తారాగణం: శ్రీకాంత్, నజియా, పృథ్వీ, అలీ తదితరులు
నిర్మాణ సంస్థ: విజి చరిష్ విజన్స్
సంగీతం: రాప్రోక్ షకీల్
ఎడిటర్: శంకర్
నిర్మాత: విజయ్
రేటింగ్: 1/5
హారర్ సినిమాలంటే కాస్త సేఫ్ ప్రాజెక్టే! పోతే వెంట్రుక. వస్తే కొండ..
అందుకే దాదాపుగా ప్రతీ హీరో తమ వంతు ప్రయత్నాలు చేశారు. అందులో ఒక్క శాతం సక్సెస్ కొడితే, మిగిలిన 99 శాతం చేతులు ఎత్తేశారు. అయినా 'మనమూ ఓ ప్రయత్నం చేద్దాం'అంటూ ఎప్పటికప్పుడు ముందుకు వస్తున్న హీరోలు కనిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ వంతు శ్రీకాంత్ ది. నూట పాతిక చిత్రాలు చేసిన హీరో.. శ్రీకాంత్. తొలిసారి ఓ హారర్ కామెడీ ఎంచుకున్నాడు. మరి శ్రీకాంత్‌కి ఈ జోనర్ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? కొండ వచ్చిందా, వెంట్రుక పోయిందా..?
* కథ
రాజ్ కిరణ్ (శ్రీకాంత్) ఓ దర్శకుడి (గిరిబాబు) తనయుడు. తండ్రి వంద సినిమాలు తీస్తే అందులో 99 హిట్టు. అందుకే.. తనయుడు కూడా మెగాఫోన్ పడదామనుకుంటాడు.ఆ ప్రయత్నంలో మూడు సినిమాలు తీస్తే... మూడూ ఫట్టుమంటాయి. నాలుగో సారి ఎలాగైనా హిట్టు సినిమా తీయాలన్న ఉద్దేశంతో ఓ హారర్ కామెడీ కథని ఎంచుకుంటాడు. కథ వండానికి, షూటింగ్ జరపడానికి ఊరి బయట ఉన్న పాడుబడ్డ బంగ్లాని ఎంచుకుంటాడు. అయితే అందులో కొన్ని ఆత్మలు నివాసం ఏర్పరచుకుంటాయి. అందులో అడుగుపెట్టినవాళ్లెవ్వరూ.. బయటకు వెళ్లరు. మరి రాజ్ కిరణ్ అండ్ గ్యాంగ్ బయటకు వచ్చిందా, రాలేదా?? వాళ్లు సినిమా తీశారా, లేదా?? అనేదే కథ.
* నటీనటులు
శ్రీకాంత్ వంద సినిమాల అనుభవం ఉన్న హీరో. కానీ తొలిసారి తేలిపోయాడు. తన ఎక్స్‌ప్రెషన్స్ చాలా కృతకంగా ఉన్నాయి. శ్రీకాంత్‌ని ఇలాంటి పాత్రలో చూస్తామని ఎవ్వరూ ఊహించి ఉండరు. జూనియర్ ఆర్టిస్టుని తీసుకొచ్చి హీరోయిన్‌ని చేసినట్టుంది.. ఆ పాత్ర చేసిన అమ్మాయిని చూస్తుంటే. కామెడీ గ్యాంగ్‌కి కొదవలేదు.. కానీ... వాళ్లు అందించిన కామెడీనే అర.. కొరగా ఉంది. ఫృథ్వీ ఒక్కడే కాస్త ఓకే అనిపించాడు. అలీ లాంటివాళ్లు కూడా దారుణంగా తేలిపోయారు.
* విశ్లేషణ
మనుషుల్ని చూసి దెయ్యం భయపడడం అనేది `ఆనందో బ్రహ్మ` నుంచి ఎత్తేసిన కాన్సెప్ట్. దాన్ని పట్టుకుని సగం సినిమా నడిపించేశాడు దర్శకుడు. నిజానికి ఆ సగంలో కథేం ఉండదు. కేవలం కొన్ని కామెడీ సీన్లు ఉంటాయంతే. కాకపోతే... అవేం నవ్వించలేకపోయాయి. ఇరవై మంది కమెడియన్లు ఓ ఇంటికెళ్లి.. అక్కడ తమకొచ్చిన విద్యలన్నీ కెమెరా ముందు ప్రదర్శించి, దాన్నే ఎడిటింగ్ చేసుకుని, ఆర్.ఆర్ తగిలించి, వదిలినట్టుంది ఈ సినిమా. స్క్రిప్టు లేకుండా, దర్శకుడు లేకుండా (ఈ సినిమాకి దర్శకుడెవరన్నది తెలీదు) సినిమా తీస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి `రారా` ఓ గ్రేట్ ఎగ్జాంపుల్.
తెరపై అలీ, హేమ, రఘుబాబు, షకలక శంకర్.. వీళ్లంతా కామెడీ చేయడానికి వీర లెవిల్లో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఒక్కటంటే ఒక్క సందర్భంలోనూ నవ్వు రాదు. హారర్ దృశ్యాల్లో ఒక్క సెకను కూడా గుండె వేగం పెరగదు. మరి ఇలాంటి ప్రయత్నాలు చేయడం ఎందుకు... నిర్మాత డబ్బు, ప్రేక్షకుడి టైమ్ రెండూ వృథానే. దెయ్యం కథలకంటూ ఓ ఫార్మెట్ ఉంటుంది. దాన్ని వీళ్లూ ఫాలో అయినా.. ఆ ఆత్మని పట్టుకోలేకపోయారు. ద్వితీయార్థంలో దెయ్యం ఫ్లాష్ బ్యాక్ ఎందుకు ఓపెన్ అవుతుందో అర్థం కాదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కథ చెప్పాడో తెలీదు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఒక్క డైలాగ్ కూడా వినిపించదు. ఆ ప్రయత్నం బాగున్నా... ఫ్లాష్ బ్యాక్ మాత్రం పేలవంగా ఉంది. దెయ్యాలతో సినిమా తీయడం.. అది సూపర్ హిట్ కావడం, హీరో ఆశయం తీరడం వరకూ ఓకే. కానీ ఆ ప్రయత్నంలో ప్రేక్షకుడిని మాత్రం థియేటర్లో బంధించేసి రాచి రంపాలు పెట్టారు.
* సాంకేతికంగా
దర్శకుడ్ని ఓ నాలుగు మాటలు అందామంటే... అతగాడి పేరు తెరపై వేయలేదు. చిత్రబృందం కూడా ముందే జాగ్రత్తపడిపోయి 'ఈ సినిమాకి దర్శకుడెవరో చెప్పం' అంది. దర్శకుడి పేరు లేకుండా ఓసినిమా బయటకు రావడం టాలీవుడ్‌లో ఇదే మొదటిసారేమో.
సంగీతం, ఛాయాగ్రహణం, గ్రాఫిక్స్ ఇవన్నీ ప్రాధమిక స్థాయిలోనే ఉన్నాయి. 'నీల.. నీల' అంటూ సాగే పాట మాత్రం బాగుంది. నిర్మాణ విలువల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
* ప్లస్ పాయింట్స్
+ ఆ ఒక్కటీ అడక్కండి
* మైనస్ పాయింట్స్
- చాంతాడంత లిస్టు ఉంది
* ఫైనల్ వర్డిక్ట్: రా.. రా... రాచి రంపాలు పెడతా!
రివ్యూ రాసింది శ్రీ