కాంచ‌న 3 మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

నటీనటులు: రాఘవ లారెన్స్, ఓవియా, వేదిక, నిక్కీ తంబోలి, కోవై సరళ తదితరులు. 
దర్శకత్వం: రాఘవ లారెన్స్. 
బడ్జెట్: 40 కోట్లు. 
సంగీతం: యస్. యస్. తమన్. 
విడుదల తేదీ: ఏప్రిల్ 19, 2019

 

రేటింగ్‌: 2/ 5

 

భ‌య‌ప‌డ‌డానికి హార‌ర్ సినిమాల‌కెళ్తాం. కానీ... ఈరోజుల్లో హార‌ర్ సినిమా అంటేనే భ‌యం వేసేస్తోంది. ఎందుకంటే ఏ సినిమా చూసినా ఒకేలా ఉంటుంది. ఓ బంగ్లా చుట్టూ క‌థ న‌డిపించేయ‌డం, ఆర్‌.ఆర్‌తో భ‌య‌పెట్ట‌డం, ఆత్మ‌లు రివెంజ్ తీర్చుకోవ‌డం.. ఇలా ఏ హార‌ర్ సినిమా చూసుకున్నా ఇదే క‌థ‌. దాదాపుగా ఇదే లైన్ ప‌ట్టుకుని గంగ తీశాడు లారెన్స్‌. 

 

ముని, కాంచ‌న సిరీస్‌లో వ‌చ్చిన సినిమాలకు కాసుల వ‌ర్షం కురిసింది. ఆయా చిత్రాల్లో లారెన్స్ చేసిందొక్క‌టే. భ‌యంతో పాటు ఎమోష‌న్‌నీ పీక్స్ కి తీసుకెళ్లాడు. త‌న‌దైన స్టైల్‌లో డాన్సులు వేశాడు. మాస్ ఎలిమెంట్స్ జొప్పించాడు. అందుకే... లారెన్స్ దెయ్యం సినిమాల‌న్నీ బాగా ఆడాయి. ఆ ప‌రంప‌రలో `కాంచ‌న 3`ని వ‌దిలాడు. మ‌రి దెయ్యం సెంటిమెంట్ ఈ సినిమాతోనూ కొన‌సాగిందా? ఈ సినిమాతో లారెన్స్ కొత్త‌గా ఎలా భ‌య‌పెట్ట‌గ‌లిగాడు?

 

* క‌థ‌

రాఘ‌వ (లారెన్స్‌)కి చిన్న‌ప్ప‌టి నుంచీ దెయ్యాలంటే భ‌యం. కానీ దెయ్యాలు ప‌నిగ‌ట్టుకుని మ‌రీ రాఘ‌వ‌ని వెదుక్కుంటూ వ‌స్తుంటాయి. తాత‌య్య ఇంటికెళ్లే దారిలో... ఓ చెట్టుకింద భోజ‌నం చేద్దామ‌ని కారు ఆపితే.. అక్క‌డి నుంచి ఓ దెయ్యం రాఘ‌వ‌నీ, ఆ కుటుంబాన్నీ వెంటాడుతుంటుంది.

 

రాత్ర‌యితే చాలు వింత వింత శ‌బ్దాలూ, అరుపులు వినిపిస్తుంటాయి. పూజలు చేసినా ఫ‌లితం ఉండ‌దు. ఓసారైతే ఏకంగా రాఘ‌వ శ‌రీరాన్నే ఆవ‌హిస్తాయి. అయితే రాఘ‌వ శ‌రీరంలో ఉన్న ఆత్మ ఒక‌టి కాదు, రెండు అని తేలుతుంది. కాళి, రోసీ అనే రెండు దెయ్యాలు రాఘ‌వ శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తాయి. అస‌లు కాళి, రోసీ ఎవ‌రు? రాఘ‌వ శ‌రీరంలోకి ఎందుకొచ్చాయి? అనేదే `కాంచ‌న 3` క‌థ‌.

 

* న‌టీన‌టులు

లారెన్స్ పాత్ర‌లో చాలా షేడ్స్ ఉన్నాయి. వీలైనంత వ‌ర‌కూ త‌న పాత్ర‌ల‌కు న్యాయం చేశాడు. ముస‌లి గెట‌ప్‌లో కూడా రాఘ‌వ లారెన్స్ బాగున్నాడు. స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టాడు. అయితే కాళి పాత్ర మ‌రో క‌థానాయ‌కుడితో చేయిస్తే బాగుండేది. అన్ని పాత్ర‌లూ తానే చేయాల‌న్న ఆత్రం త‌గ్గించుకుంటే మంచిది. ముగ్గురు క‌థానాయిక‌లు కేవ‌లం గ్లామ‌ర్‌కే ప‌రిమితం. వాళ్ల‌కు వీలైన‌చోట మాత్రం ఓవ‌ర్ యాక్ష‌న్ చేయ‌డంలో పోటీ ప‌డ్డారు. శ్రీ‌మాన్, కోవై స‌ర‌ళ ఎప్ప‌టిలా శ్రుతిమించిన న‌ట‌న‌తో విసుగెత్తించారు.

 

* సాంకేతిక వ‌ర్గం

క్వాలిటీ ప‌రంగా ఎలాంటి లోపం లేదు. పాట‌లు రిచ్‌గా తీశారు. వంద‌లాది మంది డాన్స‌ర్ల న‌డుమ భారీగా చూపించారు. పోరాటాలూ మాస్‌కి న‌చ్చుతాయి. అయితే.. క‌థ‌, క‌థ‌నాల విష‌యంలో లారెన్స్ ఏమాత్రం కొత్త‌గా ఆలోచించ‌లేక‌పోయాడు. పాత‌ స‌న్నివేశాలు, పాత ట్రిక్కుల‌తో కాల‌క్షేపం చేయాల‌ని చూశాడు.

 

* విశ్లేష‌ణ‌

లారెన్స్ ఎంచుకునే దెయ్యం క‌థ‌ల‌న్నీ ఇంచుమించు ఇలానే ఉంటాయి.  ఓ మంచి మ‌నిషిని ఎవ‌రో పొట్ట‌న పెట్టుకుంటారు. త‌నేమో ఆత్మ రూపంలో క‌థానాయ‌కుడి శ‌రీరంలో ప్ర‌వేశిస్తాడు. ఆ శ‌రీరాన్ని ఆస‌రా చేసుకుని శ‌త్రు సంహారం ఎలా చేశాడ‌న్న‌దే క‌థ‌. కాంచ‌న 3 కూడా అంతే. అందుకే క‌థ, క‌థ‌నాల విష‌యంలో కాంచ‌న 3 ఏమాత్రం కొత్త‌గా అనిపించ‌దు. దానికి తోడు చూసిన స‌న్నివేశాలే మ‌ళ్లీ మ‌ళ్లీ చూసిన‌ట్టు అనిపిస్తాయి. 

 

ప‌గ‌లు రొమాన్స్‌, అర‌వ కామెడీతో నెట్టుకొచ్చి, రాత్ర‌యితే.. దెయ్యాల‌కు ఎంట్రీ ఇచ్చేస్తాడు. అలా కాస్త న‌వ్వు, కాస్త భ‌యం అంటూ సినిమాని పంచుకుంటూ వెళ్లాడు. కాక‌పోతే ఆ న‌వ్వులో వెగ‌టు ఎక్కువ‌గా ఉంటుంది. భ‌యంలో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో తేలిపోతుంది. ఒక్కో స‌న్నివేశం చూస్తే, న‌వ్వాలో భ‌య‌ప‌డాలో కూడా అర్థం కాదు. భ‌య‌పెట్టాల్సిన చోట కూడా.. దాన్ని కామెడీ చేసేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతో ప్రేక్ష‌కుడు ఎలాంటి భావోద్వేగానికీ లోన‌వ్వ‌డు. 

 

అయితే క‌మ‌ర్షియ‌ల్ హంగుల్ని ఎక్కడ‌క‌క్క‌డ పేర్చుకుంటూ వెళ్ల‌డం మాత్రం మిస్ అవ్వ‌లేదు. మాస్ సినిమాల్లోలానే హీరో ఎంట్రీ సాంగ్‌, హీరోయిన్ల‌తో డ్యూయెట్లు, ఫైట్లు.. ఇలా అన్నీ ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు. కామెడీ మాత్రం చాలా ఓవ‌ర్ గా అనిపిస్తుంది. కోవై స‌ర‌ళ‌తో లారన్స్ చేసిన స‌న్నివేశాల‌న్నీ శ్రుతిమించాయి. 

 

ద్వితీయార్థంలో కాళి క‌థ మొద‌ల‌వుతుంది. అక్క‌డ సెంటిమెంటు పాళ్లు ఎక్కువ‌. ఓ అనాథాశ్ర‌మం, వాళ్ల‌కోసం పాటు ప‌డే క‌థానాయ‌కుడు, ఆ అనాథాశ్ర‌మాన్ని కూల్చే విల‌న్‌.... ఇలా అక్క‌డ కూడా రొటీన్‌గా సాగిపోయింది క‌థ‌. క్లైమాక్స్ కూడా ఏమాత్రం భిన్నంగా ఉండ‌దు. దాంతో చాలాచోట్ల పాత సినిమానే చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది.

 

* ప్ల‌స్ పాయింట్స్

+ లారెన్స్‌
+ మాస్ ఎలిమెంట్స్‌


* మైన‌స్ పాయింట్స్‌

- పాత క‌థే
- అర‌వ కామెడీ

 

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: టైటిల్ మారింది అంతే.

 

- రివ్యూ రాసింది శ్రీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS