నటీనటులు: నిహారికా కొణిదెల, రాహుల్ విజయ్, పర్లీన్, శివాజీ రాజా, సుహాసిని తదితరులు
దర్శకత్వం: ప్రణీత్ భ్రమండపల్లి
నిర్మాతలు: సందీప్ ఎర్రమ్ రెడ్డి, సృజన్ యరబోలు, రామ్ నరేష్
సంగీతం: మార్క్ కె రాబిన్
విడుదల తేదీ: మార్చి 29, 2019
రేటింగ్: 2.25/5
మెగా ఇంట్లోంచి చాలామంది హీరోలు వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. అయితే ఆ ఇంట్లో తయారైన తొలి నటీమణి... నిహారికనే. వెబ్ సిరీస్‌తోనే తన ప్రతిభని నిరూపించుకుంది. ఒక మనసు సినిమా ఫ్లాప్ అయినా.. నిహారిక నటనకు మంచి పేరే వచ్చింది. హ్యాపీ వెడ్డింగ్‌లోనూ ఆకట్టుకుంది. ఇప్పుడు `సూర్యకాంతం`గా ముస్తాబైంది. ఈ ముక్కోణపు ప్రేమకథలో నిహారిక పాత్ర ఎలా ఉంది? సూర్యకాంతంగా తాను చేసిన హంగామా ఎలాంటిది? ఈ సినిమాతో అయినా.. నిహారికకు తొలి విజయం దక్కుతుందా, లేదా?
* కథ
సూర్యకాంతం (నిహారిక) ది విభిన్నమైన వ్యక్తిత్వం. `నేను ఎవరి కోసం మారను.. నా కోసం ఎవరూ మారాల్సిన అవసరం లేదు` అని చెబుతుంటుంది. దగ్గరైనట్టే దగ్గరై... అంతలోనే దూరం అయిపోతుంటుంది. అలాంటి అమ్మాయిని అభి (రాహుల్ విజయ్) ప్రేమిస్తాడు. తన ప్రేమ గురించి సూర్యకాంతంకి చెప్పేలోగా... సూర్య కాంతం ఎప్పటిలా ఇల్లు విడిచి వెళ్లిపోతుంది. ఆమె కోసం యేడాది పాటు ఎదురుచూస్తాడు అభి. చివరికి చేసేదేం లేక పూజ (పెర్లిన్)ని పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. వీరిద్దరూ ఒకరికొకరు దగ్గరవుతున్న సమయంలో సూర్యకాంతం మళ్లీ తిరిగొస్తుంది. ఈ ఇద్దరమ్మాయిల ప్రేమలో అభి ఎలా నలిగిపోయాడు? చివరికి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
* నటీనటుల పనితీరు..
నిహారిక చుట్టూ తిరిగే కథ ఇది. ఈ పాత్రని దర్శకుడు చాలా నమ్మాడు. అయితే.. దాన్ని డిజైన్ చేయడంలో మాత్రం విఫలం అయ్యాడు. నిహారిక నటన కొన్నిసార్లు సహజంగా అనిపిస్తే.. ఇంకొన్నిసార్లు మరీ ఓవర్ అనిపిస్తుంది. వెబ్ సిరీస్ ప్రభావం నుంచి తాను ఇంకా బయటకు రాలేదు. రాహుల్ తన పరిధి మేరకు నటించాడు. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ప్రేమికుడి పాత్రని రక్తి కట్టించాడు. షెర్లిన్ అందంగా ఉంది. ఆమె నటన కూడా ఆకట్టుకుంది. శివాజీరాజా, సుహాసిని, మధుమణి.. వీళ్ల పాత్రల ప్రాధాన్యం చాలా తక్కువ. అయినా సరే.. తమ అనుభవంతో ఆయా పాత్రల్ని పండించారు.
* విశ్లేషణ
ఈమధ్య కొన్ని వెబ్ సిరీస్ లు చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఇలాంటి కంటెంట్‌లతో సినిమాలు తీస్తే ఎంత బాగుంటుందో కదా? అనిపిస్తోంది. కొన్ని సినిమాలు చూస్తే... `ఇది బెస్ సిరీస్‌కి ఎక్కువ - సినిమాకి తక్కువ` అనిపించేలా సాగుతున్నాయి. `సూర్యకాంతం` కూడా ఆకోవలో చేరే సినిమానే. నిహారికకు వెబ్ సిరీస్‌లు చేసిన అనుభవం ఉంది. అందుకోసమే ఓ కథ ఎంచుకుని, దాన్ని పొరపాటుగా సినిమాగా మలిచారేమో అన్న అనుమానం కలుగుతుంది సూర్యకాంతం చూస్తుంటే.
ఇదో ముక్కోణపు ప్రేమకథ. ఇద్దరు అమ్మాయిల మధ్య ఓ అబ్బాయి ఎలా నగిలిపోయాడో వినోదాత్మకంగా చూపించాలనుకున్నారు. కథలో కొత్తదనం లేదు. ఇది వరకు చూసిన సినిమాలే గుర్తొస్తాయి. బద్రి పాయింట్‌ని మరోలా చూపించారేమో అనిపిస్తుంది. నిహారిక పాత్ర ఈ కథకు కీలకం. ఆ పాత్రలో ఉన్న కన్‌ఫ్యూజన్, భయాలు సరిగా పోట్రయిట్ చేయలేదు. అయితే అప్పటికీ ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ పంచే బాధ్యత తానే తీసుకుంది. సూర్యకాంతం పాత్ర అలా ప్రవర్తించడానికి గల కారణాలు, నేపథ్యం సరిగా చూపించలేదు. అలా చూపించగలిగితే... ఈ కథకు కాస్త శక్తి వచ్చేది.
అక్కడక్కడ మెరిసిన సన్నివేశాలు. కాసింత వినోదం, నిర్మాణ విలువలు ఇవన్నీ సూర్యకాంతాన్ని గట్టెక్కించడానికి కృషి చేశాయి. సూర్యకాంతం యేడాది పాటు ఎక్కడికి వెళ్లిపోయింది? ఎందుకు వెళ్లిపోయింది? ఇలాంటి విషయాలపై క్లారిటీ లేదు. దర్శకుడు సూర్యకాంతం పాత్రపైనే ఎక్కువగా ఫోకస్ చేశాడు. ఆ పాత్రనే ఎక్కువగా నమ్ముకున్నాడు. అయితే.. ఆ పాత్ర అర్థం పర్థం కాకుండా ప్రవర్తించడం, కొన్నిసార్లు అతి చేయడం.. ఇబ్బంది కలిగిస్తాయి. సంఘర్షణ ఉన్నా - దాని వెనుక నేపథ్యం బలంగా లేకపోవడంతో చాలా సన్నివేశాలు తేలిపోయాయి. క్లైమాక్స్ కూడా పరమ రొటీన్‌గా అనిపిస్తుంది.
* సాంకేతిక వర్గం
దర్శకుడిగా ప్రణీత్‌కి ఇదే తొలి సినిమా. తనకు వెబ్ సిరీస్‌లు చేసిన అనుభవం ఉంది. అందులోంచి ఆయన ఇంకా బయటకు రాలేదనిపిస్తోంది. ఇది వెబ్ సిరీస్‌ని సరిపడే కంటెంట్. దాన్ని సినిమా భాషలోకి మార్చడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. పాటలు, నేపథ్య సంగీతం, కెమోరా.. ఈ విభాగాలు ఓకే అనిపిస్తాయి.
* ప్లస్ పాయింట్స్
+ నిహారిక
+ టెక్నికల్ టీమ్
+ అక్కడక్కడ వినోదం
* మైనస్ పాయింట్స్
- కథనం
- బోరింగ్ సీన్లు
* ఫైనల్ వర్డిక్ట్: నిహారిక... మళ్లీ నిరాశే
- రివ్యూ రాసింది శ్రీ.