నటీనటులు: ధనుష్, సంయుక్త మీనన్, సముద్ర ఖని, సాయి కుమార్ & ఇతరులు
దర్శకుడు : వెంకీ అట్లూరి
నిర్మాతలు: నాగ వంశీ, సాయి సౌజన్య
సంగీత దర్శకులు: జీవి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: J యువరాజ్
ఎడిటర్: నవీన్ నూలి
రేటింగ్ : 2.75/5
విద్య నేపధ్యంలో వచ్చిన త్రీ ఇడియట్స్, సూపర్ 30 లాంటి సినిమాలు సందేశంతో పాటు బాక్సాఫీసు సక్సెస్ కూడా అందుకున్నాయి. ఎడ్యుకేషన్ అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ కావడంతో ప్రేక్షకుల ఆసక్తి ఇలాంటి కథలపై సహజంగానే వుంటుంది. అయితే సందేశాన్ని, వినోదాన్ని కలిపి ఇవ్వడం కూడా ఒక ప్రత్యేకమైన కళ. హీరో ధనుష్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చంది. క్యాలిటీ ఎడ్యుకేషన్, కార్పోరేట్ వ్యాపారం, చదువు ఇచ్చే గౌరవం.. ఇలా చాలా అంశాలు టచ్ చేస్తూ రూపొందిన చిత్రమిది. మరీ సందేశాత్మక చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది ? సందేశం.. సందేశంలానే మిగిలిందా ? సందేశంతో పాటు సరికొత్త అనుభూతిని కలిగించిందా ? ఇంతకీ సార్ కథ ఏంటి ?
కథ:
90లో జరిగే కథ ఇది. త్రిపాఠీ విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్ త్రిపాఠి(సముద్రఖని)కి విద్య అనేది ఒక వ్యాపారంగా భావిస్తాడు. ప్రభుత్వ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులకి అధిక జీతాల్ని ఆశచూపుతూ.. క్వాలిటీ ఎడ్యుకేషన్ పేరుతో భారీగా ఫీజులు వసూళ్లు చేస్తూ.. ప్రభుత్వ కాలేజీలు మూత పడేలా చేస్తాడు. అధిక ఫీజుల వసూళ్లు చేస్తున్నరంటూ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో.. ఫ్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్ర కోసం ప్రభుత్వం ఓ జీవోని తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో త్రిపాఠీ ఓ ఒప్పందం కుదుర్చుకుంటాడు. కాలేజీలని తామే దత్తత తీసుకుని నడుపుతామని ప్రభుత్వానికి చెబుతాడు. అక్కడికి తమ కాలేజీల్లో పనిచేసే అంతగా అనుభవం లేని జూనియర్ లెక్చరర్లని పంపించి నాణ్యత లేని చదువులతో ఇంకా నాశనం చేసి.. తన వ్యాపారాన్ని కొనసాగించాలనేది అతని కుట్ర. అలా తన దగ్గర పనిచేస్తూ సిరిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువు చెప్పడానికి అపాయింట్ అయిన జూనియర్ లెక్చరరే బాలగంగాధర తిలక్ అలియాస్ బాలు (ధనుష్). సిరిపురం కాలేజీకి వెళ్లి వంద శాతం రిజల్ట్ తీసుకొస్తానని చెప్పిన బాలు సార్‌కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? విద్యార్ధుల జీవితాలని బాలు సార్ ఎలా చక్కదిద్దారు ? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
విద్య గుడిలో ప్రసాదంలాంటిది. దాన్ని పంచాలి కానీ... ఫైవ్‌స్టార్ హోటల్‌లో వంటకంలా పంచకూడదని భావించే ఓ మాస్టర్ కథ ఇది. షాప్‌లో దొరికిన వీడియో క్యాసెట్ల నుంచి ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రేక్షకుల్ని కథలోకి తీసుకెళతాడు దర్శకుడు. బాలు పాత్ర పరిచయం, ఆయన సిరిపురం కాలేజీకి వెళ్లడం, ఊరికి వెళ్లాక ఎదురయ్యే సవాళ్లు, అధిగమించే తీరు రొటీన్ గా వుంటుంది. విద్య గొప్పదనం చెప్పే సన్నివేశం, కులాలు గొడవలు వద్దు అనే సీను ఆకట్టుకునేలా తీశారు. ఊరి జనాల్లో చైతన్యం నింపేలా అబ్దుల్ కలామ్ జీవిత కథని చెప్పడం హత్తుకుంటాయి. అయితే చాలా చోట్ల సన్నివేశాలు సాగదీసినట్లుగా వుంటాయి. కథనం ఊహకు అందిపోతుంటుంది. విరామ ఘట్టం కూడా రొటీన్ గా, బాలీవుడ్ సినిమా సూపర్ 30ని గుర్తు చేస్తుంది.
ఫస్ట్ హాఫ్ వరకూ కథని ఎంతో కొంతగా ఆసక్తినే నడిపారు. సెకండ్ హాఫ్ లో మాత్రం కథ గాడి తప్పింది. బాలు పాక వేసి టీచ్ చేయడం, దాన్ని కొందరు కూలగొట్టడం, బాలు ఎదురుతిరగడం, పోలీస్ కేసు, నగర బహిష్కరణ ఇవన్నీ మరీ కుత్రిమంగా వుంటాయి. బాలుపట్నం వెళ్ళిపోయినా తర్వాత మీనాక్షి అక్కడికి వెళ్ళడం,. ఆ నేపధ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా అంత ఆసక్తికరంగా వుండవు. వీడియో షూట్ చేసి విద్యార్ధులకు మారు వేషంలో, ఒక టూరింగ్ టాకీస్ లో పాఠాలు చెప్పే సన్నివేశాలు కూడా అంత బలంగా రాలేదు. నాటకీయత మరీ ఎక్కువైన భావన కలుగుతుంది. నిజానికి ఇలాంటి కథలో ఫైట్లు కూడా అనవసరం. కానీ ధనుష్ ఇమేజ్ ని ద్రుష్టిలో పెట్టుకొని అవసరం లేని చోట కూడా యాక్షన్ సీన్లు పెట్టడంతో సహజత్వం కొరవడి వల్ల చాలా చోట్ల కుత్రిమంగా అనిపిస్తుంది. చివర్లో విద్య గురించి చెప్పేమాటలు మాత్రం ఆకట్టుకునేలా వుంటాయి.
నటీనటులు :
లెక్చరర్ పాత్రలో ధనుష్ ఒదిగిపోయాడు. బాలు సార్ గా భావోద్వేగాలతో పాటు యాక్షన్ సీన్స్లో కూడా అదరగొట్టాడు. సంయుక్త మీనన్ ని పద్దతిగా కనిపించింది. మొదట్లో ఆమె పాత్ర బలంగా కనిపించినప్పటికీ చివరికి వచ్చేసరికి అది రొటీన్ అనిపిస్తుంది. త్రిపాఠిగా సముద్రఖని బలంగా నిలబడ్డార. సిరిపురం సర్పంచ్‌గా సాయికుమార్ పాత్ర ఆకట్టుకుంటుంది. అది కొన్ని జోకులు వేశాడు. తనికెళ్ళ భరణితో పాటు మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
టెక్నికల్ :
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. జి.వి.ప్రకాష్ సంగీతం ప్రధాన ఆకర్షణ యువరాజ్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఆర్ట్ మరింత నేచురల్ గా వుండాల్సింది. ఎడిటర్ ఇంకా షార్ఫ్ చేయాల్సిన సన్నివేశాలు వున్నాయి. ‘అవసరానికి కులం వుండదు. అవసరం లేని మనిషి ఉండడు’’ . ఎవరినో పెళ్లి చేసుకొనిఅమెరికా వెళ్ళడం కాదు.. నా చదువు నన్ను అమెరికా తీసుకువెళుతుంది’’ లాంటి మాటలు ఆకట్టుకుంటాయి. దర్శకుడు చెప్పాలనుకున పాయింట్ లో నిజాయితీ వుంది. మంచి సందేశం వుంది. అయితే సందేశం చెబుతున్నపుడు అది కేవలం సందేశం గానే మిగిలిపోకూడదు. అలా మిగిలిపోతే అది సందేశమే అవుతుంది కానీ మంచి సినిమా కాలేదు. సార్ మాత్రం సందేశం దగ్గరే ఆగిపోయింది.
ప్లస్ పాయింట్స్
ధనుష్
కథా నేపధ్యం, సందేశం
మ్యూజిక్
మైనస్ పాయిన్స్
బలహీనమైన కథనం
సాగదీత, మలుపులు లేకపోవడం
సెకండ్ హాఫ్
ఫైనల్ వర్దిక్ట్ : థాంక్స్ సార్..!