నటీనటులు: రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి తదితరులు.
దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సంగీత దర్శకుడు: సామ్ సి.ఎస్.
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్.
రేటింగ్ : 2/5
తెలుగు చిత్రసీమలో అత్యధిక పారితోషికం తీసుకొంటున్న హీరోల్లో రవితేజ ఒకడు. రవితేజలోనే కనిపించే విచిత్రం ఏమిటంటే.. తనకు ఫ్లాపులున్నా, సినిమాలు ఆగవు. పారితోషికమూ తగ్గదు. సినిమా సినిమాకీ రెమ్యునరేషన్ పెంచుకొంటూ వెళ్లడం రవితేజ స్పెషాలిటీ. క్రాక్‌కి ముందూ, ఆ తరవాత రవితేజకు హిట్లేం లేవు. పైగా అన్ని డిజాస్టర్లే. అయినా తన చేతిలో సినిమాలకు కొదవ లేదు. ఎలాగైనా హిట్టు కొట్టాల్సిందే అనుకొన్న తరుణంలోనూ రవితేజ ఫ్లాపులే ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి వచ్చింది. రవితేజ హిట్టు కొట్టి, తన స్టామినాని నిరూపించుకోవాల్సిన టైమ్ లో `రామారావు ఆన్ డ్యూటీ` విడుదలైంది. శరత్ మాండవ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ఇది. మరి రామారావు సరిగానే డ్యూటీ చేశాడా? ఈసారైనా రవితేజ హిట్టు కొట్టాడా?
* కథ
రామారావు (రవితేజ) నిజాయితీగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి. డిప్యూటీ కలెక్టర్ గా ప్రజల తరపున పనిచేసి సెభాష్ అనిపించుకొంటాడు. తన ఊరికే ఎం.ఆర్.ఓగా బదిలీ అయి వస్తాడు. అక్కడ కొన్ని సమస్యలు తనని ఆహ్వానిస్తాయి. ఒకప్పటి తన ప్రేయసిని కలుసుకోవాల్సివస్తుంది. తన భర్త సురేంద్ర (చైతన్య కృష్ణ) చాలా కాలంగా కనిపించకుండా పోతాడు. తనని వెదికి పట్టుకొనే బాధ్యతని రామారావు తీసుకొంటాడు. అయితే సురేంద్ర కేసుని తవ్వుకొంటూ వెళ్తే కొత్త నిజాలు, పాత కేసులు అన్నీ బయటకు వస్తుంటాయి. సురేంద్రలానే 20మంది కనిపించకుండా పోయారన్న నిజం తెలుస్తుంది. ఈ 20 మంది మిస్సింగ్ కేసుకీ... ఎర్ర చందనం స్మగ్లింగ్ ముఠాకీ ఏదో సంబంధం ఉందన్న సంగతి రాబడతాడు రామారావు. ఆ తరవాత ఏమైంది? సురేంద్రని పట్టుకొన్నాడా, లేదా? అసలు ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్ వెనుక ఎవరున్నారు? అనేది మిగిలిన కథ.
* విశ్లేషణ
రవితేజ అంటే ఎంటర్‌టైన్‌మెంట్. తన సినిమాకెళ్తే.. మనకే ఎనర్జీ వచ్చేస్తోంది. రవితేజ సినిమా ఎంత ఫ్లాప్ అయినా సరదాగా రిలాక్స్ అయిపోవడానికి ఏదో ఓ ఎపిసోడ్ ఉంటుంది. `రామారావు`లో అవి కూడా ఆశించలేం. సీన్ నెంబర్ వన్ నుంచి చివరి వరకూ.. సినిమా అంతా పూర్తిగా సీరియస్ మూడ్ లో సాగుతుంది. ఇన్వెస్టిగేషన్ మోడ్‌లోనే ఉంటుంది.
రామారావు డ్యూటీలో ఎంత సిన్సియరో చెప్పడానికి తొలి పావు గంటా వాడుకొన్నారు. ఆ తరవాత.. మిస్సింగ్ కేసు మొదలవుతుంది. ఇదో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. అలాంటప్పుడు ఆ పరిశోధనైనా ఆసక్తికరంగా ఉండాలి. ఉత్కంఠతన రేకెత్తించాలి. ఈ విషయంలోనూ దర్శకుడు విఫలం అయ్యాడు. రవితేజ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ సైతం.. చాలా రొటీన్ గా, విసుగ్గా ఉంటుంది. అసలు వాళ్లిద్దరూ ఎందుకు విడిపోవాల్సివచ్చిందో సరైన రీజన్ ఇవ్వలేకపోయాడు.
ఎం.ఆర్.ఓకి ఇన్ని అధికారాలు ఉన్నాయా? అనే విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విషయమై దర్శకుడు రిసెర్చ్ చేసి ఉంటే ఫర్వాలేదు. లేదంటే నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. ఓ పోలీస్ అధికారి చేయాల్సిన నేర పరిశోధన.. ఎం.ఆర్.ఓ చేయొచ్చా? అనే విషయం సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. పైగా.. ఎం.ఆర్.ఓ. `సీసా` పాటకు ఐటెమ్ గాళ్ పక్కన చేరి స్టెప్పులు వేయడం ఇంకాస్త కృతకంగా అనిపిస్తుంది. సీఐ మురళి - రామారావు మధ్య ఎపిసోడ్ హైలెట్ అని చిత్రబృందం ముందు నుంచీ ఊరిస్తూ వచ్చింది.
మురళి పాత్రని సమర్థవంతంగా తీర్చిదిద్దితే.. నిజంగానే ఆ ట్రాక్ బాగుండేది. కానీ పేలవమైన రైటింగ్ తో ఆ పాత్రనీ సరిగా వాడుకోలేకపోయాడు. మురళి పాత్ర పాజిటీవా? నెగిటీవా? అనేది తేలదు. ఈ సినిమాలో చాలా వరకూ అంతే. ముందు పాజిటీవ్ గా చూపించిన పాత్ర ఆ తరవాత నెగిటీవ్ గా మారుతుంది. ముందు నెగిటీవ్ అనుకొన్న పాత్ర ఆ తరవాత పాజిటీవ్ గా మారుతుంది. స్క్రీన్ ప్లే లో ఇదో ట్రిక్ కావొచ్చు. కాకపోతే.. అలా పాత్ర రూపు రేఖలు మారేటప్పుడు వచ్చే ధ్రిల్ ఈసినిమాలో కనిపించదు. పతాక సన్నివేశాలు కూడా రొటీన్ గా సాగుతాయి. పైగా.. పార్ట్ 2 ఉన్నట్టు హింట్ ఇచ్చారు. ఈమాత్రం దానికి పార్ట్ 2 కూడానా అనే కామెంట్లతో జనాలు థియేటర్ల నుంచి బయటకు వస్తారు.
* నటీనటులు
రవితేజ ఇది వరకు చేయని పాత్ర ఇది. రవితేజ లుక్.. అంతగా నప్పలేదు. కానీ.. కాస్ట్యూమ్స్ బాగున్నాయి. రవితేజ ఎనర్జీ ఈ సినిమాలో మిస్ అయ్యింది. అసలు ఈ కథని రవితేజ ఎలా ఒప్పుకొన్నాడా? అనే అనుమానం కూడా వేస్తుంది.
ఈసినిమాపై వేణు చాలా ఆశలు పెట్టుకొన్నాడు. అయితే... వాటిని మురళి పాత్ర నిలబెట్టలేకపోయింది. ఆ పాత్రని ఎటూ కాకుండా చేసేశాడు దర్శకుడు.
ఇద్దరు హీరోయిన్ల పాత్రలూ.. బొమ్మల్లా నిలబడడానికే పనికొచ్చాయి. తనికెళ్ల భరణి, నాజర్... వాళ్ల అనుభవానికి,ప్రతిభకు తగిన పాత్రలు మాత్రం ఇవి కావు.
* సాంకేతిక వర్గం
శ్యామ్ సి.ఎస్ నేపథ్య సంగీతం అందించడంలో దిట్ట. ఖైది సినిమాకి తనే రీ రికార్డింగ్ అందించాడు. ఈసినిమాలో మాత్రం తన సౌండింగ్ ఆకట్టుకోదు. పాటుల ఓకే అనిపిస్తాయి కానీ సందర్భంలేకుండా పాట కోసమే పాట అన్నట్టు వచ్చి పడిపోతుంటాయి. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ని రాంగ్ కాస్టింగ్ తో, పేలవమైన స్క్రీన్ ప్లేతో రూపొందిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి రామారావు ఓ ఉదాహరణగా నిలుస్తాడు.
* ప్లస్ పాయింట్స్
రవితేజ
ఫైట్స్
* మైనస్ పాయింట్స్
కథ
కథనం
ఎనర్జీ మిస్ అవ్వడం
* ఫైనల్ వర్డిక్ట్: డ్యూటీ సవ్యంగా సాగలేదు