సమ్మోహనం మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

తారాగణం: సుధీర్ బాబు, అదితి రావు హైదరి, నరేష్, పవిత్ర లోకేష్ తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీదేవి మూవీస్
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: PG విందా
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి

రేటింగ్: 3.25/5

మంచి అభిరుచి గల చిత్రాలకి, ఎటువంటి ద్వంద్వార్ధ పద ప్రయోగాలు లేని ఓ చక్కటి చిక్కటి తెలుగు సినిమా కి చిరునామా అయిన మోహనకృష్ణ ఇంద్రగంటి కలం నుండి వచ్చిన మరో చిత్రం సమ్మోహనం. అమీతుమీ వంటి ఒక మంచి విజయం తరువాత వస్తున్న చిత్రం అవ్వడంతో సహజంగానే ఈ సినిమా పైన అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. హీరో సుధీర్ బాబు హీరోయిన్ అదితిరావు ల జంట కూడా చూడముచ్చటగా ఉంది. మరి ఈ చిత్రం తన టైటిల్ కి తగ్గట్టుగానే ప్రేక్షకులని ‘ ‘సమ్మోహితులని’ చేస్తుందా లేదా అనేది ఈ క్రింద సమీక్షలో చూద్దాం...

కథ:

విజయ్ (సుధీర్ బాబు) ఒక మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకోవాలని తపనపడుతుంటాడు. తనకి ఉన్న టాలెంట్ తో ఎవరి సహాయం తీసుకోకుండా తన సొంత కాళ్ళ పైన నిలబడాలనుకునే వ్యక్తిత్వం ఉన్న కుర్రాడు. అయితే ఇతనికి సినిమాలన్నా, చిత్ర పరిశ్రమలో ఉండేవారన్నా పెద్దగా ఇష్టం ఉండదు. అలాంటిది అనుకోకుండా ఒక సినిమా షూటింగ్ విజయ్ ఇంట్లోనే జరుగుతుంది, ఆ షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చిన సమీరా (అదితి రావు హైదరి)తో పరిచయం అవుతుంది.

తను ముంబై నుండి రావడం వల్ల తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటే ఆమె కోరిక మేరకు విజయ్ ఆమెకి తెలుగు మాట్లాడడం నేర్పిస్తాడు. ఈ సమయంలో ఇద్దరు ఒకరితో ఒకరు బాగా కలిసిపోతారు. ఈ తరుణంలో సమీరా పైన ఇష్టం పెంచుకుంటాడు, ఆ విషయమే సమీరా కి చెప్పగా ఆమె విజయ్ చెప్పినదాన్ని సున్నితంగా తిరస్కరిస్తుంది.

విజయ్ ప్రేమని ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటి? అసలు విజయ్ ని సమీరా ఇష్టపడిందా? లేదా? అనే ప్రశ్నలకి సమాధానాలు ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. 

నటీనటుల పనితీరు:

సుధీర్ బాబు: సున్నిత మనస్కుడిగా, ఒక ప్రేమికుడిగా ఇలా పలురకాల అభినయం పండించే ఆస్కారం ఉన్న పాత్ర దొరికింది. దీనిని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు సుధీర్. ఇతని నటన సినిమా సినిమాకి పరిణితి చెందడం మనకి కనిపిస్తున్నది.

అదితి రావు హైదరి: సమీరా పాత్రకి అచ్చంగా సరిపోవడమే కాకుండా ఆ పాత్రకి తనే గొంతుక ఇచ్చుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకట్టుకోగలిగింది. ఇక ముంబై హీరోయిన్ గా తెలుగు రాక పడే ఇబ్బందులని ఆమెకి స్వతహాగా అనుభవం ఉండడంతో ఆ సన్నివేశాల్లో చాలా అలవోకగా నటించేసింది. ఈ సినిమాకి కచ్చితంగా అదితి ఒక బలం అనే చెప్పాలి.

నరేష్: ఆడియో విడుదల సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనై మాట్లాడినదంతా నిజమే. ఒక సినిమా నటుడుడిగా ఎప్పటికైనా వెండితెర పైన కనిపించాలని అలాగే ఒక మంచి అభిరుచి గల సినీ ప్రేమికుడిగా ఆయన నటన వహ్వా అనిపిస్తుంది. సినిమా మొత్తంలో హాస్యానికి ఆయన కేర్ అఫ్ అడ్రస్ గా నిలుస్తూ సినిమాని ముందుకి నడిపాడు. ఈ సినిమా కచ్చితంగా ఆయనకి మంచి పేరు తెస్తుంది.

పవిత్ర లోకేష్: హీరోకి తల్లిగానే కాకుండా ఒక మంచి గైడ్ గా ఉండే పాత్రలో మెరిసింది అనే చెప్పాలి. మంచి హావభావాలు అలాగే ఈతరం అమ్మగా అందరిని ఆకట్టుకుంటుంది.

రాహుల్ రామకృష్ణ, అభయ్, తనికెళ్ళ భరణి, కాదంబరి కిరణ్, హర్షిణి, హరితేజ తమ తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు.

విశ్లేషణ:

ప్రేక్షకుడిని మెప్పించడానికి గొప్ప కథనే ఉండక్కర్లేదు మంచి కథనం ఉన్నా చాలు అనే మాటకి ఈ చిత్రం కచ్చితమైన ఉదాహరణ అని చెప్పొచ్చు. సాధారణ కుటుంబంలో జరిగే సరదా విషయాలు, కొడుకు అభిరుచిని ప్రోత్సహించే తల్లిదండ్రులు ఇలాంటి వాటికి చక్కటి సంబాషణలు జోడించి చాలా అందంగా చూపించాడు దర్శకుడు.

ఈ సినిమా విజయానికి పూర్తి కర్త, కర్మ, క్రియ అన్ని మోహనకృష్ణ అనే చెప్పాలి. కారణం ఆయన రాసుకున్న కథకి, పాత్రలకి న్యాయం చేయడానికి సరైనవారిని తీసుకోవడంలోనే ఆయన మొదటి విజయం సాధించాడు. రెండవ విజయంగా ఆయన రాసుకున్న సన్నివేశాలు కాగా చివరగా ఆయన ఎంపిక చేసుకున్న కళాకారులతో చక్కగా అభినయింప చేయడంతో పూర్తి విజయం సాధించగలిగాడు, ప్రేమలో వచ్చే రిజేక్షన్ అనే కామన్ పాయింట్ చుట్టూ చక్కటి కథ అల్లడం దానికి తగ్గట్టుగా సంభాషణలు రాయడంతో ఈ సినిమా మూలకథ పైన ఎవరి దృష్టి మరలదు. ఒక మంచి సినిమా చూస్తున్నాము అన్న అనుభూతి మాత్రం మిగులుతుంది. 

ఇక సినిమాలో వచ్చే సంభాషణలు బాగా పేలాయి. ముఖ్యంగా కొన్ని సినిమా వెబ్ సైట్లు, అవి రాసే వార్తలు, రివ్యూల పైన అలాగే “అమ్మాయి రిజేక్షన్ ని హ్యాండిల్ చేసేవాడే అసలైన మగాడు” వంటి డైలాగ్స్ కి ధియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక మంచి రచయిత-దర్శకుడు అనే ట్యాగ్ ని ఈ చిత్రంతో మరింతగా సుస్థిరం చేసుకోగలిగారు మోహనకృష్ణ.

సాంకేతిక వర్గం పనితీరు: 

PG విందా ఇచ్చిన విజువల్స్ అద్బుతంగా ఉన్నాయి అలాగే వివేక్ సాగర్ అందించిన సంగీతం చాలా హృద్యంగా ఉంది. రవీందర్ ప్రొడక్షన్ డిజైన్ అదరహో అనిపిస్తుంది, ముఖ్యంగా హీరో ఇల్లు చాలా చాలా బాగుంది.

బలాలు:

+ నటీనటులు
+ ఛాయాగ్రహణం
+ సంభాషణలు
+ కథనం

బలహీనతలు:

- మామూలు కథ

ఆఖరి మాట: సమ్మోహనం కాకపోవచ్చు కాని ఒక “మంచి సంతృప్తికర చిత్రం”...

రివ్యూ రాసింది సందీప్

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS