తారాగణం: బెల్లంకొండ శ్రీనివాస్, పూజ హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రానా తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ అభిషేక్ పిక్చర్స్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
ఛాయాగ్రహణం: ఆర్థర్ A విల్సన్
నిర్మాత: అభిషేక్ నామ
రచన-దర్శకత్వం: శ్రీవాస్
రేటింగ్: 2.75/5
రొటీన్ కథనే అయినా... కమర్షియల్‌గా చెప్పడం ఈతరం దర్శకుల అలవాటు. ఆ కథని ఎంత కొత్తగా, ఎంత అర్థమయ్యేలా చెప్పారు అనే దానిపైనే ఓ సినిమా జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. దర్శకుడిగా శ్రీవాస్ ఎప్పుడూ కమర్షియల్ కథలనే ఎంచుకున్నాడు. అక్కడే విజయం సాధించాడు. ఈసారి `పంచభూతాలు` అంటూ ఓ కొత్త కాన్సెప్ట్ తో వచ్చాడు. మరి ఇందులో కథ ఎలా ఉంది? ఈ కథని కమర్షియల్‌గా ఏ స్థాయిలో చెప్పాడు..??
* కథ..
ఓ హీరో. అతని కుటుంబం చిన్నప్పుడే సర్వనాశనం అవుతుంది. దానికి నలుగురు అన్నదమ్ములే కారణం. ఈ విషయం ఆ హీరోకి తెలీదు. పెరిగి పెద్దవాడై.. తనకు తెలియకుండానే ఆ నలుగురిపైనా ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇదీ.. సాక్ష్యం కథ. దీన్ని ఇలానే చెబితే `సాక్ష్యం` నిలవకపోదును. అసలు ఈ సినిమాని సినిమాగానే లెక్కలోనికి తీసుకోపోదురు. దానికి పంచభూతాలు అనే కాన్సెప్ట్ జోడించాడు దర్శకుడు. కథానాయకుడి ప్రతీకారానికి పంచభూతాలు ఎలా సాయం చేశాయి...?? అనేదే ఈ రొటీన్ కథలో కనిపించే కొత్తదనం. అదెలాగో తెలియాలంటే... సినిమా చూడాల్సిందే.
* నటీనటులు పనితీరు..
బెల్లంకొండ మరోసారి తన శక్తికి మించిన పాత్రని నెత్తిమీద వేసుకున్నాడు. దానికి తగ్గట్టుగానే కష్టపడ్డాడు. డాన్సుల్లో తన పాత మెరుపులు లేకపోవడం లోటు. యాక్షన్‌లో మాత్రం రాణించాడు.
పూజా మరీ పీలగా కనిపించింది. ఓ కథానాయిక చేత ప్రవచనాలు చెప్పించడం ఇదే తొలిసారి. అయితే ఆ నేపథ్యం ఈ పాత్రకు అవసరం లేదు.
జగపతిబాబు విలనిజాన్ని కాస్త కొత్తగా పలికించడానికి వేమన పద్యాలు చెప్పించారు. అది బాగానే వర్కవుట్ అయ్యింది. సినిమాలో చాలా పాత్రలున్నాయి. అయితే కొన్ని మాత్రమే రిజిస్టర్ అవుతాయి. కొన్ని పాత్రల్ని సరిగా వాడుకోలేదు.
* విశ్లేషణ
పంచభూతాలు అనే పాయింట్ పక్కన పెడితే.. మిగిలినదంతా సేమ్ ఓల్డ్ ఫార్ములా అనేది మనకు అర్థమైపోతోంది. అయితే.. దానికి గాలి, నీరు, నిప్పు, నింగి, నేల.... ఇవన్నీ జోడిస్తూ ఈ కథని ముందుకు తీసుకెళ్లిన విధానం మాత్రం తప్పకుండా ఆకట్టుకుంటుంది. తొలి పది నిమిషాల సినిమా చాలా గ్రిప్పింగ్‌గా తీశాడు దర్శకుడు.
విలన్ల క్రూరత్వం, ఈ కుటుంబానికి ఓ గోవు చేసిన సాయం.. ఇవన్నీ.. ఆకట్టుకుంటాయి. మునివేళ్లపై నిలబెడతాయి. ఓపెనింగే అదిరిపోతే.. సినిమా ఇంకెలా ఉంటుందో అనుకుంటారు. అయితే ఆ తరవాత వచ్చే సన్నివేశాలు మాత్రం ఆ స్థాయిలో సాగవు. కథానాయకుడి జీవితం, అతని కుటుంబం, ప్రేమ కథ.. ఇవన్నీ సాదా సీదాగా తీర్చిదిద్దాడు. తన ప్రేమ కోసం కథానాయకుడు ఇండియా వస్తాడు. అక్కడి నుంచి కథ మళ్లీ ఊపందుకుంటుంది.
విలన్ గ్యాంగ్‌లో ఒకడ్ని `గాలి` సాక్షిగా అంతం చేయడం ఇంట్రవెల్ బ్యాంగ్. ఆ సన్నివేశాన్ని రోమాలు నిక్కబొడిచేలా తీర్చిదిద్దాడు. మళ్లీ అక్కడి నుంచి కథని మళ్లీ సాదాసీదాగానే నడిపాడు. పంచభూతాలు అనే కాన్సెప్ట్ వచ్చేంత వరకూ.. ఈ సినిమా ఓ రెగ్యులర్ సినిమాగానే కనిపిస్తుంది. కేవలం ఆ పాయింట్, దాని చుట్టూ నడిచే యాక్షన్ హంగామానే ఈ సినిమాకు ప్రాణం. అదే ఈ కథకు కొత్త కలరింగు ఇచ్చింది. వాటికి సంబంధించిన లింకులన్నీ లాజిక్కులు కోల్పోకుండా వేసుకోగలిగాడు దర్శకుడు. యాక్షన్ దృశ్యాల్ని మాస్‌కి నచ్చేలా తీర్చిదిద్దాడు. అయితే పాటలు అక్కడక్కడ కథ టెంపోని చెడగొట్టాయి. హాయిగా నవ్వుకునే సన్నివేశాలు లేకపోవడం మరో ప్రధాన లోపం.
* సాంకేతిక వర్గం
సినిమా చాలా రిచ్‌గా ఉంది. కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. పాటలు ఓ మాదిరిగా అనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. దర్శకుడు ఎంచుకున్నది ఓ పాత పాయింట్. పంచభూతాలు అనే కాన్సెప్ట్ వల్ల కొత్త కలరింగు వచ్చింది.దాన్ని మాస్‌కి నచ్చేలా తీర్చిదిద్దగలిగాడు. బుర్రా సాయిమాధవ్ కలం సీరియెస్ సన్నివేశాల్లో బాగా పలికింది.
* ప్లస్ పాయింట్స్
+ నేపథ్యం
+ నిర్మాణ విలువలు
+ యాక్షన్ సన్నివేశాలు
* మైనస్ పాయింట్స్
- పాటలు
- నిడివి
* ఫైనల్ వర్డిక్ట్: కమర్షియల్ సినిమాకి పంచభూతాల కోటింగు.
రివ్యూ రాసింది శ్రీ