చిత్రం: ప్రేమలు
దర్శకత్వం: గిరీష్ ఎ.డి
నటీనటులు: నస్లెన్ కె. గఫూర్, మమితా బైజు, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్
నిర్మాతలు: ఫాహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్
సంగీతం: విష్ణు విజయ్
ఛాయాగ్రహణం: అజ్మల్ సాంబు
కూర్పు: ఆకాష్ జోసెఫ్, వర్గీస్
బ్యానర్స్: భావన స్టూడియోస్
విడుదల తేదీ: 8 మార్చి 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 3.25/5
రొమాంటిక్ కామెడీలకి లార్జర్ దెన్ లైఫ్ కథ ఉండాల్సిన పని లేదు. సినిమా చూస్తున్నంతసేపు కాలక్షేపమైపొతే చాలు. సరిగ్గా ఇలాంటి కొలతలతోనే వచ్చింది 'ప్రేమలు'. ఇప్పటికే మలయాళంలో విజయం సాధించిన ఈ సినియాని ఎస్ఎస్ కార్తికేయ తెలుగులో విడుదల చేశారు. మరీ చిత్రం తెలుగు ప్రేక్షకులని అలరించిందా?
కథ: సచిన్ (నస్లేన్) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఓ మామూలు కుర్రాడు. తనకి కాలేజ్ డేస్ లో ఓ లవ్ ఫెయిల్యూర్ కూడా వుంటుంది. యూకే వెళ్లాలని అనుకొంటాడు. కానీ వీసా రిజెక్ట్ అవుతుంది. సచిన్ తండ్రి చిన్న బేకరీ నడుపుతుంటాడు. ఇంట్లో, ఊర్లో వుండటం ఇష్టం లేక స్నేహితుడు అమూల్ (సంగీత్ ప్రతాప్)తో కలసి గేట్ కోచింగ్ తో కలిసి హైదరాబాద్ వస్తాడు సచిన్. ఓ పెళ్లిలో రేణు (మమిత బైజు)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. రేణు ఓ ఐటీ కంపెనీలో పని చేస్తుంటుంది. తనకు కాబోయే వాడి విషయంలో రేణుకి కొన్ని డిమాండ్లు వుంటాయి. ఆ డిమాండ్లకు సచిన్ ఏ మాత్రం సరితూగడు. ఇలాంటి భిన్నద్రువాలైన ఈ ఇద్దరు ఎలా ఒకరికి ఒకరు దగ్గరయ్యారు ? సచిన్ తన ప్రేమని రేణుతో చెప్పాడా? సచిన్ ప్రేమ గురించి తెలుసుకున్న రేణు ఎలా రియాక్ట్ అయ్యింది ? ఇవన్నీ తెరపై చూడాలి.
విశ్లేషణ: రైటింగ్ లో బలం వుంటే చిన్న సినిమా కూడా మ్యాజిక్ చేస్తుందని ఎన్నోసార్లు రుజువైయింది. 'ప్రేమలు' కూడా అలా మ్యాజిక్ చేసిన సినిమానే. ఇందులో రైటింగ్ బ్రిలియన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మచ్చుక్కి ఓ సీన్ చూద్దాం. క్లాస్ రూమ్ లో నిద్రపోవడం చాలా చాలా పాత సీను. ఇందులో కూడా సచిన్ క్లాస్ రూమ్ లో నిద్రపోతాడు. ఇక్కడివరకూ ఆర్డినరీ వ్యవహారం. తర్వాత టీచర్, సచిన్ కి మధ్య క్లాస్ రూమ్, టిఫిన్ కొట్టువద్ద జరిగే సంభాషణ మాత్రం ఎక్స్ ట్రార్డినరీ. ఈ సినిమా మొత్తంలో ఇలాంటి రైటింగ్ బ్రిలియన్స్ అడుగడుగునా కనిపిస్తుంది. కాలేజ్ ఎపిసోడ్ తో కథని మొదలుపెట్టిన దర్శకుడు.. ఆ స్కేల్ లో ఆడియన్ ని కూర్చోబెట్టటానికి కాస్త సమయం తీసుకుంటాడు. ఎప్పుడైతే సచిన్, అమూల్ కారుపై పెళ్ళికి వెళ్తారో అక్కడి నుంచి ఫన్ రైడ్ మొదలైపోతుంది. పాత్రలన్నీ తెరపై ప్రాణం పోసుకున్నట్లు చాలా లైవ్లీగా సాగిపోతుంటాయి.
సచిన్, రేణు.. ఈ రెండు పాత్రలనే కాదు.. మిగతా చుట్టూ వున్న పాత్రలతో కూడా ప్రేమలో పడిపోతారు. ఆ పాత్రలన్నీ ప్రేక్షకుడిని ప్రాక్టికల్ గా మాయలో పడేస్తాయి. జరుగుతున్న ప్రతి సీన్ సహజత్వానికి దగ్గరలో ఉంటూ నవ్వులు పంచేస్తాయి. రేణు ఆఫీస్ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా వుంటుంది. పెళ్లి ఎపిసోడ్ లో విగ్రహం పడిపోవడం, రాధకృష్ణల పాట, రేణుని ఇష్టపడే ఆది, రేణు కోసం లొకేషన్ మారే సచిన్, పబ్బు సీను, హైదరాబాద్ ట్రిప్పు.. ఒక్కటి కాదు.. ప్రతి ఐటెం పేలింది. జిరాక్స్ సెంటర్లో సచిన్ తన ప్రేమని వ్యక్తం చేసిన సన్నివేశం, రేణు నుంచి ఎదురైన రిజక్షన్ తెరపై చూస్తున్నప్పుడు.. సినిమాలు ఇంత సహజంగా వుంటే ఎంత బావున్నో అనిపిస్తాయి.
ఇదొక రొమాంటిక్ కామెడీ. కానీ ఒక్క క్రింజ్ జోక్ లేదు. అది ఈ సినిమాకి బిగ్గెస్ట్ రిలీఫ్. యూత్ ప్రేమకథల్లో క్రింజ్ వ్యవహారం ఉంటుందని అనుకునే ఆడియన్స్ కి ఈ సినిమా సర్ ప్రైజ్ చేస్తుంది. ప్రతి సీను ప్రాక్టికల్ గా హిలేరియస్ గా వర్క్ అవుట్ అయ్యింది. నిజానికి ఇందులో ప్రేమకథే లేదు. కానీ సచిన్, రేణు నుంచి దూరంగా వెళ్ళిపోయినపుడు చూస్తున్న ఆడియన్ మనసు చువుక్కుమంటుంది. సచిన్, రేణు కలిస్తే బావుండనిపిస్తుంది. ఇదీ డైరెక్టర్ బ్రిలియన్స్.
నటీనటులు: సచిన్ గా నస్లేన్ చాలా కాలం గుర్తిండిపోతాడు. చాలా సహజంగా ప్రతి ఒక్కరూ వోన్ చేసుకునేలా పాత్రని పండించాడు. తన టైమింగ్ సూపర్. రేణు గా మమిత బైజు చాలా మందికి ఫేవరేట్ అయిపోతుంది. తన క్యూట్ నెస్ భలే అందంగా కనిపిస్తుంది. అముల్ గా సంగీత్ ప్రతాప్ కి మంచి మార్కులు పడతాయి. ఆది పాత్రలో చేసిన నటుడు భలే నవ్విస్తాడు. కొంచెం నెగిటివ్ టచ్ వున్న ఆ పాత్ర కూడా ప్రేక్షకుడి భలే వినోదాన్ని పంచుతుంది. జస్ట్ కిడ్డింగ్ మేనరిజంతో దాన్ని కార్టూన్ క్యారెక్టర్ లా తీర్చిదిద్డడం బావుంది. మిగతా పాత్రలు కూడా లైవ్లీ గా వుంటాయి.
టెక్నికల్ : పాటలు, నేపధ్య సంగీతం వినసొంపుగా వుంటాయి. రాధాకృష్ణల పాట ట్యూన్ పరంగా అప్పుడెప్పుడో వచ్చిన పాత మెలోడీలా వుంటుంది కానీ భలే వర్క్ అయ్యింది. ఆ పాటలో ఆది, సచిన్ లా ఎక్స్ ప్రెషన్స్ కడుపుబ్బానవ్వించేస్తాయి. కెమరాపనితనం ఆహ్లాదకరంగా వుంది. హైదరాబాద్ ని మంచి పాజిటివ్ వైబ్స్ తో చిత్రీకరించారు. తెలుగు డబ్బింగ్ రాసిన ఆదిత్య హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని మీమ్స్ వాడుకున్నాడు కానీ మిగతా పోర్షన్ ని చాలా నేచురల్ గా తెలుగీకరించాడు. దర్శకుడు ప్రేమలుతో నవ్వులు పూయించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు.
ప్లస్ పాయింట్స్
అలరించే కథనం
సచిన్ రేణు పాత్రలు
ఫన్ ఫుల్ ట్రీట్మెంట్
మైనస్ పాయింట్స్
అక్కడక్కడ నెమ్మది
ఫైనల్ వర్దిక్ట్ : ప్రేమలు.. నవ్వులు