నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల తదితరులు
దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: సత్యనారాయణ కోనేరు
సంగీతం: జిబ్రాన్
సినిమాటోగ్రఫర్: వెంకట్ సి దిలీప్
విడుదల తేదీ: ఆగస్టు 2, 2019
రేటింగ్: 3/5
రీమేక్ సినిమా అంటే ఆషామాషీ కాదు మాతృకలోని ఆత్మ పక్కాగా కథలోకి ట్రాన్స్‌లేట్ కావాలి రీమేక్ చేస్తున్నామనగానే నేటివిటీతో పాటు, స్థానిక హీరో ఇమేజ్ తాలూకు అంశాల్ని కూడా పరిగణనలోకి తీసుకొని మార్పు చేర్పులు చేస్తుంటారు. ఇక్కడే చాలా కథలు పక్కదారి పడుతుంటాయి. అదనంగా చేర్చిన అంశాలే ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. అలాగని వాటిని మక్కీకి మక్కీ తీయడానికి సాధ్యం కాదు. కొన్ని కథలు మాత్రం నేటివిటీకీ, ఇమేజ్‌కీ సంబంధం లేకుండా తెరకెక్కుతుంటాయి.
వాటికి భాషతోనూ, హీరోతనూ, వారి ఇమేజ్‌తోనూ సంబంధమే ఉండదు. అలాంటి ఓ చిత్రమే తమిళంలో `రాచ్చసన్` రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అలాంటి చిత్రాల్ని రీమేక్ చేయడం సులువే. దర్శకుడు ఆ చిత్రాన్ని తెలివిగా ఏమాత్రం మార్పులు చేర్పులు చేయకుండ యథాతథంగా తెరకెక్కించారు. `రాక్షసుడు` పేరుతో తెలుగులో ప్రేక్షకుమల ముందుకొచ్చిన ఆ చిత్రం ఎలా ఉంది? ఇదే నా తొలి చిత్రమని కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఈ సినిమా గురించి చెప్పడానికి కారణమేమిటి? తదితర విషయాలు తెలుసుకొనేముందు కథలోకి వెళదాం.
* కథ
ఒక క్రైమ్ కథతో సినిమా తీయాలనేది అరుణ్ (బెల్లంకొండ సాయిశ్రీనివాస్) ఆశ. అందుకోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ సినిమా కలలు మాత్రం ఫలించవు. దాంతో తన కలల్ని పక్కనపెట్టి ఇంట్లోవాళ్ల ఒత్తిడి మేరకు ఎస్సై ఉద్యోగంలో చేరతాడు. వచ్చీ రాగానే తన స్టేషన్ పరిధిలో స్కూలు పిల్లల వరుస హత్యల కేసు తగులుతుంది. దర్శకుడిగా తాను క్రైమ్ సినిమాలు చేయాలనుకోవడంతో చాలా కేసుల పూర్వపరాలు తెలుసుకొనుంటాడు. వాటితో పోల్చి ఈ కేసుపై ఓ నిర్ణయానికొస్తాడు.
కానీ పై అధికారులు పెద్దగా పట్టించుకోరు. ఇంతలో స్వయానా తన మేనకోడల్నే కోల్పోవల్సి వస్తుంది. ఎలాగైనా హంతకుడిని పట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్న అరుణ్ సస్పెండ్ అవుతాడు. కానీ పట్టు వదలకుండా కేసు పరిశోధన చేస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎలాంటి విషయాలు తెలుస్తాయి. వరుస హత్యలకి పాల్పడుతున్న సైకో ఎవరు? అతని నేపథ్యమేమిటి? అతన్ని ఎలా బయటికి రప్పించాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
* నటీనటులు
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఎందుకు ఇది తొలి సినిమా అన్నాడో సినిమా చూస్తే అర్థమవుతుంది. అతను కథ, పాత్రల్ని పక్కాగా అనుసరించి నటించాడు. ఇమేజ్‌ని మరిచిపోయి పాత్రలో ఒదిగిపోయాడు. అక్కడక్కడా డబ్బింగ్ చెప్పిన విధానం మినహాయిస్తే ఆయన పాత్రకి పర్‌ఫెక్ట్‌గా సూటైపోయాడు.
అనుపమ పరమేశ్వరన్ పాత్ర గురించి చెప్పుకోవల్సిందేమీ లేదు. ఆమె కృష్ణవేణి అనే ఓ స్కూల్ టీచర్‌గా సందడి చేసింది. మిగిలిన పాత్రధారులంతా కూడా చిన్న పాత్రల్లో కనిపిస్తారంతే. ఎక్కువగా తమిళ నటులే ఇందులో సందడి చేశారు.
* సాంకేతిక వర్గం
సాంకేతికంగా సినిమా బాగుంది. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. వెంకట్ దిలీప్ ఛాయాగ్రహణం కూడా చీకటి నేపథ్యాన్ని అంతే ఎఫెక్టివ్‌గా చూపించింది. రమేష్ వర్మ మాతృకని అనుసరించాడు.
కథ, కథనాల విషయంలో మాత్రం తమిళ రచయిత రామ్‌కుమార్‌కే క్రెడిట్ దక్కుతుంది. అయితే ఆ ఇంటనెన్సిటీ తగ్గకుండా దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
* విశ్లేషణ
ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా ఇది. తెలివైన ఓ హంతకుడిని పట్టుకొనేందుకు సాగిన పరిశోధన, ఆ క్రమంలో ఎదురైన సవాళ్లు ఎలాంటివన్నదే ఇందులో కీలకం. ఇలాంటి సినిమాలకి కథ కంటే కూడా కథనమే ప్రధానం. ఇందులో కూడా కథేమీ లేదు... ఒక హంతకుడి కోసం వేట తప్ప. అయితే ఆ హంతకుడు ఎవరనే విషయంలోనే మొదట పలు ప్రశ్నల్ని, అనుమానాల్ని రేకెత్తిస్తూ కథనం సాగుతుంది. వాటిని నివృత్తి చేసుకునే దిశగా పరిశోధన మొదలవుతుంది.
ఈ ప్రయాణంలో ప్రేక్షకులు వాళ్లలో మనసుల్లో తలెత్తే అనుమానాల్నిబట్టి ఒక అంచనాకి వస్తుంటారు, అలా వచ్చేలా కథనం సాగుతుంటుంది. కానీ అసలు విషయానికొచ్చేసరికి ప్రేక్షకుడు ఊహించింది కాకుండా, మరో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. అలా ఆద్యంతం థ్రిల్లింగ్‌గా , ఆసక్తికరంగా సాగుతుంది ఈ సినిమా. హత్యల వెనక సైకో ఉన్నాడనే విషయం ఇందులో కూడా ముందే తెలిసిపోతుంది. కానీ ఆ సైకో ఎవరు? ఎందుకు చేస్తున్నాడనేదే అంతుచిక్కదు. ఆ వేట ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఒక చిన్న క్లూని ఆధారంగా చేసుకొని కథనాన్ని తీర్చిదిద్దారు.
ఆ క్లూ బయటికొచ్చాక సాగే వేట, సైకో నేపథ్యం, అతని బారి నుంచి మరికొద్దిమంది అమ్మాయిల్ని తప్పించే వైనం ఆకట్టుకుంటుంది. అయితే పతాక సన్నివేశాలు అప్పటిదాకా పండిన థ్రిల్‌ని మాయం చేస్తాయి. మరికొన్ని మలుపులతో సినిమా సుదీర్ఘంగా సాగడమే అందుకు కారణం. మాతృకని మక్కీకి మక్కీ అనుసరించి చేసిన సినిమా ఇది. పాటలు, ఫైట్లు, ఇమేజ్ అని ఆలోచించకుండా కథ, కథనాల్ని పక్కాగా అనుసరించారు. ఇలాంటి కథలకి అదే శ్రేయస్కరం కూడా. ద్వితీయార్థంలో సాగదీతని మినహాయిస్తే ప్రేక్షకులు చూస్తున్నంతసేపూ థ్రిల్‌కి గురవుతారు.
* ప్లస్ పాయింట్స్
+కథ, కథనం
+థ్రిల్లింగ్ అంశాలు
+బెల్లంకొండ నటన
+సంగీతం
* మైనస్ పాయింట్స్
-ఆరంభ సన్నివేశాలు
-ద్వితీయార్థంలో క్లైమాక్స్
* ఫైనల్ వర్డిక్ట్: థ్రిల్‌ని పంచే కథ, కథనాలున్న సినిమా రాక్షసుడు.
- రివ్యూ రాసింది శ్రీ.