నటీనటులు : దినేష్ తేజ్, అనన్య నాగల్ల, అర్జున్ కళ్యాణ్ తదితరులు
దర్శకత్వం : హరి ప్రసాద్ జక్కా
నిర్మాతలు : ప్రసాద్ రావు పెద్దినేని
సంగీతం : కామ్రాన్
సినిమాటోగ్రఫర్ : కే బుజ్జి
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
రేటింగ్: 2.75/5
టైం ట్రావెల్. టైం లూప్. క్రాస్ టైం కనెక్షన్ ఇవన్నీ హాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన సైన్స్ ఫిక్షన్ జాన్రా. సంవత్సరానికి ఒకటో రెండో వస్తూనే ఉంటాయి. కానీ మనకే ఇవి అరుదు. ఒకటో ఆరో వచ్చినా వాటిల్లో ఏ ఆదిత్య-369 లాంటివి మాత్రమే కాస్త గుర్తుండిపోయేలా మిగులుతాయి. ఇది కూడా టైం మెషిన్, టైం ట్రావెల్ కి సంబంధించిన కథ. క్రాస్ టైం టాక్, అంటే రెండు వేరువేరు టైమ్స్ లో ఉన్నవాళ్లు ఒక ఫోన్ ద్వారా మాట్లాడుకోవడం అనేది అస్సలు తెలుగులో లేదు. ప్రపంచ సినిమాలోకూడా ఒకటో ఆరో హాలీవుడ్,కొరియన్ సినిమాలో మాత్రమే ఉన్నాయి. అలాంటిది తెలుగులో ఈ సాహసం చేసిన మొదటి సినిమా "ప్లే బ్యాక్"
* కథ
2019 లో ఉన్న ఒక జర్నలిస్టుకి 1993లో ఉన్న ఒక స్కూల్ టీచర్ నుంచీ ఫోన్ వస్తుంది. కనెక్షన్ లేని ఫోన్ కి కాల్. సంబంధం లేని మనుషులమధ్య మాటలు. హఠాత్తుగా ఇద్దరూ వేరేవేరే టైంలో ఉన్నారని. ఒకరు వర్తమానంలో మరొకరు భూతకాలంలో ఉన్నారు అని తెలుసుకుంటారు. ఇది ఎలా జరిగింది? ఒకవేళ జరిగితే ఎందుకు జరిగింది? ఈ ఇద్దరికీ మధ్య ఫోన్ కనెక్షన్ కాక మరి ఏదైనా బంధం ఉందా? ఉంటే దానివెనక ఉన్న మర్మం ఏమిటి? ఆ మర్మం వెనక ఉన్న కుట్రలు. కుతంత్రాలు. హత్యలు వీటి మిస్టరీ ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే...సినిమా చూడాల్సిందే.
* విశ్లేషణ
ఈ కత్తి మీద సాములాంటి కథ. ఎక్కడ లాజిక్ మిస్ అయినా అబ్బురపాటుకాస్తా "అబ్బే ఇంతేనా" అనిపించేస్తుంది. కానీ సినిమాలో ఒక్కొక్క విషయం రివీల్ అవుతుంటే ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. "ఏం రాసాడ్రా రైటర్. ఏం తీసాడ్రా డైరెక్టర్" అనిపిస్తుంది. కాబట్టి క్రెడిట్ మొత్తం రచయిత-దర్శకుడు జక్కా హరిప్రసాద్ కు చెందుతుంది. స్క్రీన్-ప్లేలో బిగి. ఎక్కడా వృధాకాని సీన్లు. పాత్రకి తగ్గ నటనరాబట్టడం. ఉన్న వనరుల్ని మ్యాగ్జిమం వాడుతూ దృశ్యాన్ని పండించడం అన్నీ ఒక ప్రామిసింగ్ రైటర్ డైరెక్టర్ లక్షణాలు. అవి పుష్కలంగా ఈ సినిమాలో కనిపిస్తాయి. మురిపిస్తాయి.
ఓ కొత్త రకమైన అనుభవాన్ని మిగిలిచ్చిన సినిమా ఇది. ఎత్తుకోవడమే మంచి పాయింట్. దాన్ని తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంది. ఓ ఆదిత్య 369 లాంటి సైన్స్, ఫిక్షన్ మిళితమైన సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. బడ్జెట్ ఇంకా భారీగా ఇచ్చుంటే.. ఈ సినిమా లెవిలే మారిపోయేదేమో. దర్శకుడికి దొరికిన వనరులు పరిమితం. దాన్ని వాడుకుంటూనే, తాను రాసుకున్న కథని పర్‌ఫెక్ట్ గా తీర్చిదిద్దాడు. జర్నలిస్టుకి ఫోన్‌కాల్ రావడం దగ్గర్నుంచి కథ పరుగులు పెడుతుంటుంది. ఆ రన్... క్లైమాక్స్ వరకూ సాగుతుంది.
* నటీనటులు
నటినటుల్లో అనన్య నాగేళ్ల, దినేష్ తేజ్,అర్జున్ కళ్యాణ్, స్పందన పాత్రోచితంగా నటించారు. విలన్లుగా చేసిన టీఎన్నార్, జర్నలిస్ట్ మూర్తి సినిమాకు వాల్యూ యాడ్ చేశారు. కొత్తదనాన్ని తీసుకువచ్చారు. జర్నలిస్టు మూర్తి.. సోషల్ మీడియాలో హీరో. తనలో ఓ నటుడున్నాడన్న సంగతి ఈ సినిమాతో అర్థం అవుతుంది.
* సాంకేతిక వర్గం
కామ్రాన్ సంగీతం ఒక ప్రత్యేక ఆకర్షణ. సినిమాటోగ్రఫీ,ఎడిటింగ్ కూడా చక్కగా అమరాయి. స్క్రీన్ ప్లే మరింత బాగుంది. ఇలాంటి కథల్ని డీల్ చేయడం చాలా కష్టం. లాజిక్కులేం ఉండవు. కానీ అలాంటి చోట మ్యాజిక్ చేయాలి. దర్శకుడు అదే చేశాడు. కొత్త తరహా సినిమాలు చూడాలనుకున్న వాళ్లకు ఈ పవర్ ప్లే తప్పకుండా నచ్చుతుంది.
* ప్లస్ పాయింట్స్
కథా నేపథ్యం
ట్విస్టులూ, టర్న్‌లూ
స్క్రీన్ ప్లే బిగి
* మైనస్ పాయింట్స్
అక్కడక్కడ స్లో
తెలిసిన నటీనటులు లేకపోవడం
* ఫైనల్ వర్డిక్ట్: సరికొత్త థ్రిల్లర్