తారాగణం: శర్వానంద్, లావణ్య త్రిపాఠి, రవికిషన్, అక్ష, జయ ప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజీ
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
సంగీతం: రధన్
కెమెరామెన్: కార్తీక్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
నిర్మాత: భోగవల్లి బాపినీడు
కథ-కథనం-దర్శకత్వం: చంద్రమోహన్
వరుస విజయాలతో మంచి స్పీడు మీదున్నాడు శర్వానంద్. ఈ సంక్రాంతికి ఇద్దరు పెద్ద హీరోలతో పోటీ పడికూడా ఓ సూపర్ హిట్ సాధించాడు. దాంతో శర్వా సినిమాలపై అంచనాలు తారా స్థాయికి చేరుకొంటున్నాయి. ఇప్పుడు రాధ అంటూ మరోసారి అలరించడానికి సిద్ధమయ్యాడు. చంద్రమోహన్ అనే దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు. కొత్త దర్శకులతో ఎప్పుడూ హిట్లిచ్చిన శర్వా.. ఈ సారి ఏం చేశాడు? రాధగా ఎంతలా అలరించాడు?? చూద్దాం రండి
* కథ:
రాధాకృష్ణ (శర్వానంద్)కి చిన్నప్పటి నుంచీ కృష్ణుడన్నా, పోలీస్ అన్నా ఇష్టం. ఎప్పటికైనా పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కంటుంటాడు. పోలీస్ అవ్వకముందే.. దుష్ట శిక్షణ చేసి డీజీపీ దృష్టిలో పడతాడు. రాధకు ఉన్న కమిట్‌మెంట్ చూసి.. ఎస్.ఐని చేసేస్తాడు డీజీపి. వరంగల్‌లో పోస్టింగ్ వస్తుంది. అయితే.. అక్కడ చేయడానికి పనేం ఉండదు. అందుకే... రాధ (లావణ్య త్రిపాఠి) ని ప్రేమించే పనిలో పడతాడు. తనని ప్రేమలో దించేస్తాడు. రాధాకృష్ఱ పోరు పడలేక.. హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ చేస్తుంది పోలీస్ డిపార్ట్‌మెంట్. హోం మినిస్టర్ సుజాత (రవికిషన్)కి సీఎమ్ సీటుపై గురి. పైకి మంచి వాడిలా నటిస్తూ.. అక్రమాలెన్నో చేస్తుంటాడు. సింపతీ కోసం తన మీటింగ్‌లోనే.. తనే బాంబు పెట్టించుకొంటాడు. ఆ ఘటనలో చాలామంది పోలీసులు ప్రాణాలు కోల్పోతారు. సుజాత నిజ స్వరూపాన్ని రాధాకృష్ణ ఎలా బయటపెట్టాడు? సీఎమ్ కాకుండా ఎలా ఆపాడు?? అనేదే రాధ కథ.
* ఎవరెలా నటించారంటే..?
శర్వా కామెడీ టైమింగ్ ఈ సినిమాలో బాగుంది. ఆ టైమింగ్‌తోనే చాలా సీన్లు గట్టెక్కించాడు. రొమాంటిక్ సీన్లలోనూ బాగా నటించాడు. లావణ్య త్రిపాఠి మరోసారి గ్లామరెస్ పాత్రకు పరిమితమైంది. అక్ష ఒకే ఒక్క పాటలో కనిపించింది. రవికిషన్ నటన బాగుంది. రవికిషన్ లాంటి నటుడు ఉండబట్టే... విలనిజం కాస్త ఎలివేట్ అవ్వగలిగింది. షకలక శంకర్, సప్తగిరి నవ్వులు పంచారు. మిగిలినవాళ్ల నటన షరా మామూలే
* ఎలా తీశారంటే...?
శర్వానంద్ ఎక్కువగా కథాబలమున్న సినిమాలనే చేస్తున్నాడు. తన కెరీర్‌లో కథ విషయంలో తప్పు చేసిన సందర్భం ఒక్కటీ ఉండదు. అయితే... తొలిసారి శర్వా కథకి ప్రాధాన్యం ఇవ్వలేదన్న సంగతి అర్థమవుతుంది. కథ కంటే... ట్రీట్మెంట్ బాగుంటే చాలనుకొని రాధ సినిమా చేయడానికి ప్రొసీడ్ అయిపోయాడు. కథగా చెప్పాల్సివస్తే.. రాధలో మేటర్ లేదు. కేవలం సన్నివేశాలతోనేనడిపించాల్సివచ్చింది. రాధగా శర్వానంద్ క్యారెక్టరైజేషన్ బాగా రాసుకొన్నాడు చంద్రమోహన్. పోలీస్ అకాడమిలో శిక్షణ, లావణ్యతో లవ్ మేటర్... ఈ సీన్లు బాగానే వర్కవుట్ అయిపోయాయి. ఫస్టాఫ్ కేవలం ఫన్‌తో నడిపించాడు. అలాగని మరీ విరగబడి నవ్వే కామెడీ సీన్లేం ఉండవు. పైపైన ఓకే అనిపిస్తాయి. సెకండాఫ్ కథ, సన్నివేశాలు.. ఇవన్నీ పక్కదోవ పట్టేస్తాయి. క్లారిటీ లేని సీన్లు కోకొల్లలుగా కనిపిస్తాయి. చెప్పాల్సిన సంగతులు చాలా తక్కువ ఉండడంతో టైమ్ పాస్ సీన్లపై ఆధారపడాల్సివచ్చింది. సెకండాఫ్ లో చాలా సీన్లు ముందే ఊహించేయొచ్చు. ఫస్టాఫ్‌లో ఉన్న కామెడీ కూడా సెకండాఫ్‌లో లేకపోవడం పెద్ద లోటు. కట్ చేస్తే పాట అన్నట్టు పాట తరవాత పాట వచ్చి పడిపోతుంటాయి. కామెడీ టైమింగ్ లో అదరగొట్టిన శర్వానంద్.. మాస్ ఎలిమెంట్స్ వచ్చేసరికి డీలా పడిపోయాడు. దాంతో.. ఆయా సన్నివేశాలన్నీ తేలిపోయాయి.
* సాంకేతికంగా ఎలా ఉందంటే..?
నిర్మాణ విలువలకు ఏం లోటు లేదు. కానీ... పాటలు విసిగిస్తాయి. థియేటర్లో చూడ్డానికి ఓకే. సెకండాఫ్ లో ఏ పాట ఎందుకు వస్తుందో అర్థం కాదు. సీన్‌లో బలం లేనప్పుడు ఆర్ ఆర్ ఎంత ఎలివేట్ చేసినా లాభం ఏముంటుంది? కెమెరా వర్క్ ఆకట్టుకొంటుంది. దర్శకుడికి చాలా చోట్ల క్లారిటీ కరువైంది. బలహీనమైన కథకు మెరుగులు అద్దడానికి తన వంతు కృషి చేశాడు. కానీ.. విజయవంతం కాలేకపోయాడు.
* బలాలు
- శర్వానంద్
- ఫస్టాఫ్ కామెడీ
* బలహీనతలు
- సెకండాఫ్
- క్లైమాక్స్
* ఫైనల్ వర్డిక్ట్:
రాధ... పర్లేదు చూడొచ్చు
యావరేజ్ యూజర్ రేటింగ్: 3/5
రివ్యూ బై: శ్రీ