'సిటీమార్' రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు : గోపీచంద్, తమన్నా, భూమిక, రెహ్మాన్ తదితరులు 
దర్శకత్వం : సంపత్ నంది
నిర్మాత‌లు : శ్రీనివాస్ చిట్టూరి
సంగీతం : మని శర్మ
సినిమాటోగ్రఫర్ : సౌందర్ రాజన్
ఎడిటర్ : తమ్మిరాజు


రేటింగ్: 2.75/5


క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల్లో స్పోర్ట్స్ డ్రామా క‌థ‌లు వేరు. ఓ ఆట‌... దాని వెనుక క‌ష్ట‌సుఖాలు, అందులోని భావోద్వేగాల‌న్ని జ‌ల్లిడ ప‌ట్టి సినిమా తీస్తే... అది స్పోర్ట్స్ డ్రామా. ఆటే అందులోని క‌మ‌ర్షియ‌ల్ హంగు. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన స్పోర్ట్స్ డ్రామాల‌న్నీ ఇలా తీసిన‌వే. ఈ జాబితోనే ఇప్పుడు `సిటీమార్‌` చేరింది. ఇక్క‌డ సంప‌త్ నంది ఏం చేశాడంటే.. క‌బ‌డ్డీ ఆట‌కు మ‌రికొన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగులు జోడించాడు. ఆ మాట‌కొస్తే... ఓ క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌కు, క‌బ‌డ్డీ ఆట‌ని త‌గిలించాడు. మ‌రి ఈ తూకం ఎలా సాగింది?  గోపీచంద్ పెట్టిన `కూత‌` ఏ రేంజ్‌లో వినిపించింది??


* క‌థ‌


కార్తీక్ (గోపీచంద్‌) క‌బ‌డ్డీ కోచ్‌. ఆంధ్రా బ్యాంకులో ప‌నిచేసుకుంటూ.. త‌న ఊర్లోనే ఓ టీమ్ ని త‌యారు చేస్తుంటాడు. వాళ్ల‌తో నేష‌న‌ల్ ఛాంపియ‌న్ షిప్ ఆడించి క‌ప్పు కొట్టించాల‌న్న‌ది త‌న ధ్యేయం.  ఎన్నో స‌వాళ్ల‌ని ఎదురొడ్డి.. త‌న టీమ్ ని ఢీల్లీకి తీసుకెళ్తాడు. త‌న బావ (రెహ‌మాన్‌) ఒక సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌. త‌న వ‌ల్ల‌.. కార్తీక్‌, త‌న హాకీ టీమ్ ఇబ్బందుల్లో ప‌డుతుంది. ఏకంగా హాకీ టీమ్ మొత్తాన్ని కిడ్నాప్ చేస్తారు. ఈ కిడ్నాప్  ఎవ‌రు చేశారు?  ఎందుకు చేశారు?  జ్వాలారెడ్డి (త‌మ‌న్నా)తో కార్తీక్ కి ఉన్న సంబంధం ఏమిటి?  అమ్మాయిల టీమ్ తో కార్తీక్ క‌ప్పు కొట్టాడా?  లేదా?  అనేది మిగిలిన క‌థ‌.


* విశ్లేష‌ణ‌


ప్ర‌తీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలోనూ యాక్ష‌న్ సీన్లు ద‌ట్టిస్తుంటారు. ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ని బీభ‌త్సంగా, క్రూరంగా చూపిస్తుంటారు. ఇందులోనూ అదే చేశారు. విల‌న్ పాత్రకు ఇచ్చిన బిల్డ‌ప్పులు అన్నీ ఇన్నీ కావు. తొలి ప‌ది నిమిషాలు త‌న ఇంట్ర‌డ‌క్ష‌నే. ఓ పోలీస్‌.. గుండా గా మారి జ‌నాన్ని పీడిస్తే ఏమ‌వుతుంది అన్న‌ది ర‌క్త‌పు మ‌డుగుల మ‌ధ్య చూపించారు. దాంతో ఈసినిమా ఎలా ఉండ‌బోతోంద‌న్న హింట్ ప్రేక్ష‌కుల‌కు దొరికేసింది. ఆ త‌ర‌వాత హీరోని క‌బ‌డ్డీ కోచ్ క‌మ్ ఆంధ్రా బ్యాంకు ఉద్యోగిగా ప‌రిచ‌యం చేశారు. ఫైట్లూ, పాట‌లూ, కొన్ని పంచ్ డైలాగులూ మామూలే.


అమ్మాయిల్ని రౌడీలు వేధిస్తుంటే.. హీరో వ‌చ్చి కాపాడ‌డం రివాజు. అయితే.. ఈసారి అమ్మాయిలే తిర‌గ‌బ‌డి క‌బ‌డ్డీ ఆడేయ‌డం కొత్త‌గా అనిపించింది. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన అమ్మాయికి ధైర్య‌మే తోడుగా నిల‌వాలి అని ఆ సీన్ తో చెప్పారు. అయితే ఇలాంటి సీన్లు రెండు మూడు ప‌డితే బాగుండేది. ఈ స్పిరిట్‌... ప‌తాక స‌న్నివేశాల్లో క‌బ‌డ్డీ టీమ్ చూపించినా బాగుండేది. ఆంధ్రా తెలంగాణ జ‌ట్ల మ‌ధ్య వైరం పై కూడా స‌రిగా ఫోక‌స్ చేయ‌లేదు. `మ‌నం ఆంధ్రా తెలంగాణ అని కొట్టుకుంటాం.. ప‌క్క రాష్ట్రం వాడు తెలుగువాడినే చిన్న‌చూపు చూస్తుంటాడు` అనే సందేశం ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకున్నా, అది పూర్తి స్థాయిలో క‌న్వే కాలేదు. పెళ్లి చూపుల సీన్ లో.. అన్న‌పూర్ణ అండ్ కో చెల‌రేగిపోవ‌డం బాగానే ఉంది. కానీ అన్న‌పూర్ణ లాంటి సీనియ‌ర్ న‌టి. `చిల్ బ్రో` అంటూ మాస్ డైలాగులు ప‌ల‌క‌డం కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.


జాతీయ స్థాయి పోటీలు ఆడుతున్న ఓ ఆంధ్రా టీమ్ ని అంత ఈజీగా కిడ్నాప్ చేస్తారా?  వాళ్లు కిడ్నాప్ అయ్యార‌ని తెలిసి అధికారులు అంత ఉదాశీనంగా ఉంటారా అనిపించింది. బ‌హుశా. ద‌ర్శ‌కుడు త‌న‌కు తానుగా తీసుకున్న క్రియేటీవ్ స్పేస్ ఏమో..?  సెకండాఫ్‌లో త‌న టీమ్ ని ర‌క్షించుకోవ‌డ‌మే హీరో టార్గెట్. అయితే  ఆక్ర‌మంలో త‌న‌కు ఎదురైన స‌వాళ్ల‌ని ఆస‌క్తిక‌రంగా చూపించాల్సింది. కానీ అది జ‌ర‌గ‌లేదు. ఇంత సీరియ‌స్ డ్రామాలో పాట‌ల‌కు చోటెక్క‌డ‌?  కామెడీకి స్పేస్ ఎక్క‌డ ?  పాట‌లైతే ఎలాగోలా ఇరికించాల‌ని చూశారు. కానీ రిలీఫ్ మాత్రం దొర‌క‌లేదు. క్లైమాక్స్ లో ఏం జ‌రుగుతుందో ముందే తెలిసిపోతుంది కాబ‌ట్టి. కిక్ లేకుండా పోయింది.


* న‌టీన‌టులు


గోపీచంద్ చాలా కాలంగా హిట్ కోసం ప‌రిత‌పిస్తున్నాడు. ఈసారి త‌న‌కు సూటైన క‌థ‌నే ఎంచుకున్నాడు. అయితే త‌న న‌ట‌న‌లో వైవిధ్యం చూపించ‌లేక‌పోయాడు. గ‌త సినిమాల్లో ఏం చేశాడో, ఈసారీ అదే చేశాడు. త‌మ‌న్నా తో ప‌లికించిన తెలంగాణ స్లాంగ్ కృత‌కంగా ఉంది. త‌న పాత్ర‌ని బోల్డ్ గా చూపించారు. హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ అయ్యే ఛాన్సు ఈ క‌థే ఇవ్వ‌లేదు. రావు ర‌మేష్ ఒక్క‌డే బెట‌ర్ అనిపించాడు.


* సాంకేతిక వ‌ర్గం


కెమెరా వ‌ర్క్‌, నేప‌థ్య సంగీతం, టేకింగ్ ఇవ‌న్నీ ప‌క్క‌గా క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్ లో సాగాయి. బాలారెడ్డి పాట‌.. థియేట‌ర్లో కేక‌లు పెట్టిస్తుంది. కాక‌పోతే... ఆ పాట‌ని రాంగ్ టైమింగ్ లో వ‌దిలాడ‌నిపిస్తుంది. సంప‌త్ నంది కొన్ని డైలాగులు బాగానే రాసుకున్నాడు. రొటీన్ క‌థ‌ని క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్‌లో న‌డిపించిన సంప‌త్‌.. కొన్ని చోట్ల ఆ మీట‌ర్ దాటేశాడు. లాజిక్కులు లేకుండా క‌థ‌ని త‌న ఇష్టానుసారం న‌డిపాడు. స్పోర్ట్స్ కోటాలో ఓ క‌మ‌ర్షియ‌ల్ క‌థ చెప్పాల‌నుకోవ‌డం క‌రెక్టే. కానీ రెండింటికీ న్యాయం చేయ‌లేక‌పోయాడు.


* ప్ల‌స్ పాయింట్స్‌


క‌బ‌డ్డీ
టెక్నిక‌ల్ టీమ్‌
జ్వాలా రెడ్డి పాట‌
మాస్ మూమెంట్స్‌


* మైన‌స్‌పాయింట్స్‌


రొటీన్ క‌థ‌
ఊహాజ‌నిత‌మైన స్క్రీన్ ప్లే
హింస - ర‌క్త‌పాతం


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  ఈల... గోల‌


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS