సంగీతం.. రెండింటిలోనూ హోరు ఎక్కువగా ఉంది. ట్రైలర్లో వినిపించిన డైలాగులే... థియేటర్లోనూ పేలాయి. దర్శకుడు ఓ సాదా సీదా కథని ఎంచుకున్నాడు. దాన్ని పట్టుకుని ఎన్ని జిమ్మిక్కులు చేయాలనుకున్నా కుదర్లేదు.
* ప్లస్ పాయింట్స్
+ యాక్షన్ దృశ్యాలు
+ కీర్తి సురేష్, వరలక్ష్మి
* మైనస్ పాయింట్స్
-రొటీన్ కథ
- హింస
* ఫైనల్ వర్డిక్ట్: కోడి.. కూయడం కష్టమే.
రివ్యూ రాసింది శ్రీ.