సినిమా నిర్మాణం అంటే - జూదం కంటే దారుణమని నిర్మాతలు భయపడుతున్నారు. ఏళ్లకు ఏళ్లు పాతుకుపోయిన నిర్మాణ సంస్థలు కూడా క్రమంగా మూతపడుతున్నాయి. ఒక్క ఫ్లాపు దెబ్బకు అడ్రస్‌లేకుండా పోయిన సంస్థలెన్నో. ఓ సినిమా పూర్తి చేసి - విడుదల చేయడమే గగనం అయిపోతున్న రోజులు ఇవి.
అలాంటిది ఒక్కసారిగా చేతిలో పది హేను సినిమాల్ని ఉంచుకోవడం అంటే మాటలా..?? తెలుగు చిత్రసీమకు సంబంధించినంత వరకూ ఇదో అరుదైన రికార్డు. ఈ రికార్డు మైత్రీమూవీస్‌కి సొంతం. శ్రీమంతుడుతో మైత్రీ మూవీస్ ప్రయాణం మొదలైంది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టుకొట్టింది. ఆ తరవాత జనతా గ్యారేజ్.. అదీ బ్లాక్ బ్లస్టరే. మూడో సినిమా రంగస్థలం. గత రెండు చిత్రాలకు మించిన విజయం రంగస్థలంతో దక్కింది. అంతేనా..?? హ్యాట్రిక్ విజయాలతో మైత్రీ మూవీస్ పేరు మార్మోగిపోయింది. ఈ శుక్రవారం 'సవ్యసాచి'ని విడుదల చేస్తున్న మైత్రీ మూవీస్.... వచ్చే నెలలో `అమర్ అక్బర్ ఆంటోనీ`ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.
ప్రస్తుతం ఓ రెండు చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇవి కాకుండా.. మరో పదిహేను చిత్రాల్ని పైప్ లైన్‌లో ఉంచుకుంది మైత్రీ మూవీస్. పదిహేను సినిమాలకు సంబంధించిన కథాచర్చలు, నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక, ఆడిషన్లు, షూటింగు లొకేషన్లు, బయ్యర్లతో మీటింగులు... ఇలా నిరంతరం మైత్రీ నిర్మాతలు బిజీ బిజీగా ఉన్నారు. వచ్చేయేడాది మైత్రీ మూవీస్ నుంచి 5 సినిమాలు రాబోతున్నాయి.
పరిశ్రమలోని స్టార్ హీరోలకు, దర్శకులకు మైత్రీ మూవీస్ ఎప్పుడో అడ్వాన్సులు ఇచ్చేసింది. అవే కాకుండా... కొత్తవాళ్లతో సినిమాలు చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తోంది. ఆయా ప్రాజెక్టులన్నింటినీ ఒకొక్కటిగా సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారు నిర్మాతలు. ''చేతిలో ఎన్ని సినిమాలున్నా. ఏకకాలంలో రెండు మూడు చిత్రాలనే సెట్స్‌పైకి తీసుకెళ్లగలం. ఈ యేడాది మూడు సినిమాల్ని విడుదల చేస్తున్నాం. వచ్చే యేడాది కనీసం 5 సినిమాలు వస్తాయి'' అని మైత్రీ మూవీస్ సంస్థ తెలిపింది.