చిత్రం: శతమానంభవతి
తారాగణం: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: వేగేశ్న సతీష్
సంగీతం: మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
విడుదల తేదీ: 14 జనవరి 2017
కథా కమామిషు
ఆత్రేయపురం అనే ఊళ్ళో ఓ గౌరవ ప్రదమైన వ్యక్తి రాజుగారు (ప్రకాష్‌రాజ్), ఆయన భార్య జానకమ్మ (జయసుధ), మనవడు రాజు (శర్వానంద్)తో కలిసి ఉంటారు. రాజుగారి పిల్లలంతా విదేశాల్లోనే స్థిరపడతారు. ఎప్పుడూ లైఫ్‌లో బిజీగా ఉండే తన కటుంబ సభ్యుల్ని విదేశాల నుంచి స్వదేశానికి రప్పించేందకు రాజుగారు ఓ వ్యూహం పన్నుతారు. పిల్లలంతా విదేశాల నుంచి వస్తారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా నుంచి రాజుగారి మనవరాలు నిత్య (అనుపమ పరమేశ్వరన్) కూడా వస్తుంది. నిత్య, రాజుల మధ్య ప్రేమ చిగురిస్తుంది. సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా రాజుగారి ఇంట్లో జరుగుతాయి. ఓ సందర్భంలో రాజుగారి వ్యూహం బయటపడ్తుంది. దాంతో కుటుంబంలో విభేదాలు తలెత్తుతాయి. అసలు రాజుగారి వ్యహమేంటి? రాజు, నిత్యల ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది? అనే ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.
నటీనటులు ఎలా చేశారు?
శర్వానంద్ మంచి నటుడు. అతనికి కొత్తగా సర్టిఫికెట ఇవ్వాల్సిన పనిలేదు. ఎలాంటి హావభావాలైనాసరే చాలా సులువుగా పలికించేయడం శర్వానంద్ గొప్పతనం. తెరపై నటించడం కాదు, జీవించేయడంలో దిట్ట శర్వానంద్. ఈ సినిమాలోనూ శర్వానంద్ నటుడిగా సత్తా చాటాడు. అన్ని ఎమోషన్స్‌నీ బాగా పండించాడు. ఎమోషనల్ సీన్స్, రొమాంటిక్ టచ్ ఉన్న సీన్స్, ఎంటర్‌టైనింగ్ సీన్స్ ఇలా అన్నిట్లోనూ నిరూపించుకున్నాడు.
అనుపమ పరమేశ్వరన్ నేచురల్ బ్యూటీ. నటనలోనూ ఆ సహజత్వం కన్పిస్తుంటుంది. శర్వానంద్ సరసన జోడీగా బాగా కుదిరింది అనుపమ. తెలుగు తెరకు మంచి హీరోయిన్ దొరికిందని ఈ సినిమాతో ఫిక్సయిపోవచ్చు. దాదాపుగా అన్ని సన్నివేశాల్లోనూ సందర్భోచితంగా నటించింది. ఈ సినిమాతో అనుపమకి మంచి మార్కులు పడ్డట్టే.
ప్రకాష్‌రాజ్, జయసుధలకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. అలా అలా చేసుకుపోయారంతే. వీరిద్దరూ నటించారనడం కన్నా, పాత్రల్లో ఒదిగిపోయారనడం సబబు. మిగతా పాత్రధారుల్లో నరేష్, ఇంద్రజ బాగా చేశారు. మిగిలినవారంతా, తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు
కథ కొత్తదేమీ కాదు, పరిచయమైనదే. స్క్రీన్ ప్లే పరంగా కూడా దర్శకుడు పెద్దగా రిస్క్ చేయలేదు. అందమైన కుటుంబం, కాస్త ఎంటర్‌టైన్‌మెంట్, ఇంకాస్త ఎమోషనల్ కంటెంట్‌తో దర్శకుడు ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని రూపొందించాడు. మాటలు ఆకట్టుకుంటాయి. సంగీతం బాగుంది. ఎడిటింగ్ అక్కడక్కడా అవసరం అన్పిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రిచ్‌నెస్‌కి కారణం సినిమాటోగ్రఫీనే. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. నిర్మాత ఎక్కడా రాజీ పడని నైజానికి ప్రశంసలు దక్కడం ఖాయం. ఆర్ట్, కాస్ట్యూమ్స్ సినిమాకి సహజత్వాన్ని తెచ్చాయి.
విశ్లేషణ
విదేశాల్లో సెటిలైపోయిన పిల్లలు, వారి కోసం పరితపించే తల్లిదండ్రులు. ఇది ఎన్నో సినిమాల్లో చూసిందే. అయితే ఎంత ఎదిగినా, ఎంతగా విదేశాల్లో పెరిగినా మూలాల్ని మర్చిపోకడదనే మెసేజ్ ఎప్పుడు ఇచ్చినా బాగుంటుంది. ఇలాంటి సినిమాలంటే నిర్మాత దిల్ రాజుకి ప్రత్యేకమైన అభిమానం ఈ తరహాలో ఆయన చేసిన చాలా సినిమాలు ఘనవిజయాలు సాధించాయి. సరదా సరదా సన్నివేశాలు, అ్కడక్కడా కంటతడి పెట్టించే సన్నివేశాలతో సినిమా అలా అలా నడిచిపోతుంది. అయితే ఫస్టాఫ్‌లో ఉన్న వేగం సెకెండాఫ్‌లో కనిపించకపోవడం ఓ లోటు. ఎమోషనల్ కంటెంట్ పెరిగినప్పుడు ఇది మామూలే. ఓవరాల్‌గా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. సినిమాకి చేసిన పబ్లిసిటీ, సినిమాలో లీడ్ పెయిర్ చాలా ఫ్రెష్‌గా ఉండటం, ఇవన్నీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఓవరాల్‌గా సినిమా క్లాస్ ఆడియన్స్‌ని టచ్ చేస్తూనే, అన్ని వర్గాల ఆడియన్స్‌ని అలరించేలా ఉంది.
ఫైనల్ వర్డ్
చక్కని కుటుంబ కథా చిత్రం 'శతమానం భవతి'