తారాగణం: నాగ చైతన్య, R మాధవన్, నిధి అగర్వాల్, భూమిక చావ్లా, వెన్నెల కిషోర్ తదితరులు
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్
సంగీతం: కీరవాణి
ఛాయాగ్రహణం: యువరాజ్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు: నవీన్, మోహన్ & రవిశంకర్
రచన-దర్శకత్వం: చందూ మొండేటి
రేటింగ్: 2.5/5
శారీరక వైకల్యాల్ని, మానసిక రుగ్మతల్ని కథావస్తువులుగా ఎంచుకొని సినిమాలు చేయడం కొత్తేమి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా ఇతివృత్తాలతో అనేక చిత్రాలు రూపొందాయి. భారతీయ సినిమాలో కూడా ఇలాంటి హ్యూమన్ మెడికల్ కాన్సెప్ట్స్‌తో కొన్ని సినిమాలొచ్చాయి. తెలుగు ప్రేక్షకులకు కూడా ఇవి కొత్తేమి కాదు. తాజాగా సవ్యసాచి సినిమాకు దర్శకుడు చందూ మొండేటి వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ పాయింట్‌ను ఎంచుకున్నాడు.
గర్భస్థ దశలోనే ఇద్దరు కవలల శరీరాలు ఒక్కటికావడం, శిశువు జన్మించిన తర్వాత అతనిలో ఇద్దరు శిశువుల లక్షణాలు కనిపించడాన్ని వానిషింగ్ సిండ్రోమ్‌గా పిలుస్తారు. ఇటీవలకాలంలో తెలుగు చిత్రసీమలో ఈ తరహా మెడికల్, సైకలాజికల్ ప్రాబ్లెమ్స్‌ను ఎంచుకొని సినిమాలు తీయడం ఎక్కువైంది. దాంతో సవ్యసాచి చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. నాగచైతన్య తొలిసారి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌ను సెలెక్ట్ చేసుకోవడం, వరుస విజయాలతో దూసుకుపోతున్న మైత్రీ మూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మించడం అంచనాల్ని పెంచింది. ఈ నేపథ్యంలో విడుదలైన సవ్యసాచి ప్రేక్షకుల్ని ఎంతమేరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కథ..
విక్రమ్ ఆదిత్య (నాగచైతన్య) వానిషింగ్ సిండ్రోమ్ అనే జన్యుపరమైనలోపంతో పుడతాడు. ఈ కారణంగా ఎడమ చేయి అతని నియంత్రణలో వుండదు. ఒక్కోసారి తన ప్రమేయం లేకుండానే బాహ్య చర్యలకు ప్రతిస్పందిస్తుంటుంది. ఇదిలావుండగా విక్రమ్ ఆదిత్య యుక్తవయస్సులో తల్లి మరణిస్తుంది. అక్కయ్య శ్రీదేవి (భూమిక), కోడలు మహాలక్ష్మి అంటే అతనికి పంచప్రాణాలు. వారే ప్రపంచంగా బ్రతుకుతుంటాడు. ఆటపాటలతో సరదాగా సాగిపోతున్న అతని కుటుంబానికి ఒక్కసారిగా పెద్ద ఆపద వస్తుంది. అరుణ్‌రాజ్ (మాధవన్) అనే ఓ సైకోపాత్ వల్ల విక్రమ్ ఆదిత్య కుటుంబానికి కష్టాలు ఎదురవుతాయి. హత్యాయత్నంలో బావ ప్రాణాలు కోల్పోతాడు. అక్కయ్య గాయాలతో ఆసుపత్రి పాలవుతుంది. కోడలు కిడ్నాప్‌కు గురవుతుంది. ఇంతకి అరుణ్‌రాజ్‌కు, విక్రమ్ ఆదిత్య కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటి? కోడలు, అక్కను రక్షించుకోవడానికి విక్రమ్ ఆదిత్య ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? వానిషింగ్ సిండ్రోమ్ వల్ల విక్రమ్ ఆదిత్య ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు? చివరకు తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు? అన్నదే మిగతా చిత్ర కథ...
నటీనటుల పనితీరు...
విక్రమ్ ఆదిత్య పాత్రలో నాగచైతన్య మంచి నటనను కనబరిచాడు. ఎమోషనల్, యాక్షన్ ఘట్టాలలో తనదైన మార్క్ చూపించాడు. అయితే నిస్సారమైన కథ కావడంతో నటనకు మరింతగా స్కోప్‌లేకుండా పోయింది.
ఇక కథానాయిక నిధి అగర్వాల్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. నటనలో కనీస హావభావాల్ని పలికించలేకపోయింది.
మాధవన్ ప్రతినాయకుడి పాత్రలో సరిగ్గా కుదరలేదు. ఆయన పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా బాగాలేదు. చిన్నచిన్న కారణాలతో ప్రతినాయకుడు మనుషుల్ని చంపేంత ద్వేషాన్ని పెంచుకున్నాడని చూపించడం అర్థరహితంగా అనిపిస్తుంది.
వెన్నెల కిషోర్, సత్య, రావు రమేష్, భూమిక తమ పాత్రలపరిధుల మేరకు బాగానే నటించారు.
విశ్లేషణ..
క్లుప్తంగా చెప్పాలంటే ఇదొక మామూలు ప్రతీకార కథాంశం. అక్కను, కోడలిని రక్షించుకోవడానికి ఓ తమ్ముడు చేసే ప్రయత్నం. ఇలాంటి అరిగిపోయిన రొటీన్ కథకు వానిషింగ్ సిండ్రోమ్ అనే ఒక ఎమోషనల్ కోటింగ్ ఇచ్చి కథను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే పేలవమైన కాన్సెప్ట్, కథలో అవసరమైన కాన్‌ఫ్లిక్ట్ లేకపోవడం, అగమ్యగోచరంగా అనిపించే సన్నివేశాలు వెరసి రెండున్నర గంటలు ప్రేక్షకుల సహనానికి పరీక్షగా నిలుస్తుందీ చిత్రం.
సినిమా ప్రథమార్థం మొత్తం నాయకానాయికలు విక్రమ్ ఆదిత్య, చిత్ర (నిధి అగర్వాల్) కాలేజీ ఎపిసోడ్ చుట్టే తిరుగుతుంది. సినిమా ఆరంభంలో మిస్టీరియస్‌గా చూపించిన బస్సు ప్రమాదం కథపై ఆసక్తిపెంచుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో అనే ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఆ క్యూరియాసిటీకి అక్కడే బ్రేక్ వేస్తూ కథ ఒక్కసారిగా కాలేజీ ఎపిసోడ్‌లోకి వెళ్లిపోతుంది. ఇంటర్వెల్ వరకు అదే ప్రహసనం కొనసాగుతుంది. ఫస్ట్‌హాప్ అయిపోయేసరికి అసలు కథలోకి ఇంకా వెళ్లలేదనే విషయం అర్థమవుతుంది.
ఇక ద్వితీయార్థంలోనే అసలు కథ ఆరంభమవుతుంది. కిడ్నాప్ అయిన తన కోడలి ఆచూకీ తెలుసుకోవడానికి విక్రమ్ ఆదిత్య చేసే ప్రయత్నాలతో కథాగమంలో కొంచెం స్పీడ్ పెరుగుతుంది. అయితే ఈ క్రమంలో చూపించే సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ అసంబద్ధంగా అనిపిస్తాయి. ఒక్కదానిలో లాజిక్ కనిపించదు. తనతో పెళ్లికి నిరాకరించిందనే కారణంతో అరుణ్‌రాజ్..విక్రమ్ ఆదిత్య అక్కయ్య శ్రీదేవిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం సిల్లీగా అనిపిస్తుంది. మాధవన్ స్థాయి నటుడు ఏమాత్రం ప్రాధాన్యంలేని ప్రతినాయక పాత్రకు ఎలా ఒప్పుకున్నాడనే సందేహం వస్తుంది.
ఈ రివేంజ్ కథలో వానిషింగ్ సిండ్రోమ్ అనే కాన్సెప్ట్ ఏ మాత్రం అతకలేదు. ఎడమ చేయి బలంగా పనిచేస్తుంది కాబట్టి యాక్షన్ ఘట్టాలలో మాత్రమే ఆ సిండ్రోమ్ తాలూకు లక్షణాన్ని వాడుకున్నారు. కథానాయకుడిలో మరొకడు ఉంటాడు..వాడి బలం అంతా ఎడమ చేయి ద్వారా వ్యక్తమవుతుందని పదేపదే చెప్పడం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది.
అమెరికాలో వెన్నెలకిషోర్, షకలక శంకర్ మధ్య వచ్చే సన్నివేశాలు కాస్తా నవ్వించాయి. సెకండాఫ్‌లో సుభద్రపరిణయం ఎపిసోడ్‌లో వెకిలి హాస్యాన్ని పండించారు. ద్వంద్వార్థ సంభాషణలతో ఆ ఎపిసోడ్ చిరాకును తెప్పిస్తుంది. అల్లరి అల్లుడు చిత్రంలోని నిన్ను రోడ్డుమీద చూసినాది లగ్గాయితు..అనే పాటను రీమేక్ చేసి మాతృక విలువ పోగొట్టారనిపిస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ పేలవంగా అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం పనితీరు:
కీరవాణి సంగీతం ఏమాత్రం ఆకట్టుకోలేదు. అయితే కొన్ని సన్నివేశాలలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంప్రెసివ్‌గా అనిపించింది. దర్శకుడు చందూ మొండేటి ప్రతి విభాగంలో విఫలమయ్యారని చెప్పొచ్చు. ఆయన కథా రచన మొదలుకొని, టేకింగ్, సంభాషణలు..ఏ ఒక్కటి సరిగ్గా కుదరలేదు. ప్రతిభావంతుడైన ఆయన నుంచి ఇలాంటి సినిమాను ఆశించలేము. ఛాయాగ్రహణం బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ను కలర్‌ఫుల్‌గా ఆవిష్కరించింది. మైత్రీమూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్:
+ వానిషింగ్ సిండ్రోమ్ కాన్సెప్ట్
మైనస్ పాయింట్స్:
- దర్శకత్వం
- పాటలు
-ప్రధమార్ధం
తీర్పు...
వానిషింగ్ సిండ్రోమ్ అంటూ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌లా అనిపించినా కథ, కథనాల్ని తీర్చిదిద్దిన విధానం, సన్నివేశాల రూపకల్పన సర్వం లోపభూయిష్టంగా అనిపించడం పెద్దలోటుగా అనిపిస్తుంది. మొత్తంగా రెండున్నరగంటలు ప్రేక్షకుల సహనానికి పరీక్షగా నిలుస్తుందీ చిత్రం. బాక్సాఫీస్ బరిలో సవ్యసాచి అస్త్రసన్యాసం చేయవల్సిందే అనిపిస్తుంది.
రివ్యూ రాసింది శ్రీ.