తారాగణం: సంతోష్ శోభన్, రియా సుమన్, తాన్య హాప్, పోసాని కృష్ణమురళి, బిత్తిరి సత్తి, విధ్యు రామన్ & తదితరలు
సమర్పణ: సంపత్ నంది టీం వర్క్స్
సంగీతం: భీమ్స్
ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్
ఎడిటర్: తమ్మిరాజు
కథ-మాటలు: సంపత్ నంది
నిర్మాతలు: నరసింహ, రాములు & వెంకట్
దర్శకత్వం: వి. జయశంకర్
రేటింగ్: 2.75/5
ప్రేమ కథల్లో పరమ రొటీన్ ఫార్ములా ఒకటుంది. అదే.. ధనిక - పేద. హీరో ఓ గొప్పింటి అమ్మాయిని ప్రేమించడం, డబ్బే వారిద్దరి మధ్య దూరానికి కారణమవ్వడం, వాటిలోంచి పుట్టుకొచ్చిన సంఘర్షణ... ఈ తరహా కథలు చాలా చాలా చాలా వచ్చాయి. అయినా సరే - మళ్లీ మళ్లీ ఆ ఫార్ములాని పట్టుకోవడానికి మనవాళ్లెవరూ మొహమాట పడడం లేదు.
ఆ ఎమోషన్‌ని సరిగ్గా పట్టుకోగలిగితే, ఆ ప్రేమని అందంగా, అర్థవంతంగా చూపించగలిగితే తప్పకుండా ఈ ఫార్ములా కూడా కొత్తగానే కనిపిస్తుంది. `పేపర్ బాయ్` నేపథ్యం కూడా అచ్చంగా అదే. ఇంటింటికీ తిరిగి పేపర్ వేసే కుర్రాడు ఓ గొప్పింటి అమ్మాయిని ప్రేమిస్తే ఏమవుతుందో చూపించారు. మరి ఈ ఫార్ములాకు కథకుడు, నిర్మాత సంపత్‌నంది జోడించిన ఎమోషన్ ఎలాంటిది? పాత పద్ధతిలో సాగిందా? కొత్తగా ఏమైనా చూపించగలిగాడా?
* కథ
రవి (సంతోష్ శోభన్ ) ఓ పేపర్ బాయ్. ఓ వైపు చదువుకుంటూనే ఇంటింటికీ తిరిగి పేపర్ వేస్తుంటాడు. ధరణి (రియా సుమన్) అనే గొప్పింటి అమ్మాయి ని ప్రేమిస్తాడు. రవి వ్యక్తిత్వం నచ్చి ధరణి కూడా రవిని ఇష్టపడుతుంది. ధరణి ఇంట్లోవాళ్లు కూడా వీరిద్దరి పెళ్లికి ఒప్పుకుంటారు. కానీ.. ధరణి సోదరుల వల్లే సమస్య వస్తుంది. వాళ్లు ఈ పెళ్లికి ఒప్పుకున్నారా.. లేదా? అసలు ఈ కథకీ, ముంబైలో ఉంటున్న మేఘ (తాన్య హోప్)కీ సంబంధం ఏమిటి? రవి, ధరణి కలుసుకున్నారా, లేదా? అనేది తెరపై చూడాలి.
* నటీనటులు
సంతోష్ శోభన్‌కి ఇది మూడో సినిమా. తనలో ఎదుగుదల కనిపించింది. డైలాగులు బాగా చెబుతున్నాడు. ఎమోషన్ సీన్లలోనూ ఓకే. అయితే... అక్కడక్కడ కాస్త ఓవర్ చేస్తున్నట్టు అనిపించింది.
రియా సుమన్, తాన్య ఇద్దరూ అందంగా ఉన్నారు. సౌందర్ రాజన్ ఫొటోగ్రఫీ మహత్తు వల్ల మరింత బాగా కనిపించారు. నటన విషయంలోనూ ఓకే.
హీరో గ్యాంగ్, బిత్తిరి సత్తి కామెడీ పండించడానికి చాలా ట్రై చేశారు. హీరోయిన్ల సోదరులుగా చేసినవాళ్లు బాగానే నటించినా.. తెలిసిన మొహాలైతే బాగుండేది.
* విశ్లేషణ
ముందే చెప్పుకున్నట్టు ఇది తోటలో రాజు, కోటలో రాణి టైపు కథ. హీరోని ఆటో డ్రైవర్‌గానైనా చూపించొచ్చు. కానీ. ఇక్కడ పేపర్ బోయ్‌ని చేశారు. ముంబై నేపథ్యంలో కథ మొదలెట్టి, ఈ కథకి ఓ డైరీని లింక్ చేసి.. ఫ్లాష్ బ్యాక్‌లోకి కథ నడపడం వల్ల రొటీన్ స్టోరీ కాస్త కొత్త ఫ్లేవర్‌లో మొదలైందంతే. మంచి ఫొటోగ్రఫీ, ఆకట్టుకునే డైలాగులతో... సినిమా కలర్‌ఫుల్‌గా సాగిపోతుంటుంది. రవి, ధరణి మధ్య పరిచయం, ప్రేమ.. వీటి చుట్టూ చాలా సన్నివేశాలు తిరిగాయి. విశ్రాంతి ముందు కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ వచ్చింది.
అయితే అది బలవంతంగా తెచ్చినట్టే అనిపిస్తుంది. అందుకే సెకండాఫ్ మొదలవ్వగానే.. హీరో, హీరోయిన్లు సారీలు చెప్పుకుని ఆ సంఘర్షణని మర్చిపోతారు. ప్రధమార్థంలో ఉన్న సరదా, ఆసక్తి... ద్వితీయార్థం వచ్చేసరికి తగ్గిపోతాయి. ఇక్కడ దర్శకుడు తనకు ఇష్టమొచ్చినట్టు కథని నడిపించుకుని పోయాడు. బిత్తిరి సత్తిని రంగంలోకి దింపి, పేరడీలు చేయించాడు.. కామెడీ కోసం. అవి అంతగా వర్కవుట్ కాలేదు. హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ చేసే కామెడీ కూడా ఇమడలేదు. అందుకే ఏ ముక్కకు ఆ ముక్క అన్నట్టు తయారయ్యాయి సన్నివేశాలు.
క్లైమాక్స్ కూడా మరీ సినిమాటిక్ గా అనిపిస్తుంది. ద్వితీయార్థంలో ఒకట్రెండు చోట్ల ఎమోషన్లు పండాయి గానీ, పూర్తి స్థాయిలో కాదు. స్లో నేరేషన్, లెంగ్తీ సన్నివేశాలు, ఎమోషన్లు లేకపోవడం, బలహీనమైన ముగింపు ఇనవ్నీ `పేపర్ బాయ్` స్థాయిని తగ్గించేశాయి. రొటీన్ కథ ఎంచుకోవడం మరో బలమైన మైనస్‌గా మారింది.
* సాంకేతిక వర్గం
టెక్నికల్‌గా ఈసినిమా చాలా బాగుంది. రిచ్‌గా ఉంది. మరీ ముఖ్యంగా సౌందర రాజన్ ఫొటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పాటల్లో సాహితీ విలువలు కనిపించాయి. సంపత్ నంది రాసిన మాటలు చాలా చాలా బాగున్నాయి. దాదాపు ప్రతీ సన్నివేశంలోనూ ఒక్క డైలాగులో అయినా మెరుపు కనిపించింది. అయితే కథ పరంగానే లోపాలున్నాయి. ఇంత వీక్ స్టోరీకి ఎన్ని హంగులు అద్దితే ఏం లాభం? దర్శకుడు ఈ రొటీన్ కథని కొత్తగా టేకప్ చేయలేకపోయాడు. అందుకే కథ ప్రారంభం, ముగింపు రెండూ ఈజీగానే ఊహించగలం.
* ప్లస్ పాయింట్స్
+ డైలాగ్స్
+ ఫొటోగ్రఫీ
+ పాటలు
* మైనస్ పాయింట్స్
- రొటీన్ స్టోరీ
- స్లో నేరేషన్
* ఫైనల్ వర్డిక్ట్: రొటీన్ లవర్ బోయ్.
రివ్యూ రాసింది శ్రీ