నటీనటులు: అశ్విన్ బాబు, అవికా గోర్,అలీ, ఊర్వశి, బ్రహ్మజీ, హరితేజ తదితరులు
దర్శకత్వం: ఓంకార్
నిర్మాణం: ఓకే ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: షబీర్
సినిమాటోగ్రఫర్: చోటా కె. నాయుడు
విడుదల తేదీ: అక్టోబర్ 18, 2019
రేటింగ్: 2.5/5
కథ చెప్పడం.. వినోదం పంచడమే సినిమా లక్ష్యం కావాలి. వెనక మరే ఇతర కారణం ఉన్నా... సినిమా పక్కదారి పడుతుంది. కథ ఉన్నా అది అనుకొన్నట్టుగా తెరపైకి రాదు. మరోమారు ఆ విషయాన్ని రుజువు చేసిన చిత్రమే `రాజుగారి గది3`. `రాజుగారి గది` ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ఈ సినిమాతో వినోదం పంచడం కంటే కూడా.. తమ్ముడిని కథానాయకుడిగా ప్రజెంట్ చేయాలనే ప్రయత్నమే ఎక్కువ డామినేట్ చేసినట్టుంది ఓంకార్‌ని.
దాంతో సగం సినిమా తన తమ్ముడికోసం.. సగం సినిమా కథ కోసం అన్నట్టుగా మారిపోయింది. తెలుగులో మూడో సినిమా వరకు వచ్చిన ఈ ఫ్రాంచైజీ చిత్రంపై ముందు నుంచీ మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు దీటైన సాంకేతిక బృందం కూడా తోడవడం ఆ అంచనాలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. మరి అందుకు తగ్గట్టుగా సినిమా ఉందో లేదో తెలుసుకునేముందు కథేమిటో చూద్దాం...
* కథ
మాయ (అవికాగోర్) వైద్యురాలు. ఆమెని చూసి మనసు పారేసుకుంటాడు డాక్టర్ శశి (బ్రహ్మాజీ). కానీ మాయ వెనకాల ఉన్న ఓ శక్తి దెయ్యంలాగా మారి శశిని భయపెడుతుంది. దాంతో ఆమె జోలికి వెళ్లడు. శశినే కాదు... మాయని తాకాలని ఎవరు ప్రయత్నించినా వాళ్ల భరతం పడుతుంది ఆమె వెనకాల ఉన్న శక్తి.
ఇదే అదనుగా భావించిన శశి తన కాలనీలో అందరికీ కొరకరాని కొయ్యగా మారిన ఆటోడ్రైవర్ అశ్విన్ (అశ్విన్‌బాబు)ని మాయకి దగ్గర చేసే ప్రయత్నం చేస్తాడు. మాయని ప్రేమిస్తే ఆమె వెనకాల ఉన్న శక్తి అశ్విన్ భరతం పడుతుందనేది శశి ఆలోచన. మరి అశ్విన్ మాయని ప్రేమించాక ఏం జరిగింది? మాయ వెనకాల ఉన్న శక్తి కథేమిటి? ఆ శక్తికీ, మంత్రగాడైన మాయ తండ్రి గరుడ పిళ్లై (అజయ్‌ఘోష్)కీ సంబంధమేమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
* నటీనటులు
అశ్విన్ డ్యాన్సుల వరకు పర్వాలేదు కానీ.. భావోద్వేగాల పరంగా మాత్రం మరింత రాటుదేలాలి. అలీతో కలిసి ఆయన చేసిన కామెడీ కూడా మెప్పించింది. అలీ ఈ సినిమాలో కీలకమైన పాత్ర పోషించాడు. కథానాయకుడితోపాటే సినిమా మొత్తం కనిపిస్తారు. ఆయన హావభావాలు, డైలాగ్ డెలివరీ ఈ సినిమాకి ప్రాణం పోసింది.
అజయ్ ఘోష్, ఊర్వశిల అనుభవం కూడా ఈ సినిమాకి బాగా పనికొచ్చింది. వాళ్లు ద్వితీయార్థంలో తమ అనుభవవాన్నంతా రంగరించి నటించారు. ధన్‌రాజ్, బ్రహ్మాజీ, హరితేజ, ప్రభాస్ శ్రీను తదితరులు పరిధి మేరకు నటించారు. అవికా పర్వాలేదనిపించింది. ఆమెకి పెద్దగా నటించే అవకాశం రాలేదు. పతాక సన్నివేశాల్లో మాత్రం కాసేపు సందడి చేసింది.
* సాంకేతిక వర్గం
సాంకేతికంగా సినిమా ఉన్నతంగాఉంది. ఛోటా కెననాయుడు కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఆయన లైటింగ్ మూడ్‌ని బాగా క్యారీ చేసింది. సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాగుంది. షబ్బీర్ నేపథ్య సంగీతం సినిమాకి కీలకం. సాయిమాధవ్ బుర్రా స్థాయిలో సంభాషణలు లేవు కానీ.. కామెడీలో ఆయన సంభాషణలు కూడా కీలక పాత్ర పోషించాయి.
ఓంకార్ కామెడీపై పట్టు ప్రదర్శించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మంచి కాన్సెప్ట్, అందుకు తగ్గ సాంకేతిక బృందం, ఫ్రాంచైజీ అనే ప్రచారం... ఇలా కలిసొచ్చిన మంచి అవకాశాన్ని ఆశించిన స్థాయిలో అందిపుచ్చుకోలేకపోయిన చిత్రమిది. కామెడీ వరకు ప్రేక్షకులకు మంచి కాలక్షేపమే కానీ.. అంచనాల స్థాయిలో ఆకట్టుకోలేని చిత్రమిది.
* విశ్లేషణ
ఆసక్తిని రేకెత్తించే కాన్సెప్ట్‌నే ఎంచుకొన్నాడు దర్శకుడు ఓంకార్. కానీ దాన్ని అంతే ఆసక్తిగా తెరపైకి తీసుకురావడంలో విఫలమయ్యాడు. హారర్, థ్రిల్లింగ్, కామెడీ... ఇలా మూడు ఎలిమెంట్స్‌తో కూడిన ఈ కాన్సెప్ట్‌ని కేవలం కామెడీ కోణంలో మాత్రమే డీల్ చేశాడు. దాంతో ద్వితీయార్థంలో కాసిన్ని నవ్వులు పండటం మినహా సినిమా చెప్పుకోదగ్గ విషయం కనిపించదు. ప్రథమార్థం నాయకానాయికల మధ్య ప్రేమ, కాలనీలో హంగామాకే పరిమితమైంది. ఆ సన్నివేశాల్లో కూడా కొత్తదనం కానీ, వినోదం కానీ లేకపోవడంతో సినిమా సాదాసీదాగా మారిపోయింది.
ద్వితీయార్థం మొదలయ్యేటప్పుడు అసలు కథని గుర్తు చేసుకున్నట్టున్నాడు ఓంకార్. అక్కడికక్కడే మాయ వెనకాల ఉన్న శక్తి... యక్షి కథని రివీల్ చేయడం, ఆ వెంటనే దాన్ని దూరం చేసేందుకు ప్రయత్నాలు మొదలవడంతో అసలు ఇందులో కథ ఉందా అనే అనుమానం రేకెత్తుతుంది. యక్షికి సంబంధించిన తాళ పత్రాల అన్వేషణలో సాగుతున్న క్రమమే బాగా నవ్వించింది. అశ్విన్, అలీ, అజయ్ ఘోష్, ఊర్వశి, దన్‌రాజ్ కలిసి చేసే హంగామా సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాని కాస్తలో కాస్త నిలబెట్టేది కూడా ఆ సన్నివేశాలే. అయితే హారర్ సంగతిని మాత్రం మరిచిపోతాం.
గుంపులు గుంపులుగా దెయ్యాలు వచ్చి వెళుతున్నా భయం మాత్రం రాదు. దెయ్యాల్ని అలా నవ్వుల పాలు చేశారన్నమాట. ఇక పతాక సన్నివేశాలు లాజిక్‌కి దూరంగా సాగుతాయి. హారర్ కామెడీ కథల విషయంలో లాజిక్‌గా ఆలోచించడం ఎప్పుడో మరిచిపోయారు తెలుగు ప్రేక్షకులు. ఈ కాన్సెప్ట్‌నే ఇంకా ఆసక్తికరంగా మార్చేయొచ్చు. కానీ దర్శకుడు అసలు ఉద్దేశం తన తమ్ముడిని మాస్ కోణంలో చూపెట్టాలనుకోవడం. ప్రథమార్థంలో ఎక్కువగా ఆ హంగామానే కనిపిస్తుంది. అనవసరం అనిపించే బిల్డప్ షాట్‌లు, పాటలు కలిసి ఈ కాన్సెప్ట్‌ని ఆరంభంలోనే దెబ్బతీశాయి. కానీ ద్వితీయార్థంలో కామెడీ పరంగా మాత్రం ఓంకార్‌కి మంచి మార్కులే పడతాయి.
* ప్లస్ పాయింట్స్
సాంకేతిక వర్గం
కథా నేపథ్యం
* మైనస్ పాయింట్స్
కథ, కథనం
భయ పెట్టే అంశాలు లేకపోవడం
* ఫైనల్ వర్డిక్ట్: భయం లేని నవ్వులు
- రివ్యూ రాసింది శ్రీ