నటీనటులు: నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్, సత్యరాజ్ తదితరులు.
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటర్: నవీన్ నూలి
విడుదల తేదీ: ఏప్రిల్ 19, 2019
రేటింగ్: 3.5/ 5
స్పోర్ట్స్ డ్రామాలు చాలా చూశాం. ఓ విజేత జీవితంలో ఎగుడుదిగుడులు, ఎత్తుపల్లాలు... వాటిని అధిగమించిన తీరు, అందుకోసం పడిన మానసిక సంఘర్షణ... ఇవే కనిపిస్తాయి. చెక్ దే ఇండియా నుంచి - దంగల్ వరకూ ఏ సినిమా చూసినా ముడి సరుకు ఇంతే.. ఇలానే ఉంటుంది. అయితే దానికి తండ్రీ కొడుకుల సెంటిమెంట్ బలంగా జోడిస్తే... అది నాని `జెర్సీ` అవుతుంది.
తెలుగులో స్పోర్ట్స్ డ్రామాలు చాలా తక్కువ. ఉన్నవి కూడా... ఒకే ఫార్మెట్‌లో నడుస్తుంటాయి. లేచి పడడం.. పడి లేవడం - దాంతో సినిమా ముగిసిపోతుంది. వాటి చుట్టూ... ఓ బలమైన కథ చెప్పడం, ఓ తండ్రికి కొడుకుపై ఉన్న ప్రేమ... ఓ కొడుకుకి తండ్రిపై ఉన్న నమ్మకం జోడించడం `జెర్సీ`లో కనిపించింది. మరి ఈ కథని గౌతమ్ ఎలా తీశాడు? నాని ఎంత వరకూ మెప్పించాడు? ఈ సినిమా ఎవరికి నచ్చుతుంది?
* కథ
అర్జున్ (నాని) ఓ క్రికెటర్. కొండంత టాలెంట్, కొంచెం యారగెన్సీ ఉన్న క్రీడాకారుడు. సారా (శ్రద్దా శ్రీనాథ్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కొంతకాలం కాపురంగా సజావుగానే సాగుతుంది. అయితే.. జాతీయ జట్టుకు ఎంపిక కాలేదన్న కోపంతో.. క్రికెట్‌కు పూర్తిగా దూరం అవుతాడు అర్జున్. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన ఉద్యోగం కూడా ఊడిపోతుంది. అర్జున్ కొడుకు.. నాని. కొడుకంటే అర్జున్‌కి విపరీతమైన ప్రేమ.
నాని పుట్టిన రోజున.. 'నాన్న నాకో జెర్సీ కొనిపెట్టవూ' అని అడుగుతాడు. దాని ధరేమో... అయిదు వందలు. సారాని అడిగితే... వద్దంటుంది. స్నేహితుల దగ్గర అప్పు కోసం విఫల ప్రయత్నం చేస్తాడు. చివరికి... వెయ్యి రూపాయల కోసం న్యూజీలాండ్ టీమ్‌తో ఓ ఛారిటీ మ్యాచ్ ఆడతాడు. ఆ ఆటలో... తాను ఇన్నాళ్లూ ఏం కోల్పోయాడో అర్థం అవుతుంది. దాంతో తిరిగి బ్యాటు పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. జాతీయ జట్టులో స్థానం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. మరి ఆ ప్రయాణం చివరికి ఏ తీరానికి చేరుకుందో తెలియాలంటే... జెర్సీ చూడాలి.
* నటీనటులు
నాని కెరీర్‌లో ది బెస్ట్ అనదగ్గ నటన.. జెర్సీలో చూస్తాం. అర్జున్ పాత్రలో ఒదిగిపోయిన విధానం ముచ్చటగొలిపేలా ఉంది. హుషారైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన నాని... ఇంత బరువైన పాత్రని కూడా ఇంత గొప్పగా పోషించగలనని నిరూపించుకున్నాడు. కొంతకాలం అర్జున్ హ్యాంగోవర్ నానిలో ఉండిపోతే... అది నాని తప్పు కాదు. కేవలం ఆ పాత్రది మాత్రమే.
శ్రద్ధా గ్లామర్ అంతంత మాత్రమే. కానీ.. ఆ పాత్రని కూడా ప్రేమిస్తాం. చాలా సెటిల్డ్‌గా నటించింది శ్రద్ధా. నాని తనయుడిగా కనిపించిన `నాని` భలే ముద్దుగా ఉన్నాడు. అంతే బాగా నటించాడు. కోచ్ పాత్రలో సత్యరాజ్ నటన మరింత బాగుంది. నాని - సత్యరాజ్ మధ్య చూపించిన బాండింగ్... ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
* సాంకేతిక వర్గం
టెక్నికల్‌గా ఈ సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా ఆర్.ఆర్. అనిరుథ్ అందించిన నేపథ్య సంగీతం అదనపు బలాన్ని ఇచ్చింది. కథలో పాటలు మిక్స్ అయిపోయాయి. క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన సన్నివేశాలు రియలిస్టిక్‌గా తీశారు. థియేటర్‌నే స్టేడియంగా మార్చేశారు. దర్శకుడు తాను ఎంచుకున్న కథని నిజాయతీగా అనుకున్నది అనుకున్నట్టు తీయగలిగాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది.
* విశ్లేషణ
ఇదో ఎమోషనల్ డ్రామా. జెర్సీ.. క్రికెట్ అనగానే.. స్పోర్ట్స్ సినిమా అనే కోణంలో చూస్తాం గానీ.. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే చక్కటి ఫ్యామిలీ డ్రామా ఇది. తన కొడుకు ముందు హీరోగా మిగిలిపోవడానికి ఓ తండ్రి చేసిన త్యాగం ఈ సినిమా. స్పోర్ట్స్ డ్రామా అంటే ఇంతే, ఇలానే ఉండాలి అనే లెక్కలు దర్శకుడు వేసుకోలేదు. తాను అనుకున్న కథని నిజాయతీగా చెప్పించే ప్రయత్నం చేశాడు. డ్యూయెట్లు పెట్టలేదు. కామెడీ ట్రాకులు ఇరికించలేదు. జబర్‌దస్త్ పంచ్‌లు.. బలవంతంగా చొప్పించలేదు. ఓ తండ్రి - ఓ కొడుకు... క్రికెట్.. అదే జెర్సీ. 26వ యేట అర్జున్ పతనంతో మొదలైన కథ... 36వ యేట అర్జున్ సాధించిన విజయంతో ముగుస్తుంది. వాటిమధ్య బలమైన భావోద్వేగాల్ని పండించగలిగాడు దర్శకుడు.
తనయుడి పుట్టిన రోజున ఓ జెర్సీ కొనడానికి అర్జున్ పడిన పాట్లు.. హృదయానికి హత్తుకుంటాయి. 'నువ్వు నన్ను కొట్టావంటే అమ్మకూడా నమ్మదు. అందుకే అబద్దం చెప్పా` అని ఓ కొడుకు తండ్రితో అంటే.. గుండెలు బరువెక్కిపోతాయి. రంజీ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదిచన తరవాత.. ఆ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో, ఏ స్థాయిలో పంచుకోవాలో అర్థం కాక... ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్ దగ్గర... అర్జున్ అరవడం చూస్తే.. ఓ విజయం తాలుకూ గాఢత ఏపాటిదో అర్థం అవుతుంది.
విజేతలే కాదు... విజయానికి చాలా దూరంలో ఉండిపోయినవాళ్లకు కూడా.. విజయపు వాసన ఎలాంటిదో ఆ సన్నివేశం చూపిస్తుంది. పతాక సన్నివేశాలు మరో ఎత్తు. ఈ కథని ఎలా ముగించాలో.. అలానే ముగించాడు దర్శకుడు. అంత వరకూ పడిలేచిన భావోద్వేగాలన్నీ పీక్స్ కి వెళ్లాలంటే.. ఈ తరహా క్లైమాక్స్ తప్పదు. అక్కడకక్కడ కాస్త స్లో నేరేషన్, ఒకే పాయింట్ చుట్టూ కథ నడవడం.. ఇవన్నీ కాస్త బోర్ కొట్టించొచ్చు. కానీ... అర్జున్ పాత్రని ఇష్టపడడం ప్రారంభిస్తే... ఆ బోరింగ్ సీన్లనీ ప్రేమించడం మొదలెడతాం.
* ప్లస్ పాయింట్స్
+ నాని నటన
+ ఎమోషన్
+ పతాక సన్నివేశాలు
* మైనస్ పాయింట్స్
- స్లో నేరేషన్
* ఫైనల్ వర్డిక్ట్: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. నాని.
- రివ్యూ రాసింది శ్రీ.