రంగస్థలం తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్

By iQlikMovies - March 30, 2018 - 13:59 PM IST

మరిన్ని వార్తలు

తారాగణం: రామ్ చరణ్, సమంతా, ఆది పినిశెట్టి, అనసూయ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, అమిత్ శర్మ, నరేశ్, రోహిణి, బ్రహ్మాజీ, గౌతమి, రాజేష్, పూజ హెగ్డే తదితరులు
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీమేకర్స్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఎడిటర్: నవీన్ నూళి
ఛాయాగ్రహణం: రత్నవేలు
నిర్మాతలు: నవీన్, రవి శంకర్, మోహన్ చేరుకూరి
రచన-దర్శకత్వం: సుకుమార్ 

రేటింగ్: 3.5/5

స్టార్ వేరు... న‌టుడు వేరు. కొంత‌మంది స్టార్స్ ఎప్ప‌టికీ న‌టులు కాలేరు. అందుకే ప్ర‌తీ స్టార్‌కీ ఓ క‌ల ఉంటుంది. న‌టుడిగానూ త‌న‌ని తాను ప్రూవ్ చేసుకోవాల‌ని. అలాంటి క‌ల‌... రామ్‌చ‌ర‌ణ్ కంటే, దాన్ని సుకుమార్ నిజం చేస్తే ఎలా ఉంటుంద‌నేదానికి `రంగ‌స్థ‌లం` ఓ ఉదాహ‌ర‌ణ‌. ఈ సినిమాతో ఇటు రామ్‌చ‌ర‌ణ్‌, అటు సుకుమార్ ఇద్ద‌రూ మారారు.. వాళ్ల‌లోని స‌రికొత్త టాలెంట్ ని బ‌య‌ట‌కు తీశారు. అదెలాగో తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాలి.

* క‌థ‌

రంగ‌స్థ‌లం ఊరి ప్రెసిడెంట్ ఫ‌ణీంద్ర భూప‌తి (జ‌గ‌ప‌తిబాబు). సొసైటీ పేరుతో ఊరి జ‌నాల్ని దోచుకుంటుంటాడు.  రైతుల‌కు రావ‌ల్సిన సబ్సిడీ త‌న ఖాతాలోకి వెళ్తుంటుంది. అప్పుల పేరుతో భూముల్ని స్వాధీనం చేసుకుంటుంటాడు. అలాంటి ఊరి కుర్రాడే... చిట్టిబాబు (రామ్‌చ‌ర‌ణ్‌). త‌నో సౌండ్ ఇంజ‌నీర్‌. అన్న‌య్య కుమార్ బాబు (ఆది పినిశెట్టి) దుబాయ్ నుంచి వ‌స్తాడు. ఆ ఊరి జ‌నాల క‌ష్టాలు చూసి త‌ల్ల‌డిల్లిపోతాడు. ఊరి త‌ర‌పున పోరాటం చేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. అందులో భాగంగా ఫ‌ణీంద్ర భూప‌తికి పోటీగా ప్రెసిడెంట్ ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ‌తాడు. ఆ త‌ర‌వాత రంగ‌స్థ‌లం రాజ‌కీయాలు ఎలాంటి మ‌లుపులు తిరిగాయ‌న్న‌దే క‌థ‌.

* న‌టీన‌టులు.. 

నో డౌట్‌.. రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో బెస్ట్ పెర్‌ఫార్మ్సెన్స్ ఇచ్చేశాడు. చిట్టిబాబు పాత్ర‌ని ఆవ‌హించేసి..చిట్టిబాబు అనేవాడు ఇలానే ఉంటాడేమో అనిపించేలా జీవించాడు. చాలా స‌న్నివేశాల్లో చిట్టిబాబులా చ‌ర‌ణ్ విశ్వ‌రూపం చూపించాడు.ప‌తాక స‌న్నివేశాలు నిల‌బ‌డ్డాయంటే అదంతా చ‌ర‌ణ్ న‌ట‌న వ‌ల్లే. 

మ‌హాల‌క్ష్మి పాత్ర‌లో స‌మంత అందంగా కుదిరింది. ఆమెకూ ఇక ముందు ఇలాంటి పాత్ర ద‌క్క‌దేమో. ప‌ల్లెటూరి ప‌డుచుద‌నం, జాణ‌ద‌నం చూపించేసింది. అనసూయ అత్త పాత్ర కూడా గుర్తుండిపోతుంది. అన్న‌య్య‌గా ఆది పినిశెట్టి డీసెంట్‌గా న‌టించాడు. జ‌గ‌ప‌తిబాబులోనూ  ఓ కొత్త మాడ్యులేష‌న్ చూసే అవ‌కాశం ద‌క్కింది. తెర‌పై క‌నిపించిన ప్ర‌తీ పాత్ర‌.. త‌మ వంతు న్యాయం చేసింది.

* విశ్లేష‌ణ‌.. 

ఇదో పొలిటిక‌ల్ డ్రామా. 1980 నేప‌థ్యంలో సాగుతుంది.. ఈ విష‌యం చిత్ర‌బృందం ముందు నుంచీ చెబుతూనే ఉంది. క‌థంతా రెండు ముక్క‌ల్లో చెబితే - సుకుమార్ ఈ క‌థ‌ని న‌మ్ముకుని ఇంత పెద్ద సినిమా తీశాడా? అనే డౌటు వ‌స్తుంది. సుకుమార్ న‌మ్మింది ఈ క‌థ‌ని కాదు. అందులోని ఎమోష‌న్ ని. చిట్టిబాబు అనే పాత్ర‌ని. రెండు ముక్కల్లో తేల్చే క‌థ‌ని దాదాపు మూడు గంట‌ల పాటున‌డ‌ప‌డం అంటే మాట‌లు కాదు. చిట్టిబాబు క్యారెక్ట‌రైజేష‌న్‌, మ‌హాల‌క్ష్మితో ప్రేమాట‌, అన్న‌య్య‌పై మ‌మ‌కారం, ఎన్నిక‌ల గొడ‌వ‌, రాజ‌కీయాలు. చివ‌ర్లో ఓ ట్విస్టు.. ఇలా ర‌క‌ర‌కాల మ‌లుపుల‌తో `ఇందులో పెద్ద క‌థేం లేదు` అనే విష‌యం ప్రేక్ష‌కుడికి తెలియ‌కుండా జిమ్మిక్కు చేశాడు.  

రామ్ చ‌ర‌ణ్ లాంటి హీరోని ఎదురుగా పెట్టుకుని చిట్టిబాబు అనే పాత్ర రాసుకోవడం సుకుమార్‌లోని తెగువ‌కు నిద‌ర్శ‌నం. దాన్ని అంతే గొప్ప‌గా డీల్ చేశాడు. సుక్కు రాసుకున్న పాత్ర‌ని నూటికి నూరుపాళ్లూ తెర‌పై దించేశాడు రామ్‌చ‌ర‌ణ్‌. దానికి చుట్టుప‌క్క‌ల పాత్ర‌ల‌న్నీ క‌లిసి వ‌చ్చాయి. అంతెందుకు.. వ్యాంప్ అనుకునే అత్త అన‌సూయ పాత్ర‌ని కూడా హృద‌యానికి హ‌త్తుకునేలా తీర్చిదిద్దాడు సుకుమార్‌. ఇలా పాత్ర‌ల‌పై పెంచుకున్న ప్రేమే... ఈ సినిమాని నిల‌బెట్టింది. తొలి స‌గం.. చిట్టిబాబు హంగామాతో సాగిపోతుంది. ద్వితీయార్థం ఎమోష‌న‌ల్ డ్రైవ్‌. అక్క‌డ ఊరి రాజ‌కీయాలు ఏ స్థాయిలో ఉంటాయో చూపించాడు. సెంటిమెంట్ డోసు కొంచెం ఎక్కువ అనిపించినా... ఇలాంటి క‌థ‌ల‌కు అది త‌ప్ప‌దు. చివ‌ర్లో ట్విస్టు మాత్రం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. 

ఇక్క‌డే సుకుమార్ బ‌య‌ట‌కు వ‌స్తాడు. ఈ క‌థ‌ని మామూలుగానూ న‌డిపించొచ్చు. కానీ సుకుమార్ మార్క్ క‌నిపించ‌దు. అందుకే.. త‌న‌ని తాను సంతృప్తిప‌ర‌చుకుంటూ.. క‌థ‌లో ఎక్క‌డో చోట కొత్త‌ద‌నం చూపించాల‌న్న త‌ప‌న‌తో ఈ క‌థ‌ని ఇలా ముగించాడ‌నిపిస్తుంది.

* సాంకేతిక వ‌ర్గం..

న‌టీన‌టుల్లో చ‌ర‌ణ్ ఎలానో.. సాంకేతిక నిపుణుల్లో సుకుమార్ అలా. ఓ సాధార‌ణ‌మైన క‌థ‌ని అసాధార‌ణంగా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. 1980 నాటి వాతావ‌ర‌ణాన్ని తెర‌పైకి తీసుకురావ‌డంలో క‌ళా ద‌ర్శ‌కుడి పాత్ర కీల‌కం. కెమెరామెన్ తో క‌ల‌సి రంగ‌స్థ‌లం అనే ప‌ల్లెకి ప్రాణం పోశారు. పాట‌ల‌న్నీ బాగున్నాయి.చిత్రీక‌రించిన విధానం ఇంకా బాగుంది. సుకుమార్ అంటే లెక్క‌లు, సైన్స్‌సూత్రాలు అనుకునేవారికి.. సుకుమార్ అంటే ఎమోష‌న్ కూడా అని చెప్పే సినిమా అవుతుంది.

* ప్ల‌స్ పాయింట్స్‌

+ చ‌ర‌ణ్ న‌ట‌న‌
+ సాంకేతిక నిపుణుల ప‌నితీరు
+ క్లైమాక్స్‌

* మైన‌స్ పాయింట్

- హెవీ ఎమోష‌న్స్‌

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  ఇది చ‌ర‌ణ్ వ‌న్ మేన్ షో 

రివ్యూ రాసింది శ్రీ


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS