నటీనటులు : ఆది, సురభి పురాణిక్
దర్శకత్వం : శ్రీనివాస్ నాయుడు నడికట్ల
సినిమాటోగ్రఫీ : అమర్నాధ్ బొమ్మిరెడ్డి
స్క్రీన్ ప్లే : మని కుమార్ చినిమిల్లి
సంగీతం : అరుణ్ చిలువేరు
ఎడిటర్ : సత్య.జి
రేటింగ్: 2/5
ఈమధ్య పాటలు జనాల్ని థియేటర్లకు తీసుకొస్తున్నాయి. ఆల్బమ్ లో ఒక్క హిట్ గీతం ఉంటే చాలు. దాని కోసమైనా.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఆ సినిమా మైలేజీ పెరుగుతోంది. `శశి`లోని `ఒకే ఒక లోకం నువ్వే` పాట కూడా.. ఆ సినిమాపై అంచనాల్ని పెంచింది. ఆదికి చాలాకాలంగా హిట్టు లేకపోయినా, ఈ సినిమాపై ఫోకస్ ఉందంటే... ఆ పాటే. కానీ సినిమా ఆడాలంటే ఒక్క పాట సరిపోదు. బలమైన కథ, ఆసక్తికరమైన కథనం ఉండాలి. అవి `శశి`లో కుదిరాయా? లేదా? ఆది సాయికుమార్ కి హిట్ దక్కిందా, లేదా?
* కథ
రాజ్ (ఆది) బాధ్యతలు లేని కుర్రాడు. ఎప్పుడూ ఉదాశీనంగా ఉంటాడు. ఏదో పోగొట్టుకున్నవాడిలా మాట్లాడతాడు. ఇంటి బాధ్యత అంతా అన్నయ్య (అజయ్)దే. ఇలాంటి పరిస్థితుల్లో.. శశి (సురభి) పరిచయం అవుతుంది. తనని చూడగానే... కొత్త రాజ్ బయటకు వస్తాడు. తనలో మెల్లమెల్లగా మార్పు వస్తుంది. శశికి ఓ సమస్య ఉందని అర్థమై.. దాన్ని పరిష్కరించడానికి పూనుకుంటాడు. ఇంతకీ శశి ఎవరు? రాజ్ గతానికీ శశీకి ఉన్న సంబంధం ఏమిటి? రాజ్ - శశి ఇద్దరూ ప్రేమలో పడ్డారా, లేదా? అనేదే మిగిలిన కథ.
* విశ్లేషణ
ఆదికి హిట్టు కావాలి. అలాంటప్పుడు సరికొత్త ఆలోచనలతో రావాలి. ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే కంటెంట్‌ని ఎంచుకోవాలి. అవి లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఉపయోగం ఉండదు. `శశి`లో అవన్నీ లోపించాయి. ఏమాత్రం ఆసక్తి లేని కథ, పాత చింతకాయ పచ్చడి లాంటి కథనం, రొటీన్ డైలాగులతో.. అనుక్షణం విసిగించాడు దర్శకుడు. ప్రారంభం, కథ సాగిన విధానం, ఎంత రొటీన్ కథలో అయినా ఎక్కడో ఓ చోట ఓ మెరుపైనా ఉంటుంది.
ఇంట్రవెల్ ట్విస్ట్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్...ఇలా ఏదో ఓ చోట.. దర్శకుడు తన పని తనాన్ని చూపించాలి. కానీ.. ఈసినిమాలో అది కూడా కరువైంది. రాజ్ పాత్రని ఎంత ఉదాశీనంగా తీర్చిదిద్దాడో...దాని కంటే ఎక్కువ నీరసంగా.. ఆది చేసుకుంటూ వెళ్లాడు. దాంతో ఆ పాత్రలో ఇంటెన్షన్ లోపించినట్టైంది. హీరో ఎప్పుడూ మందుతాగుతూ, దమ్ము లాగుతూ కనిపిస్తుంటాడు. అతని ఇంట్రడక్షన్ సీన్లకే పావు గంట కేటాయించారు.
రాజ్‌కి బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉందన్న విషయం అర్థం అవుతుంటుంది. కనీసం అక్కడైనా ఓ మెరుపు ఉండాల్సింది. దాన్ని కూడా పరమ రొటీన్ చుట్టేశారు. కథ, కథనం విషయాల్లో దర్శకుడు, రచయిత ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదన్న విషయం అర్థమైంది. దర్శకుడికి నాటకాలపై ప్రేమనో, ఆ రంగంలో పనిచేసిన అనుభవమో ఉండి ఉంటుంది. అందుకే సన్నివేశాలన్నీ నాటక రూపంలో సాగుతుంటాయి. డైలాగులూ అలానే ఉన్నాయి.
ఒకే ఒక లోకం నువ్వే పాట వింటున్నప్పుడు ఈ సినిమాపై ప్రేమ కలుగుతుంది. కానీ ఆ పాట వచ్చేటప్పటికి ఈ సినిమాపై పెంచుకున్న ప్రేమ కాస్త ఎగిరిపోయి ఉంటుంది. అంత సూపర్ హిట్ గీతం కూడా... ప్రేక్షకుడికి ఏమాత్రం సంతృప్తి నివ్వదంటే.. ఆ పాట చిత్రీకరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవొచ్చు.
* నటీనటులు
ఆది కొత్తగా చేసిందేం లేదు. గెటప్ మార్చాడంతే. కొన్ని సీన్లలో బాగానే ఉన్నా, చాలా సీన్లలో.. ఆది ఇంకాస్త బాగా నటించొచ్చు అనే ఫీలింగ్ కలిగించాడు. సురభి అందంగా అటూ ఇటూ నడుచుకుంటూ వెళ్లింది. అంతే తప్ప తాను చేసిందేం లేదు. వెన్నెల కిషోర్ ని సరిగా వాడుకోలేదు. అజయ్, రాజీవ్ కనకాల.. ఓకే అనిపిస్తారు.
* సాంకేతిక వర్గం
పాటల్లో ఒకే ఒక లోకం నువ్వే సూపర్ హిట్ అయ్యింది. మిగిలినవి ఏమాత్రం ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం, కెమెరా పనితనం అంతంత మాత్రమే. దర్శకుడు ఓ రొటీన్ కథని, పరమ చాదస్తంగా తీర్చిదిద్దాడు. సంభాషణల్లో తీతలో నాటకీయత ఎక్కువైంది. దాంతో ఓ డ్రామా చూస్తున్న ఫీలింగ్ ఏదో ప్రేక్షకుడికి కలుగుతుంది. అనవసరమైన పాత్రలు, సన్నివేశాలు చాలా ఉన్నాయి. అవన్నీ చూస్తుంటే, ఎడిటర్ కి సరైన పని కల్పించలేదనిపిస్తోంది.
* ప్లస్ పాయింట్స్
ఒకే ఒక లోకం నువ్వే పాట
* మైనస్ పాయింట్స్
మిగిలినవన్నీ
* ఫైనల్ వర్డిక్ట్: నిశి