'ప‌వ‌ర్ ప్లే' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు : రాజ్ తరుణ్, హేమల్, పూర్ణ తదితరులు 
దర్శకత్వం : విజయ్ కుమార్ కొండా
నిర్మాత‌లు : మహీధర్, దేవేష్
సంగీతం : సురేష్ బొబ్బిలి 
సినిమాటోగ్రఫర్ : ఐ ఆండ్రూ
ఎడిటర్: ప్రవీణ్ పూడి


రేటింగ్: 3.5/5


రాజ్ త‌రుణ్ అంటే... ఓ ఇమేజ్ ఉంది. బాగా న‌వ్విస్తాడు. ప్రేమ కథ‌ల‌కు బాగా నప్పుతాడు. తాను చేసిన వ‌న్నీ ఇలాంటి సినిమాలే. అయితే.. తొలిసారి జొన‌ర్ మార్చాడు. ఓ థ్రిల్లర్ ని ఎంచుకున్నాడు. కుటుంబ క‌థా చిత్రాలు తీసే - విజ‌య్ కుమార్ కొండా ని న‌మ్మి ఓ థ్రిల్ల‌ర్ ని అప్ప‌గించి, ధైర్యంగా ఓ అడుగు ముందుకు వేశాడు. ఆ సినిమానే `ప‌వ‌ర్ ప్లే`. ఈరోజే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ ప‌వ‌ర్ ప్లే ఎలా ఉంది?  రాజ్ త‌రుణ్‌, విజ‌య్ త‌మ ప‌వ‌ర్ ఏ మేర‌కు చూపించారు?


* క‌థ‌


విజ‌య్ (రాజ్ త‌రుణ్‌) ఇంజ‌నీరింగ్ పూర్తి చేస్తాడు. ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. అయితే.. ఒక‌టే స‌మ‌స్య‌. విజ‌య్‌కి ఉద్యోగం లేదు. ఆ కార‌ణంతో... అమ్మాయి తండ్రి ఈ పెళ్లికి నిరాక‌రిస్తాడు. దాంతో.. విజ‌య్ తండ్రి త‌న ఉద్యోగానికి వాలంట‌రీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించి, ఆ ఉద్యోగం త‌న కొడుకుకి వ‌చ్చేలా చేస్తాడు. దాంతో విజ‌య్ పెళ్లికి రూట్ క్లియ‌ర్ అవుతుంది. ఓ వైపు.. ఉద్యోగం వచ్చిన ఆనందం, మ‌రోవైపు.. న‌చ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న సంతోషం.

 

స‌మ‌స్య‌లన్నీ తొల‌గి - జీవితం అంతా హ్యాపీ అనుకుంటున్న త‌రుణంలో.. విజ‌య్‌కి ఓ అనుకోని సంఘ‌ట‌న ఎదుర‌వుతుంది. దాంతో.. త‌న జీవితం మొత్తం చీక‌ట్లు ఆవ‌హిస్తాయి. ఒక్క రోజులోనే త‌న సంతోషాల‌న్నీ దూరం అవుతాయి. విజ‌య్ ఆశ‌ల్ని లాగేసుకొన్న‌దీ, చిక్కుల్లో ప‌డేసిందీ సామాన్య‌మైన వ్య‌క్తులు కాదు. రాష్ట్రాన్ని శాశించే స్థాయి ఉన్న‌వాళ్లు. వాళ్ల‌లో విజ‌య్ లాంటి సామాన్యుడు... యుద్ధానికి దిగితే - త‌న‌కు జ‌రిగిన అన్యాయానికి ప్ర‌తీకారం తీర్చుకుంటే ఏమ‌వుతుంద‌న్న‌ది మిగిలిన క‌థ‌.


* విశ్లేష‌ణ‌


రాజ్ త‌రుణ్ తొలిసారి త‌న శైలికి విభిన్న‌మైన క‌థ‌నీ, పాత్ర‌నీ ఎంచుకున్నాడు. ఈ విష‌యంలో రాజ్ త‌రుణ్ ప్ర‌య‌త్నాన్ని అభినందించాలి. రాజ్ త‌రుణ్ అంటే... కామెడీ టైమింగ్. జోవియల్ టైపు పాత్ర‌లే. ఈ సినిమాలో రాజ్ త‌రుణ్ మాత్రం వేరుగా క‌నిపిస్తాడు. ఓ ర‌కంగా చెప్పాలంటే త‌న‌ని తాను కొత్త‌గా మార్చుకున్న‌ట్టు క‌నిపిస్తాడు. ఓ సామాన్యుడి జీవితం - శ‌క్తిమంత‌మైన మ‌నుషుల చేతిలో ఎలా న‌లిగిపోయింద‌న్న‌.. సీరియ‌స్ పాయింట్ క‌థ ఇది. దాన్ని ద‌ర్శ‌కుడు బాగా డీల్ చేశాడ‌ని చెప్పాలి.


కాక‌పోతే.. ఈ క‌థ చాలా స్లోగా మొద‌‌ల‌వుతుంది. క‌థ‌లోకి  వెళ్ల‌డానికి స‌మ‌యం తీసుకుంటుంది. ఆ 15 నిమిషాలూ కాస్త ఓపిక ప‌ట్టాల్సిందే. అప్ప‌టి నుంచి... క‌థ‌, క‌థ‌నం స్పీడుగా సాగుతాయి. క్లైమాక్స్ వ‌ర‌కూ... ఈ స్పీడు ఎక్క‌డా ఆగ‌దు. అక్క‌డ‌క్క‌డ కొన్ని లాజిక్కులు మిస్ అవుతున్నాయ‌ని అనిపించినా, ద‌ర్శ‌కుడు త‌న క‌థ‌నంతో మ్యాజిక్ చేశాడు. ఇలాంటి సినిమాల‌కు రేసీ స్క్రీన్ ప్లే చాలా అవ‌స‌రం. అది ప‌వ‌ర్‌ప్లేకి బాగా కుదిరింది. ప్ర‌తి పాత్ర‌నీ వాడుకున్న విధానం, ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్.. ఇవ‌న్నీ ప‌వర్ ప్లేకి బ‌లాలుగా మారాయి. తెర‌పై ఓ హీరో ఎప్పుడూ క‌నిపించ‌డు. మ‌న‌లో ఒక‌డైన సామాన్యుడే క‌నిపిస్తాడు. అంత స‌హ‌జ‌మైన స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు రాసుకున్నాడు. బ‌డా మ‌నుషులు అనుకుంటే.. సామాన్యుల జీవితాల‌తో ఎలా ఆడుకుంటార‌న్న‌ది... తెర‌పై క‌నిపిస్తుంది. దాంతో ఈ పాయింట్ అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది.


* న‌టీన‌టులు


రాజ్ త‌రుణ్ కి ఈ త‌ర‌హా పాత్ర చాలా కొత్త‌. కానీ ఎక్క‌డా త‌డ‌బ‌డ‌లేదు. త‌న న‌ట‌న‌లోని మ‌రో కోణం చూపించాడు. ముఖ్యంగా ఇంట్ర‌వెల్ కి ముందొచ్చే స‌న్నివేశాల్లో త‌న న‌ట‌న మెప్పిస్తుంది. రాజ్ త‌రుణ్ త‌ర‌వాత‌.. అన్ని మార్కులు పూర్ణ‌కి ప‌డ‌తాయి. ఓ అహంకార‌పూరిత‌మైన పాత్ర‌లో.. పూర్ణ అద్భుతంగా న‌టించింది. ఆమెకు ఇది మ‌రో మెట్టు. మ‌ధునంద‌న్‌, ధ‌న్ రాజ్‌.. వీళ్లంతా సీరియ‌స్ గా త‌మ పాత్ర‌ల్ని చేసుకుంటూ వెళ్లిపోయారు. చాలా కాలం త‌ర‌వాత కోట‌శ్రీ‌నివాస‌రావు ఓ కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించారు. ఆయ‌న త‌న అనుభ‌వాన్నంతా ఆ పాత్ర‌లో రంగ‌రించారు.


* సాంకేతిక వ‌ర్గం


ఆండ్రూ కెమెరా ప‌నిత‌నం ఈ సినిమాకి అత్యంత ప్ర‌ధాన‌మైన బ‌లం. కెమెరా ఎప్పుడూ ప‌రుగెడుతూనే ఉంటుంది. సురేష్ బొబ్బిలి నేప‌థ్య సంగీతం ఈ క‌థ‌ని, స‌న్నివేశాల్నీ ఇంకో స్థాయిలో కూర్చోబెట్టాయి. ప్ర‌వీణ్ పూడి... ఎడిటింగ్ ప‌నిత‌నం వ‌ల్ల స‌న్నివేశాల్లో స్పీడు పెరిగింది. ఇది దర్శ‌కుడి సినిమా. ఓ కొత్త త‌ర‌హా క‌థ‌ని అందించాల‌న్న త‌న ప్ర‌య‌త్నం ఫ‌లితాన్నిచ్చింది. థ్రిల్ల‌ర్ చిత్రాల్ని ఇష్ట‌ప‌డే వాళ్ల‌కు `ప‌వ‌ర్ ప్లే` ఈవారం మంచి ఆప్ష‌న్‌.


* ప్ల‌స్ పాయింట్స్


స్క్రీన్ ప్లే
రాజ్ త‌రుణ్ - పూర్ణ‌
సాంకేతిక వ‌ర్గం


* మైన‌స్ పాయింట్స్‌


తొలి 15 నిమిషాలు
లాజిక్ మిస్‌


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్:  గాడిలో ప‌డిన రాజ్ త‌రుణ్‌


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS