తారాగణం: నాగ చైతన్య, అను ఇమాన్యుల్, రమ్య కృష్ణన్, నరేష్, వెన్నెల కిషోర్, పృథ్వీ & తదితరులు
నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: గోపి సుందర్
ఛాయాగ్రహణం: నిజార్ షఫీ
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు: రాధాకృష్ణ, నాగ వంశీ & PDV ప్రసాద్
రచన-దర్శకత్వం: మారుతీ
రేటింగ్: 2.5/5
అత్తా - అల్లుళ్లది ఎవర్ గ్రీన్ ఫార్ములా. వీటిపై ఎన్ని కథలొచ్చినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. అందుకే టాప్ స్టార్స్ అంతా చాలాసార్లు అల్లుళ్లగా అవతరించారు. అలరించారు. అయితే కాలం మారింది. అత్తా - కోడళ్ల కథల ట్రెండ్ పుట్టుకొచ్చింది. టీవీ సీరియళ్ల నిండా అవే. వాటిని చూసీ చూసీ జనాలకు కూడా బోర్ కొట్టడం మొదలైంది. ఇప్పుడు కూడా పాత ట్రెండ్‌లోలా.. ఓ అత్తా - ఓ అల్లుడు అంటూ కథ చెబితే జనం ఎందుకు చూస్తారు? దానికేదో కొత్తదనం జోడించాలి. అది కూడా కొంగొత్తగా ఉండాలి. `శైలజా రెడ్డి అల్లుడు` కోసం మారుతి ట్రై చేసింది అదే. అత్త- అల్లుడు ఫార్ములాకి `ఈగో` జోడించాడు. ఈ జోడింపు ఎలా కురిదింది? ఈ అత్తా, అల్లుళ్లు అలరించారా, లేదా?
* కథ
చై (నాగచైతన్య) సరదా కుర్రాడు. తండ్రి (మురళీ శర్మ) పరమ ఈగోయిస్టు. తన ఈగోనే భరించలేడనుకుంటే.. ప్రేమించిన అమ్మాయి అను (అనూ ఇమ్మానియేల్) కి కూడా ఇంకొంచెం ఈగో ఎక్కువే ఉంటుంది. ఎలాగోలా.. ఆ ఈగోని దారిలో పెట్టి... ఆమెను పెళ్లాడాలనుకుంటాడు. తీరా చూస్తే.. కాబోయే అత్త శైలజారెడ్డి (రమ్యకృష్ణ)కు మరింత ఈగో. అటు ప్రేమించిన అను, ఇటు అత్త.. ఇద్దరి ఈగోలకూ.. తాను బలవుతుంటాడు. వీరిద్దరినీ చై ఎలా మార్చాడు?? వాళ్లలోని అహాన్ని ఎలా పోగొట్టాడు? ఆ మార్పు ఎలా సాధ్యమైంది? అనేదే శైలజారెడ్డి అల్లుడు కథ.
* నటీనటులు
చై అందంగా కనిపించాడు. చలాకీగా నటించాడు. స్క్రీన్ ప్రజెన్స్ మారింది. తన నటనలో జహజత్వం కనిపించింది. అయితే... హీరోగా తనని మరో మెట్టు ఎక్కించే సినిమా మాత్రం కాదిది. చైతూ అల్లుడిగా కనిపిస్తున్నాడంటే అల్లరి అల్లుడు లాంటి సినిమా ఆశిస్తారు. ఆ స్థాయిలో తన పాత్రగానీ, కథగానీ లేవు.
రమ్యకృష్ణ నటన మరోసారి మెప్పిస్తుంది. ఆమె కనిపించినప్పుడల్లా తెరకే ఓ నిండుదనం వచ్చేది. కానీ ఈ పాత్రనీ, రమ్యకృష్ణనీ దర్శకుడు సరిగా వాడుకోలేదేమో అనిపించింది.
అను గ్లామర్‌గా కనిపించింది. అయితే నటన విషయంలో ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంది. వెన్నెల కిషోర్ మరోసారి ఈ సినిమాని కొంత వరకూ గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. నరేష్, ఫృథ్వీ, మురళీ శర్మ రొటీన్‌గానే అనిపించారు.
* విశ్లేషణ
సాధారణంగా అత్తా అల్లుళ్ల కథంటే.. ఒకరు మరోకర్ని డామినేట్ చేయాలని చూస్తుంటారు. వాళ్లిద్దరి మధ్యా నువ్వా, నేనా? అన్నట్టు పోరు సాగుతుంది. అయితే `శైలజా రెడ్డి అల్లుడు` ఆ తాను ముక్క కాదు. ఓ రకంగా... అత్తా అల్లుళ్ల కథకు కొత్త రంగు పులిమాడనే చెప్పాలి. ఆ రంగు పేరు `ఈగో`. ఈ సినిమాలో `ఈగో`తో విలవిలలాడే పాత్రలెక్కువ. వాటి చుట్టూనే డ్రామా పండించాలని చూశాడు దర్శకుడు. అందుకు తగిన స్కోప్ కూడా దొరికింది. అయితే ఈ ఫ్లాట్ ఫామ్‌ని దర్శకుడు సరిగా వాడుకోలేదేమో అనిపిస్తుంది.
ఫస్టాఫ్ చాలా కష్టంగా బోరింగ్‌గా సాగిపోతుంది. అక్కడక్కడ కొన్ని ఫన్నీ సీన్లు పడినా.... అందులో మారుతి స్థాయి వినోదం మాత్రం రాలేదు. ఫస్టాఫ్ చూస్తున్నప్పుడే ఓ పూర్తి సినిమా చూసేశాం అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే... హీరో, హీరోయిన్ల ట్రాక్, హీరోయిన్ ఈగో.. ఆమెను దారిలోకి తేవడానికి హీరో చేసిన ప్రయత్నాలు.. ఇవన్నీ ఓ మినీ సినిమాని తలపిస్తాయి. సెకండాఫ్‌లో అత్త పాత్ర వైపు దృష్టి మరలుతుంది. అత్తలో ఉన్న ఈగోని సంతృప్తి పరచడానికి, దాన్ని పోగొట్టడానికి హీరో చేసే ప్రయత్నాలు, అత్త, కూతుర్ల మధ్య నలిగిపోయిన విధానం ఈసినిమాకి ఎస్సెస్.
అయితే... దర్శకుడు దీన్ని కూడా వాడుకోలేదు. ఫృథ్వీ, వెన్నెల కిషోర్‌లతో నడిపించిన సన్నివేశాలు.. ఈ కథ మరో పది నిమిషాల నిడివి పొడిగించడంలో తప్ప ఎందుకూ ఉపయోగపడేలేదు. `ఈగో` అనే పాయింట్ కూడా రాను రాను రొటీన్‌గా బోరింగ్‌గా అనిపిస్తుంది. అలాగని మారుతి మార్కు సన్నివేశాలు లేవని కాదు. ఉన్నాయి... కానీ డోసు సరిపోలేదు. మారుతి నుంచి ఆశించే వినోదం ఈ సినిమాలో బాగా తగ్గిపోయింది. ఫన్ ఎలిమెంట్‌ని ఇంకాస్త జోడించి ఉంటే.. ఈ సినిమా యావరేజ్ మార్కుల దగ్గరైనా ఆగిపోయేది. రొటీన్ కాన్సెప్టుని కొత్తగా చూపించే ప్రయత్నం చేసినా.. అదెందుకో సఫలీకృతం కాలేదు.
* సాంకేతిక వర్గం
సినిమా చాలా రిచ్‌గా కలర్‌ఫుల్‌గా ఉంది. కెమెరా మెన్ కి ఎక్కువ మార్కులు పడతాయి. పాటల్లో మెలోడీలే ఎక్కువ. వాటిని తెరకెక్కించిన విధానం కూడా బాగుంది. మారుతి డైలాగ్ రైటర్‌గా విజృంభిస్తుంటాడు. సరదా సన్నివేశాల్ని బాగా రాసుకుంటాడు. ఎందుకో.. ఈసారి మారుతి కలం ఆ స్థాయిలో పనిచేయలేదు. రొటీన్ కథకు ఈగో అనే కొత్త కోణం జోడించాలనుకున్నా.. సఫలీకృతం కాలేదు.
* ప్లస్ పాయింట్స్
+ చై - అను జోడీ
+ రమ్యకృష్ణ
+ కొన్ని కామెడీ బిట్లు
* మైనస్ పాయింట్స్
- కథ
- తగ్గిన వినోదం
- రొటీన్ క్లైమాక్స్
* ఫైనల్ వర్డిక్ట్: రొటీన్ అల్లుడు.
రివ్యూ రాసింది శ్రీ