నటీనటులు : కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, మురళి శర్మ తదితరులు
దర్శకత్వం : పెగళ్ళపాటి కౌశిక్
నిర్మాతలు : బన్నీ వాసు
సంగీతం : జెక్స్ బేజాయి
సినిమాటోగ్రఫర్ : కార్మ్ చావ్ల
ఎడిటర్: జి సత్య
రేటింగ్: 2.5/5
కొన్ని టైటిళ్లు భలే ఉంటాయి. టైటిల్ చూడగానే సినిమా చూడాలనిపిస్తుంటుంది. దానికి తోడు ట్రైలర్లు కూడా బాగా కట్ చేస్తుంటారు. దాంతో ఆ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతాయి. `చావు కబురు చల్లగా` సినిమా విషయంలోనూ అదే జరిగింది. చాలా నెగిటీవ్ టైటిల్ ఇది. కాకపోతే క్యాచీ టైటిల్. టీజర్లు, ట్రైలర్లూ.. హోరెత్తిపోయాయి. కార్తికేయ సినిమా కావడం, గీతా ఆర్ట్స్ లాంటి సంస్థల అండదండలుండడంతో... మరింత ఆకర్షణ పెరిగింది. మరి.. ఇప్పుడు ఈ కబురు ఎలా వుంది? టైటిల్ లో ఉన్న క్యాచీనెస్ కథలోనూ ఉందా? టీజర్లూ, ట్రైలర్లలో ఉన్న విషయం సినిమాలో కనిపించిందా?
* కథ
బస్తీ బాలరాజు (కార్తికేయ) కి చావులు కొత్త కాదు. ప్రతీ రోజూ.. ఎన్నో శవాల్ని తన వ్యానులో తీసుకెళ్లి... దహన సంస్కారాలు చేయిస్తుంటాడు. ఇలా... చావులు, అక్కడి ఏడుపులూ.. తనకు మామూలైపోతాయి. ఓ చావింట్లో ఏడుస్తున్న మల్లిక (లావణ్య త్రిపాఠి)ని తొలి చూపులోనే ఇష్టపడతాడు. తన భర్త పోయి..దుఖంలో ఉన్న మల్లిక - బాలరాజుని అస్సలు పట్టించుకోదు. కానీ మల్లిక వెంటే తిరుగుతుంటాడు బాలరాజు. మరోవైపు అమ్మ గంగమ్మ (ఆమని) కి మరో పెళ్లి చేయాలనుకుంటాడు. భర్తపోయిన.. ఓ అమ్మాయికి బాలరాజు జీవితం ఇవ్వగలిగాడా? భర్త ఉండగానే.. తన తల్లికి మరో తోడుని తీసుకురాగలిగాడా? అనేదే కథ.
* విశ్లేషణ
కథలో పాయింట్ ఉంది. అందులో ఎలాంటి డౌటూ లేదు. హీరోయిన్ భర్త పోవడం, తను విధవ కావడం, అయినా సరే, పెళ్లి చేసుకుంటానని హీరో ఆమె వెంట తిరగడం, ఇంట్లో అమ్మకి మరో పెళ్లి చేయాలనుకోవడం.. కన్వెన్సింగ్ గా రాసుకుంటే బాగానే ఉంటాయి. కానీ.. ఇవన్నీ సున్నితమైన విషయాలు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. లేదంటే అభాసుపాలైపోతారు. దర్శకుడు ఈ విషయాన్ని మర్చిపోయాడు. సన్నివేశాలన్నీ పైపైన పేర్చుకుంటూ పోయాడు. కామెడీ చేయాలనుకున్నాడు.
భర్త పోయి బాధలో ఉన్న ఆడదాన్ని.. `నేను నిన్ను ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా` అనడం, ఆమె వెంట పదే పదే తిరగడం, ఛీ కొడుతున్నా వెంటాడడం ఏం హీరోయిజం అనిపించుకుంటుంది? ఇంట్లో నాన్న ఉండగానే, తను ఎందుకూ పనికిరాడని, అమ్మకు మరో పెళ్లి చేయాలనుకోవడం.. ఏం నేర్పుతుంది? దాన్ని సైతం కన్వెన్స్ చేయడానికి దర్శకుడు కొన్ని డైలాగులు రాసుకుని ఉండొచ్చు. కానీ ప్రేక్షకులు అవ్వాలి కదా?
భర్త పోయి బాధలో ఉన్న అమ్మాయి ఏడుస్తుంటే... `ఐ లవ్ యూ` చెప్పడం కామెడీ బిట్లుగా ఓకే. దాన్నే సీరియస్ కథ అనుకోమంటే ఎలా? పదే పదే.. అలాంటి సీన్లే చూపిస్తుంటే.. ఏమనుకోవాలి. విశ్రాంతి వరకూ ఈ సినిమాది ఇదే దారి. దానికి తోడు తల్లికి అక్రమ సంబంధం అనే మరో ట్రాక్. అది కూడా జీర్ణించుకోలేని సంగతే. అమ్మకి పెళ్లి చేయాలనుకోవడం కొత్త పాయింట్ కాదు. పోనీలే.. అనుకోవొచ్చు. కానీ నాన్న ఉండగా, మరో పెళ్లి చేయడం ఏమిటి? నాన్న ఎందుకూ పనికి రాడనా?
బస్తీ బాలరాజుని ఇంట్రడ్యూస్ చేసే సీన్ లో దర్శకుడి తెలివితేటలు కనిపించాయి. అయితే ఆ తెలివితేటలు ఆ ఒక్క సీన్ వరకే అని కాసేపటికే అర్థమైపోతుంది. తొలి సగంలో అక్కడక్కడ కొన్ని నవ్వులు పూస్తాయి. అది కూడా.. బస్తీ బాలరాజు క్యారెక్టరైజేషన్ చుట్టూ పుట్టినవే. కానీ... పదే పదే అలాంటగి సన్నివేశాలే. `నువ్వంటే నాకు అసహ్యం` అని చెప్పిన మల్లిక.... అంతలోనే.. బాలరాజు ప్రేమలో పడిపోవడం దర్శకుడి సినిమాటిక్ లిబర్టీ అనుకోవాలి. పతాక సన్నివేశాలు కూడా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సాగుతాయి. దర్శకుడు ఓ కొత్త పాయింట్ ని ఎంచుకున్నా - దాన్ని సమర్థవంతంగా నడిపించలేదు.
* నటీనటులు
బస్తీ బాలరాజుగా కార్తికేయ ఇమిడిపోయాడు. తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. పతాక సన్నివేశాల్లో తనలోని నటుడికి మరింత పని పడింది. లావణ్య త్రిపాఠి సైతం సహజంగానే కనిపించింది. ఆమని తన సీరియారిటీ చూపించింది. మురళీ శర్మకి రొటీన్ పాత్రే దక్కింది. భద్రం కాసేపు నవ్వించాడు.
* సాంకేతిక వర్గం
దర్శకుడు తాను రాసుకున్న పాయింట్ ని కన్వెన్సింగ్ గా చెప్పలేకపోయాడు. సున్నితమైన విషయాల్ని డీల్ చేయడంలో తడబడ్డాడు. స్క్రీన్ ప్లేలో మెరుపుల్లేవు. కథని ఈజీగా ఊహించేయొచ్చు. పాటలు బాగున్నాయి. ఐటెమ్ సాంగ్ లోనూ.. చావు విషయాలే జోడించారు. కథకు తగ్గట్టుగానే. టెక్నికల్ గా సినిమా బాగుంది. అక్కడక్కడ కొన్ని మాటలు నచ్చుతాయి.
* ప్లస్ పాయింట్స్
కథా నేపథ్యం
కార్తికేయ
ఆమని
* మైనస్ పాయింట్స్
సున్నితమైన విషయాల్ని డీల్ చేయలేకపోవడం
కథనం
* ఫైనల్ వర్డిక్ట్: చావు కబురు మెల్లగా