చిత్రం: సామజవరగమన
నటీనటులు: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్
దర్శకత్వం: రామ్ అబ్బరాజు
నిర్మాత: రాజేష్ దండా
సంగీతం: గోపీ సుందర్
ఛాయాగ్రహణం: రాంరెడ్డి
కూర్పు: ఛోటా కె ప్రసాద్
బ్యానర్స్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్
విడుదల తేదీ: 29 జూన్ 2023
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 3/5
శ్రీవిష్ణు మంచి నటుడు. కథల ఎంపికపై తనకి మంచి అభిరుచి కూడా వుంది. వినోదాత్మక చిత్రాలు తనకి కలిసొస్తాయి. ఐతే వాటినే చేస్తూ కోర్చులేదు. మధ్యలో చాలా జోనర్స్ మార్చాడు. తనని తాను కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కొన్ని వైఫల్యాలు వచ్చాయి. ఐతే ఇప్పుడు మరోసారి తన కంఫర్ట్ జోనర్ లో చేసిన సినిమా ‘సామజవరగమన’. మరి ఈ సినిమా శ్రీవిష్ణుకి కలిసొచ్చిందా ? అల్లూరితో ఫ్లాఫ్ అందుకున్న శ్రీవిష్ణుకి సామజవరగమన ఊరటనిచ్చిందా ?
కథ: బాలు (శ్రీవిష్ణు) ఓ మల్టీప్లెక్స్ బాక్సాఫీసు లో ఉద్యోగి. పక్కా మిడిల్ క్లాస్ మ్యాన్. కుటుంబం నడిపే బాధ్యత కూడా తనదే. ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెడతాడు. బాలుకి విచిత్రమైన ఆశయం వుంటుంది. ఏ తండ్రైన కొడుకు పాసవ్వాలని హైరాన పడతాడు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. తండ్రి ఉమా మహేశ్వరరావు (నరేష్) తో డిగ్రీ పాస్ చేయించాలన్నది బాలు ఆశయం. ఎందుకంటే.. తండ్రికి డిగ్రీ లేనిదే తాత ఆస్తిరాదు రావు. ఎలాగైనా పరీక్ష పాస్ చేయించాలని సరయు (రెబా మౌనికా జాన్)ని సాయం కోరుతాడు. పాస్ అవ్వడం మాట పక్కన పెడితే సరయూ ఇంటికి వచ్చిన తర్వాత బాలుకి మరింత భారం పెరుగుతుంది. అదే సమయంలో సరయూకి బాలు అంటే అభిమానం, ప్రేమ ఏర్పడతాయి. మరి ప్రేమ అంటే అమ్మాయిలతో రాఖీ కట్టించుకునే బాలు ప్రేమలో పడ్డాడా? బాలు తండ్రి డిగ్రీ పాస్ అయ్యాడా ? సరయూ రాకతో బాలు జీవితం ఎలాంటి మలుపు తిరిగింది ? అనేది తక్కిన కథ.
విశ్లేషణ: నవ్వించే నేర్పు వుండాలి కానీ ఒక చిన్న పాయింట్ తో ఆద్యంతం నవ్వులు పంచవచ్చు. సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు అదే మ్యాజిక్ చేశాడు. చిన్న పాయింట్ తో కావలసినంత వినోదం పిండేశాడు. కథగా చెప్పుకుంటే లైటర్ వెయిన్ పాయింట్ ఇది. ఐతే పాత్రల్ని, సన్నివేశాలని కొత్తగా మలచుకొని కావాల్సినంత వినోదం పంచాడు. సున్నితమైన హాస్యం తెరపై చూసి చాలా కాలమైయింది. ఆ లోటుని సామజవరగమన తీర్చింది. నవ్వించడానికి విశ్వప్రయత్నాలేమీ చేయలేదు దర్శకుడు. చాలా సింపుల్ పాయింట్ అంతే సింపుల్ గా చెప్పాడు.
బేసిగ్గా ప్రతి సినిమాలో కొడుకు సరిగా చదవట్లేదంటూ తలపట్టుకునే తండ్రులు వుంటారు. కానీ ఇక్కడ వెరైటీగా కొడుకే తండ్రిని చదువుకోమంటూ వెంటపడుతుంటాడు. తండ్రిని డిగ్రీ పాస్ చేయించేందుకు రకరకాల తిప్పలు పడుతుంటాడు. ఇవన్నీ చాలా సహజంగా తెరపైకి వచ్చాయి. నిజానికి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఇదే పాయింట్ మీద దాదాపుగా సాగుతున్న ఎక్కడా బోర్ కొట్టదు. అంత హిలేరియస్ గా మలిచాడు దర్శకుడు. మరో వైపు తనకు ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయిలతో బాలు రాఖీ కట్టించుకునే ట్రాక్, ప్రేమపై బాలుకి వుండే అభిప్రాయాలు కూడా సరదాగా సాగిపోతాయి. విరామంకి ముందు వచ్చే చిన్న మలుపు కూడా ఆసక్తిగా వుంటుంది.
సెకండ్ హాఫ్ కూడా ఫన్ నోట్ లోనే మొదలౌతుంది. అతి ప్రేమ, అభిమానం కామెడీ నవ్విస్తుంది. ఐతే తొలిసగంతో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ లో నవ్వుల జోరు తగ్గింది. ఈ కథలో కొన్ని డల్ మూమెంట్స్ కూడా వున్నాయి. కొన్ని చోట్ల కథ గమనం నెమ్మదించింది. ఇలా నెమ్మదించిన తరుణంలో కుల శేఖర్ గా వెన్నెల కిషోర్ పంచిన హాస్యం మళ్ళీ నవ్వుల నావని దారిలో తెస్తుంది. ముగింపు మనకి ముందే ఊహకు అందిపోయినప్పటికీ సన్నివేశాల అల్లికతో సరదాగా గడిచేలా చేయడంలో విజయం సాధించాడు దర్శకుడు.
నటీనటులు: బాలు పాత్రలో శ్రీవిష్ణు సహజంగా కుదిరిపోయాడు. తెరపై బాలునే కనిపిస్తాడు తప్పితే శ్రీవిష్ణు కాదు. మాలులు డైలాగ్ కూడా తన టైమింగ్ తో చాలా కొత్తగా వినిపిస్తుంది. సినిమా అంతా హుషారుగా కనిపించాడు. నరేష్ పాత్రకి ఫుల్ మార్కులు పడిపోతాయి. యూత్ అంతా బాగా కనెక్ట్ అయ్యే పాత్ర అది. ఆయన అనుభవంతో గుర్తుండిపోయేలా చేశారు. సరయు పాత్రలో రెబ్బా మోనికా అందంగా వుంది. తన అభినయం కూడా బావుంది. కులశేఖర్ పాత్రలో వెన్నెల కిశోర్ నవ్వులు పంచాడు. శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్, వెన్నెల కిషోర్, రఘుబాబు.. ఇలా ప్రతి పాత్ర ఫన్ పండించింది.
టెక్నికల్: సాంకేతిక సినిమా డీసెంట్ గా వుంది. గోపిసుందర్ నేపధ్య సంగీతం బావుంది కానీ గుర్తుపెట్టుకునే పాటలైతే ఇవ్వలేదు. కెమరాపనితనం నీట్ గా వుంది. నందు రాసిన డైలాగ్స్ కొన్ని ఆకట్టుకున్నాయి. దర్శకుడు రామ్ అబ్బరాజు కి ఫుల్ మార్కులు పడిపోతాయి. తన గత సినిమా వివాహ భోజనంబు లో కూడా చిన్న పాయింట్ పట్టుకున్నాడు. ఇప్పుడు మరింత పరిణితి గల పనితీరు కనబరిచాడు. చాలా క్లీన్ ఎంటర్ టైనర్ ని అందించాడు. కేవలం నవ్వించడానికే ఈ సినిమా చేశామని యూనిట్ చెప్పింది. ఆ విషయంలో టీం సక్సెస్ అయ్యింది.
ప్లస్ పాయింట్స్ :
కథ, కథనం
శ్రీవిష్ణు, నరేష్
ఫ్యామిలీ ఫన్
మైనస్ పాయింట్స్ :
పాటలు
సెకండ్ హాఫ్ లో కొన్ని డల్ సీన్స్
ఫైనల్ వర్డిక్ట్ : సామజవరగమన..హిట్టు బొమ్మ...