తారాగణం: సుమంత్, ఈషా రెబ్బ, సాయి కుమార్, సురేష్ & తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాత: ధీరజ్, సుధాకర్
దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి
రేటింగ్: 2/5
సస్పెన్స్ థ్రిల్లర్స్‌కి ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది. ఇలాంటి సినిమాల కోసం ఎదురుచూసే ప్రేక్షకులూ ఉంటారు. ఇలాంటి సినిమాలు తెరకెక్కించడంలో చాలా రకాలైన సౌలభ్యాలుంటాయి. తక్కువ బడ్జెట్‌లో సినిమా పూర్తి చేయొచ్చు. టార్గెట్ ఆడియన్స్‌ని రీచ్ అయితే చాలు. అందుకే... `కార్తికేయ`, `క్షణం` తరహా చిత్రాలు తెలుగులో ఈమధ్య వరుసకడుతున్నాయి. `సుబ్రహ్మణ్యపురం` కూడా సస్పెన్స్ థ్రిల్లరే. సంతోష్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం... ఎంత వరకూ ఆకట్టుకుంది? `మళ్లీ రావా`తో గాడిన పడిన సుమంత్... మళ్లీ ఆకట్టుకోగలిగాడా?
కథ
కార్తీక్ (సుమంత్) ఓ రిసెర్చ్ స్కాల్కర్. ఆలయాలపై పరిశోధన చేస్తుంటాడు. కాకపోతే దేవుడిపై నమ్మకం ఉండదు. సుబ్రహ్మణ్యపురంలోని ఆలయాలకు ప్రసిద్ది. అక్కడ వరుసగా ఆత్మహత్యలు జరుగుతుంటాయి. అందుకు కారణమేంటో ఎవ్వరికీ అర్థం కాదు. ఆ మిస్టరీ చేధించాలని రంగంలోకి దిగుతాడు కార్తీక్. మరి కార్తీక్ సుబ్రహ్మణ్యపురం వెళ్లి ఏం తెలుసుకోగలిగాడు? అక్కడ సంభవిస్తున్న వరుస ఆత్మహత్యలకు గల కారణం ఏమిటి? ప్రియ (ఈషారెబ్బా) కార్తీక్‌కి ఎలా పరిచయం అయ్యింది? ఇద్దరి ప్రేమకథ ఎలా మొదలైంది? అనేది తెరపై చూడాలి.
నటీనటుల పనితీరు..
సుమంత్ మంచి నటుడు. అండర్ ప్లే బాగా చేస్తాడు. తన వరకూ ఈ పాత్రని బాగానే చేసుకుంటూ వెళ్లిపోయాడు. సుమంత్ ప్లేస్ లో ఏ కొత్త నటుడైనా.. ఈ సినిమా రిజల్ట్ ఇంతకంటే దారుణంగా ఉండేదేమో. ఈషా రెబ్బా చేయడానికి ఏం లేదు. ఆ పాత్ర మధ్యమధ్యలో వచ్చి వెళ్లిపోతుందంతే. సాయికుమార్, సురేష్.. ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు. వాళ్లిద్దరికీ రొటీన్ పాత్రలే దక్కాయి.
విశ్లేషణ...
సస్పెన్స్ థ్రిల్లర్స్ కథలెప్పుడూ చిన్నవిగానే ఉంటాయి. ఓ చిక్కుముడి.. దాని చుట్టూ బిగుతైన స్క్రీన్ ప్లే.. ఇదీ థ్రిల్లర్‌ల లక్షణం. `సుబ్రహ్మణ్యపురం` కథ కూడా అంతే. చెప్పుకోవడానికి చాలా చిన్న కథ ఇది. దాన్ని ఆసక్తికరంగా చెప్పడంలోనే విజయం దాగుంది. కానీ... దర్శకుడు సంతోష్ - ఈ విషయంలో సఫలీకృతం కాలేకపోయాడు. `సుబ్రహ్మణ్యపురం` ఓ ఆసక్తికరమైన ఎపిసోడ్‌తోనే మొదలవుతుంది. `తరువాత ఏం జరుగుతుందో` అనే టెన్షన్ కలిగించాడు. కాకపోతే.. దాన్ని చివరి వరకూకొనసాగించలేకపోయాడు.
తొలి సగం కథ, కథనాలు నత్తనడక నడుస్తుంటాయి. సుబ్రహ్మణ్యపురంలో వరుసగా ఆత్మహత్యలు జరగడం మినహా.. ఫస్ట్ ఆఫ్ సాధించిందేం లేదు. కార్తిక్ చేసే ఇన్విస్టిగేషన్ కూడా పేలవంగా ఉంటుంది. ఈషారెబ్బాతో కాంబినేషషన్ సీన్లు బాగున్నా... ఫస్ట్ ఆఫ్ ప్రేక్షకుడు కుర్చోగలిగేవాడేమో. కానీ... అందుకు ఆస్కారం ఇవ్వలేదు దర్శకుడు. దాంతో.. తొలిభాగం చాలా నీరసంగా నడుస్తుంది. ద్వితీయార్థంలో ఆత్మహత్యలకు అసలైన కారణం చూపించి... కథలోకి వెళ్లాడు. అయితే.. చిక్కుముడి విడిపోయాక ఈ సినిమాపై ఆసక్తి మరింత తగ్గిపోతుంది.
దర్శకుడు లాజిక్కులు బాగానే వేసుకున్నా - ప్రేక్షకుడు అంతకు మించి ఆశించేసరికి అవి కూడా తేలిపోతాయి. కీలకమైన గ్రాఫిక్స్ బడ్జెట్‌లేమితో చుట్టేయడంతో వాటికి సంబంధించిన సన్నివేశాలన్నీ తేలిపోయాయి. దర్శకుడు ఓ చిన్న పాయింట్ పట్టుకుని దిగిపోతే కుదరదని, దానికి సంబంధించి కసరత్తు బాగా చేయాలని ఈ సినిమా మరోసారి నిరూపించింది. థ్రిల్లర్ చిత్రాలకు స్క్కీన్ ప్లే చాలా కీలకం. ఈ విషయంలో.. సుబ్రహ్మణ్యపురం నిరాశ పరుస్తుంది.
సాంకేతిక వర్గం...
కెమెరా వర్క్, సంగీతం.. ఇవన్నీ ప్రాధమిక స్థాయిలోనే కనిపించాయి. టెక్నికల్‌గా సీరియళ్లు కూడా బాగుంటుందన్న ఈ తరుణంలో... సుబ్రహ్మణ్యపురం సీరియల్ కంటే తక్కువ స్థాయిలో తీయడం ఆశ్చర్యపరుస్తుంది. బహుశా బడ్జెట్ పరిమితులు దర్శకుడి కాళ్లు, చేతులు కట్టేశాయేమో. పాయింట్ బలంగానే ఉన్నా - దాన్ని తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు తడబడ్డాడు. స్క్రిప్టు పరంగా మరింత కసరత్తు చేయాల్సిన అవసరం ఉందనిపించింది.
* ప్లస్ పాయింట్స్
సుమంత్
కథలో ఉన్న పాయింట్
* మైనస్ పాయింట్స్
స్క్కీన్ ప్లే
నిర్మాణ విలువలు
పైనల్ వర్డిక్ట్: సీరియల్‌లా సాగిన... 'సుబ్రహ్మణ్యపురం'
రివ్యూ రాసింది శ్రీ.