మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఎంత వసూలు చేస్తుంది? అనే ఉత్కంఠ టాలీవుడ్ వర్గాల్లో ఉంది. ఎందుకంటే చిరంజీవి సినిమాలకు దూరమయ్యేనాటికి ఆయనే నెంబర్ వన్. ఓ సందర్బంలో సూపర్ స్టార్ మహేష్‌బాబు, ఒకటి నుంచి 10 వరకూ చిరంజీవేననీ, ఆ తర్వాతే తామనీ చెప్పిన మాటని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. చిరంజీవి మీద ఉన్న అభిమానంతోనో, గౌరవంతోనో మాత్రమే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని అనుకోలేం. దానికి సాక్ష్యమే 'ఖైదీ నెంబర్ 150' సినిమా. వస్తూనే చిరంజీవి వసూళ్ళ ప్రభంజనం సృష్టించారు. తొలి రోజు వసూళ్ళలో 'బాహుబలి'ని సైతం 'ఖైదీ' బ్రేక్ చేసేసింది. ఇప్పుడు తొలి వారం ఎంత వసూళ్ళను 'ఖైదీ' సాధించగలదు? అని సినీ పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం 60 నుంచి 70 కోట్ల దాకా తొలి వారమే 'ఖైదీ' రాబట్టుకునే అవకాశం ఉందని సమాచారమ్. ఏదేమైనప్పటికీ 'ఖైదీ' 100 కోట్లను అవలీలగా దాటేస్తుందని అంటున్నారు. సంక్రాంతి సీజన్ కావడంతో వసూళ్ళ పంట పండుతోందిప్పుడు. సోమవారం తర్వాత పూర్తిస్థాయిలో సినిమా వసూళ్ళపై ఓ స్పష్టత వస్తుంది. ఇప్పటికైతే 'ఖైదీ' టీమ్ చాలా ఉత్సాహంగా కన్పిస్తోంది. ఓవర్‌సీస్‌లోనూ ఓ మాస్ కమర్షియల్ సినిమా ఈ స్థాయిలో సత్తా చాటడం గొప్ప విషయంగా భావించాలి.