నటీనటులు: శరత్ శ్రీరంగం, అనిల్ గోపిరెడ్డి, కారుణ్య తదితరులు
ఛాయాగ్రహణం: జయపాల్‌రెడ్డి
ఎడిటింగ్: సాయి తలారి
నిర్మాత: శిల్ప శ్రీరంగం.. సరిత గోపిరెడ్డి, నందన్
సమర్పణ: ఇ-బాక్స్ తెలుగు టీవీ
కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: అనిల్ గోపిరెడ్డి
యావరేజ్ యూజర్ రేటింగ్: 2/5
హారర్ సినిమా జోరు ఇంకా తగ్గ లేదు. నెలకు పది సినిమాలొస్తుంటే, అందులో ఒకటో రెండో హారర్ సినిమాలు ఉండనే ఉంటున్నాయి. ఇది వరకు హారర్ అంటే.. కేవలం భయపెట్టడం మాత్రమే. ఆ తరవాత కామెడీని మిక్స్ చేశారు. అదీ బోర్ కొట్టేసింది. ఇప్పుడు హారర్ సినిమా అని చెప్పి కేవలం కామెడీనే దట్టిస్తున్నారు. అలాంటి కథలకూ కాలం చెల్లిపోయింది. `సీత.. రాముని కోసం` అనేది హారర్ సినిమానే. కాకపోతే.. ఇందులో కామెడీ మిక్స్ చేయలేదు. సెంటిమెంట్ ధారబోశారు. అలా.. ఇది హారర్మెంట్ అనే కొత్త జోనర్ సినిమా అయిపోయిందన్నమాట. మరి ఈ సీత ఎలా ఉంది? ఎంత భయపెట్టింది, ఎంత ఏడిపించింది?
* కథ..
విక్కీ (శరత్) ఆత్మలపై పరిశోధన చేస్తుంటాడు. తను కొన్న బంగ్లాలోనే ఓ ఆత్మ ఉందన్న సంగతి తెలుస్తుంది. అందుకే ఆ బంగ్లాకి వెళ్లి.. అక్కడున్న ఆత్మ గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. ఆ బంగ్లాలో విక్కీకి రెండు డైరీలు దొరుకుతాయి. ఒక డైరీ సీత (కారుణ్య చౌదరి) ది. ఆ డైరీలో తన ప్రేమ కథ, తన ఆత్మ హత్యకు కారణాలు రాస్తుంది. ఇంతకీ సీత ఎవరు? రామ్ (అనిల్ గోపిరెడ్డి)తో తనకున్న అనుబంధమేమిటి? సీత ఆత్మ ఆ ఇంటి చుట్టూ తిరగడానికి గల కారణమేమిటి?? అనేదే `సీత రాముని కోసం` కథ.
* నటీనటులు..
ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ నడిచిన కథ ఇది. ముగ్గురూ కొత్తవారే. దర్శకుడు అనిల్ కీలకమైన పాత్రలో కనిపించాడు. శరత్, అనిల్ ఎక్స్‌ప్రెషన్స్ ఒకేలా ఉన్నాయి. ఒకే ఫేస్ ఫీలింగ్‌తో సినిమా అంతా నడిపించారు.
కథానాయిక బొద్దుగా ఉన్నా.. అందంగా కనిపించింది. మిగిలినవాళ్లకు తగిన పాత్రలేం దక్కలేదు. పాత్రధారుల ఎంపికలో జాగ్రత్త పడి, దర్శకుడు తాను పోషించిన పాత్రలో మరో తెలిసిన నటుడ్ని తీసుకొస్తే బాగుండేది.
* విశ్లేషణ..
టైటిల్ చాలా పొయెటిక్‌గా ఉంది. ఇదేమైనా ప్రేమ కథ అనుకొంటే.. ఆత్మ కథ చెప్పి షాక్ ఇచ్చాడు దర్శకుడు. సినిమా ప్రారంభంలోనే ఇది ఆత్మ కథన్న సంగతి అర్థమైపోతుంది. ఆత్మని చూపించకుండా, వాటి జాడ చెబుతూ తెరకెక్కించిన సన్నివేశాలతో సినిమా ఆసక్తిగానే మొదలవుతుంది. అయితే.. అదే పాయింట్‌ని పట్టుకొని విశ్రాంతి వరకూ నెట్టుకొచ్చాడు దర్శకుడు. సినిమా పేరు సీత. కానీ ఆ సీత తొలి భాగంలో ఎక్కడా కనిపించదు. సీత కథకు సమాంతరంగా మరో పాప కథకూడా చెబుతుంటాడు. ఇవి రెండూ మిక్స్ అయి ఏది సీత కథో, ఈ పాపని ఎందుకు చూపిస్తున్నారో అర్థం కాదు.
ద్వితీయార్థంలో దర్శకుడు కథపై దృష్టి పెట్టాడు. సెకండాఫ్ అంతా ఫ్లాష్ బ్యాకే. అక్కడ సీత - రామ్‌ల కథ చెప్పాడు. అది మరీ హార్ట్ టచింగ్‌గా లేకపోవడం నిరాశ పరుస్తుంది. క్లైమాక్స్ మాత్రం ఓకే అనిపిస్తుంది. ఇది హారర్ సినిమా. దాన్ని భయంతో ముడి పెట్టే చెప్పాలి. తెరపై ప్రధాన పాత్రలు భయపడవు. అలాంటప్పుడు థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడు ఎందుకు భయపడతాడు? పోనీ.. దీన్ని ఎమోషనల్ డ్రామా అనుకొంటే అంత ఎమోషన్ కథలో లేదు. మధ్యలో తాగుబోతు రమేష్‌ని ఇరికించి కామెడీ పండించే ప్రయత్నం చేశారు. ఐటెమ్ సాంగ్ జోడించి కమర్షియల్ టచ్ ఇద్దామనుకున్నారు. రెండూ పండలేదు.
* సాంకేతిక వర్గం..
ఈ చిత్ర దర్శకుడే సంగీతం అందించాడు. లాలీ లాలి పాట గుర్తుండిపోతుంది. అంతకు మించి పాటల్లో కొత్తదనం కనిపించదు. నిజానికి ఇలాంటి సినిమాలకు పాటలు అడ్డు కూడానూ. నేపథ్య సంగీతంతో భయపెట్టే ప్రయత్నం చేశాడు. తెరపై ఆ ఫీలింగ్ లేనప్పుడు ఆర్.ఆర్‌తో మాత్రం ఎంత నెట్టుకొచ్చేది?? ఓ విల్లా చుట్టూ నడిచే కథ ఇది. ఫొటోగ్రఫీ నీట్‌గా ఉంది. తక్కువ బడ్జెట్‌లో తీసినా.. సినిమా రిచ్‌గా కనిపిస్తుంది.
* ప్లస్ పాయింట్స్
+ టైటిల్
+ లాలి పాట
* మైనస్ పాయింట్స్
- కథ
- కథనం
- భయం లేకపోవడం
* ఫైనల్ వర్డిక్ట్ : సీత భయపెట్టలేదు..!
రివ్యూ బై శ్రీ