నటీనటులు : మహేష్ బాబు, రష్మిక మందన్న, విజయశాంతి, ప్రకాష్ రాజ్ తదితరులు
దర్శకత్వం : అనిల్ రావిపూడి
నిర్మాతలు : అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫర్ : రత్నవేలు
ఎడిటర్: తమ్మి రాజు
రేటింగ్: 2.75/5
ఏ దర్శకుడికీ ప్రయోగాలు చేసే ధైర్యం సరిపోవడం లేదు. అదీనూ పెద్ద హీరోతో సినిమా అనేసరికి. మాస్ ఫార్ములాలూ, మూస ధోరణుల్లోనే వెళ్లిపోతున్నారు. ఇదేం వాళ్ల తప్పు కాదు. పెద్ద హీరో సినిమా అనేసరికి చాలా అంచనాలు ఉంటాయి. పైగా కోట్ల పెట్టుబడి, ప్రయోగాల పేరుతో వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. పాత దారిలోనే వెళ్లినా సరే - కమర్షియల్‌గా వర్కవుట్ అయిపోతే చాలు అనుకుంటున్నారు. అలాంటిదే మొన్నొచ్చిన `దర్బార్`.. ఇప్పుడు `సరిలేరు నీకెవ్వరు` కూడా అలాంటి ఫక్తు కమర్షియల్ సినిమానే.
*కథ
భారతి (విజయశాంతి) ఓ ప్రొఫెసర్. తప్పుని తప్పు అని ధైర్యంగా చెబుతుంటుంది. అదే ఆమె కుటుంబాన్ని పెద్ద సమస్యలో పడేస్తుంది. భారతి చిన్న కొడుకు (సత్యదేవ్) ఓ సైనికుడు. తను ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. ఈ విషయాన్ని స్వయంగా చెప్పడానికి కర్నూలు వస్తాడు మేజర్ అజయ్ (మహేష్‌బాబు). ఇక్కడ భారతి కుటుంబానికి అండగా నిలబడతాడు. చిన్న కొడుకు లేని లోటు తీరుస్తూ భారతి కూతురి పెళ్లి చేస్తాడు. మంత్రి (ప్రకాష్‌రాజ్) అక్రమాలను బయటపెడతాడు. ఈ క్రమంలో అజయ్‌కి ఎదురైన సమస్యలేంటి? వాటితో ఎలాంటి పోరాటం చేశాడు? అనేదే మిగిలిన కథ.
*విశ్లేషణ
ప్రతీ హీరోకీ అభిమానగణం నిండుగా ఉంటుంది. అందులోనూ మహేష్‌బాబు లాంటి స్టార్ హీరో గురించైతే చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫ్యాన్స్ ని దృష్టిలో ఉంచుకుని అనిల్ రావిపూడి అల్లిన కథ ఇది. మహేష్ నుంచి ఫ్యాన్స్ ఏమేమి కోరుకుంటారో, అవన్నీ పక్కగా అందించేసేందుకు ఈ కథని ఓ వేదిక చేసుకున్నాడు. ఆర్మీ ఎపిసోడ్ అనేది లేకపోతే- చాలా మామూలు, రొడ్డకొట్టుడు కథ ఇది. దర్శకుడిగా అనిల్ రావిపూడి ఫామ్‌లో ఉన్నాడు, తనకు కామెడీ సెన్స్ ఉంది. సినిమా వేగంగా తీయగలడు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మహేష్ ఛాన్సిచ్చి ఉంటాడు. వాటిని దాదాపుగా నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు అనిల్.
కర్నూలులో విజయశాంతి ఎపిసోడ్‌తో ఈ కథ మొదలవుతుంది. ఆ వెంటనే మిటలరీ నేపథ్యానికి మారుతుంది. అక్కడ మహేష్‌ని పరిచయం చేసిన విధానం, మిటలరీ ఆపరేషన్స్... తన అభిమానులకు బాగా నచ్చుతాయి. ట్రైన్ ఎపిసోడ్ కోసం చాలా సమయం కేటాయించారు. ఈ ఎపిసోడ్ గురించి చాలా చాలా చెబుతూ వచ్చారు. అయితే ట్రైను ఎపిసోడ్ పూర్తిగా పట్టాలు తప్పేసింది. క్లిక్ అవ్వాల్సిన కామెడీ అవ్వలేదు. పైగా నసగా తయారైంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్, నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎక్స్‌ప్రెషన్సూ, చిన్న పిల్లల చేత చెప్పించిన సీరియల్ డైలాగులూ నస పెట్టించేశాయి. కొండారెడ్డి బురుజు సాక్షిగా మహేష్‌లోని హీరోయిజం చూపించడం, అజయ్‌కి వార్నింగ్ ఇవ్వడం, అక్కడ కృష్ణ నటించిన `అల్లూరి సీతారామరాజు` ఎపిసోడ్‌ని వాడుకోవడం ఇవన్నీ ఫ్యాన్స్‌కి నచ్చుతాయి. ఇంట్రవెల్ తరవాత కూడా కథ వేగంగానే ముందుకు సాగుతుంది. అయితే ఆ తరవాత... కథ పూర్తిగా ట్రాక్ తప్పేసింది. అనిల్ రావిపూడి బలం.. వినోదం. అయితే కథలో సీరియస్ నెస్ వుంది. దాన్ని కాస్త కామెడీగా చెప్పాలనుకున్నాడు. దాంతో ఆ సన్నివేశాలు కామెడీకీ, సీరియస్‌నెస్‌కి కాకుండా పోయాయి. నల్లమల్ల నేపథ్యంలో వచ్చిన ఫైట్ మళ్లీ అభిమానుల్లో ఆశల్ని పెంచుతుంది. క్లైమాక్స్ మాత్రం వీక్ అనుకోవాలి. ప్రకాష్ రాజ్ పాత్రని మరీ చాలా పేలవంగా ముగించారు.
*నటీనటులు
మహేష్‌బాబు ఇంత మాస్, కమర్షియల్ సినిమా చేసి చాలా కాలం అయ్యింది. మహర్షి లాంటి సినిమాలలో తన ఎనర్జీని పూర్తి స్థాయిలో చూసే అవకాశం దక్కలేదు. ఈసారి మాత్రం అభిమానులకు విందు భోజనం పెట్టేశాడు మహేష్. మరీ ముఖ్యంగా తన డాన్సులతో ఆశ్చర్యపరిచాడు. రష్మిక పాత్రలో దమ్ము లేదు. ఇలాంటి పాత్ర ఎందుకు చేసిందో ఏమిటో? తమన్నా ప్రత్యేక గీతం కేవలం మాస్ కోసమే. విజయశాంతిని చాలా కాలం తరవాత తెరపై చూశారు ప్రేక్షకులు. ఓ సూపర్ స్టార్ సినిమాలో మరో సూపర్ స్టార్ కనిపించడం సినీ అభిమానులకు నచ్చుతుంది. అయితే ఆమె మాత్రమే చేయాల్సిన పాత్ర అనుకునే స్థాయిలో మాత్రం `భారతి` కనిపించదు. రావు రమేష్ కామెడీ మరీ అతిలా అనిపిస్తుంది. మురళీ శర్మని సరిగా వాడుకోలేదు. ప్రకాష్ రాజ్‌ని ముందు భీకరంగా చూపించి, తరవాత జోకర్ చేసేశారు.
*సాంకేతికత
దేవిశ్రీ ప్రసాద్ పాటల్లో రెండు మూడు బాగున్నాయి. అందులో మహేష్ స్టెప్పులు మరింత బాగున్నాయి. నేపథ్య సంగీతంలో తనకు తిరుగులేదు. శాండీ కెమెరా పనితనం మరింత ప్లస్ పాయింట్. నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. కొండా రెడ్డి బురుజు సెట్ ప్రత్యేక ఆకర్షణ. కథ, కథనాల విషయంలో అనిల్ రావిపూడి తొలిసారి తడబడ్డాడు. అయితే మహేష్ ఫ్యాన్స్‌ని మురిపించే ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నాడు.
*ప్లస్ పాయింట్స్
మహేష్‌బాబు డా
ఇంట్రవెల్ ఎపిసోడ్
సాంకేతిక విలువలు
*మైనస్ పాయింట్స్
కథ, కథనం
రొటీన్ ఫార్ములా
క్లైమాక్స్
*ఫైనల్ వర్డిక్ట్: మేడ్ ఫర్ ఫ్యాన్స్