'యముడికి మొగుడు' సినిమాతో క్యూట్‌గా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ క్యూట్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ రిచా పనయ్. ఈ అమ్మడికి ఎక్స్‌పోజింగ్ విషయంలో అస్సలు పరిమితులు లేవంట. అందుకే ఇంత వరకూ చేసిన పాత్రలన్నీ గ్లామర్ పాత్రలే. అయితే ఇకపై అమ్మడు ప్రాధాన్యం ఉన్న పాత్రల్ని ఎంచుకుంటానంటోంది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటానంటోంది. ఈ ముద్దుగుమ్మ తాజా చిత్రం 'రక్షక భటుడు'. ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రిచా నటన అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుందంటోంది. కేవలం గ్లామర్ పండించేందుకే కాకుండా, ఈ సినిమాలో నటిగా తనలోని టాలెంట్ బయటికి వచ్చిందంటోంది ముద్దుగుమ్మ రిచా పనయ్. ఈ భామ తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళంలోనే కాకుండా హిందీలో కూడా పలు చిత్రాల్లో నటిస్తోంది. నటన అనేది ఏదో ఒక భాషకి పరిమితం కాకూడదనీ, అన్ని భాషల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ అభిమానం తెచ్చుకుంటేనే నటనకు అసలైన గుర్తింపు అని నీతి సూత్రాలు కూడా చెప్పేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందుకే మంచి అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోనంటోంది. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'రక్షక భటుడు' సినిమాలో రిచా పనయ్ మైథిలి పాత్రలో నటిస్తోంది. చాలా ఇష్టపడి, కష్టపడి చేసిన పాత్ర ఇది. ఈ సినిమా తర్వాత రిచా అంటే ఏంటో మీకే తెలుస్తుంది అంటూ ప్రేక్షకులకి సవాల్ విసురుతోంది ఈ క్యూట్ భామ రిచా పనయ్.