నటీనటులు: సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ శరత్‌కుమార్ తదితరులు.
దర్శకత్వం: జీ. నాగేశ్వరరెడ్డి
నిర్మాతలు: నాగ భూషణ్ రెడ్డి, సంజీవ రెడ్డి, రూప జగదీష్ మరియు శ్రీనివాస్ ఇందుమూరి
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫర్: సాయి శ్రీరామ్
విడుదల తేదీ: నవంబర్ 15, 2019
రేటింగ్: 2.5/5
ఒక అందమైన అమ్మాయిని చూడగానే ప్రతిసారీ స్కూటర్ బ్రేక్ ఫెయిల్ అవుతుంది. ఇది లాజిక్ అనుకోవాలా? అది నేరుగా వెళ్లి ఒకరిని గుద్దేయడం... ఆ వెంటనే `అసలే బండి మధ్యప్రదేశ్‌లో తగిలింద`ని ఒక డైలాగ్ వినిపించడం. దీనికి నవ్వాలా? నాలుగైదు ఖరీదైన కార్లు తరుముతుండగా, డొక్కు స్కూటర్‌పై హీరో వాళ్లకి దొరక్కుండా వెళ్లిపోతాడు. ఇది నమ్మాలా? అసలు ఏ కాలం నాటి హంగామా ఇదంతా? దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఇంచుమించు ఇలాంటి సన్నివేశాల్నే సినిమా నిండా పేర్చేశాడు. రెండు గంటల సినిమానే, ఎంతకీ అయిపోని ఫీలింగ్ కలుగుతుందంటే కారణం అదే. అప్‌డేట్ అనే మాటని చిత్ర పరిశ్రమని సీరియస్‌గా పరిగణిస్తుంటుంది.
ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పుకి తగ్గట్టుగా కథయినా, సాంకేతికతయినా అప్‌డేట్ కావల్సిందే. అలా తమని తాము అప్‌డేట్ చేసుకోలేనివాళ్లు చాలామంది ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉంటున్నారు. కానీ జి.నాగేశ్వర్‌రెడ్డి మాత్రం కామెడీని నమ్ముకొని కొన్ని సినిమాలతో అప్‌డేట్ అయినట్టే కనిపించారు. ట్రెండ్‌కి తగ్గట్టుగా నవ్విస్తున్నారనే ఓ గుర్తింపు ఆయనకి ఉంది. కానీ `తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్` చూస్తే ఇంకా ఆయన మునుపటి రోజుల్లోనే ఉన్నారనే విషయం స్పష్టమవుతుంది. ఇంతకీ రామకృష్ణుడి కథేమిటో చూద్దాం...
* కథ
తెనాలి రామకృష్ణ (సందీప్‌కిషన్) కర్నూల్లో ఒక లాయర్. దుర్గారావు (రఘుబాబు) అనే ఒక బ్రోకర్‌కి కొడుకు. తన కొడుకు ఒక పెద్ద కేసుని వాదిస్తే చూడాలనేది దుర్గారావు ఆశ. కానీ ఎంతకీ ఆ కల నెరవేరదు. ఒక కేసుకి మరో కేసు ఫ్రీ, ఫీజులో డిస్కౌంట్ అంటూ ఎన్ని ఆఫర్లు ఇచ్చినా తెనాలి దగ్గరికి కేసులు తీసుకొచ్చేవాళ్లు ఉండరు. ఇక లాభం లేదనుకొని సివిల్ కేసుల్ని పట్టుకొని పార్టీల మధ్య రాజీ చేస్తూ పొట్ట పోసుకుంటుంటాడు. అలాంటి లాయర్ దగ్గరికి వరలక్ష్మి దేవి (వరలక్ష్మి శరత్‌కుమార్)కి సంబంధించిన కేసు వస్తుంది.
క్రిమినల్ లాయర్ చక్రవర్తి (మురళీశర్మ)ని కాదని ఆ కేసుని సొంతం చేసుకొని గెలుస్తాడు తెనాలి. కానీ ఆ కేసులో గెలిపించింది న్యాయాన్ని కాదనే విషయం తెలుసుకొని మళ్లీ రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ కేసు వెనక హంతకులకి శిక్ష పడిందా లేదా? క్రిమినల్ లాయర్ చక్రవర్తి కూతురు రుక్మిణి (హన్సిక)తో తెనాలికి ఉన్న సంబంధమేమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
* నటీనటులు
బోలెడు మంది నటులు కనిపిస్తారు. కానీ నవ్వించింది మాత్రం సత్యకృష్ణ పాత్ర ఒక్కటే. కె.ఎ.పాల్ మాటని పాటగా చేసి ఎలా నవ్వించాడో, అలా మాట్లాడుతూ ఆమె నవ్విస్తుంది. ఒకట్రెండు సన్నివేశాల్లో సప్తగిరి, వెన్నెల కిషోర్, పోసాని పర్వాలేదనిపిస్తారు. వాళ్లు తప్ప మిగిలినవాళ్లు చేసిన విన్యాసాలు విసుగు తెప్పించాయి తప్ప నవ్వించలేకపోయాయి.
సందీప్‌కిషన్ తెనాలి రామకృష్ణగా తన శక్తిమేరకు కష్టపడ్డాడు. కానీ పాత్రలో బలం లేకపోవడంతో ఒక రొటీన్ హీరో పాత్ర అయిపోయింది. హన్సిక చేసిందేమీ లేదు. ఆమె తెరపై మరింత ముదురుగా కనిపించింది. అందం పరంగా కూడా ఆమె మెప్పించలేకపోయింది.
వరలక్ష్మి శరత్‌కుమార్ అభినయం ఆకట్టుకుంటుంది. కానీ ఆమె పాత్రలో ఆశించినంత బలం లేదు. అయ్యప్పశర్మ, మురళీశర్మలాంటి ప్రతినాయకులున్నా వాళ్ల పాత్రలు పెద్దగా మెప్పించలేకపోయాయి.
* సాంకేతిక వర్గం
సాంకేతికంగా ఏ విభాగం కూడా ప్రభావం చూపించలేదు. సాయికార్తీక్ నేపథ్య సంగీతం బాగుందంతే. సాయిశ్రీరామ్ కెమెరాపనితనం పర్వాలేదనిపిస్తుంది. మాటల్లో ద్వంద్వార్థాలు ఎక్కువగా వినిపిస్తాయి. కథ, కథనాల్లో పస లేదు. దర్శకుడు నాగేశ్వరరెడ్డి తనకు అలవాటైన పాత పద్ధతిలో సినిమాని తీశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
* విశ్లేషణ
పంచ్‌లు.. ప్రాసలు ఎన్ని వినిపించినా సన్నివేశాల్లో బలం లేకపోతే వృథానే. ప్రేక్షకులు నవ్వడం కాదు కదా... అసహనానికి గురవుతారు. భావోద్వేగాలు పండలేదంటే తెరపై ఎన్ని బంధాలు కనిపించినా వృథానే. పాత్రలు కన్నీరు కార్చాలి తప్ప ప్రేక్షకుడి హృదయం కొంచెం కూడా కరగదు.
కథనం ఆసక్తిని సాగడం లేదంటే అందులో కథ ఉందన్న విషయమే గుర్తుకు రాదు. ఇలా ఒక సినిమాలో ఏమేం తప్పులు జరగకూడదో అవన్నీ ఈ సినిమాలో జరిగాయి. ఎప్పట్లాగే దర్శకుడు కథపై దృష్టిపెట్టకుండా, కామెడీపైనే దృష్టిపెట్టాడు. సన్నివేశాల్లో బలం లేకపోవడంతో అది కూడా అక్కడక్కడ మాత్రమే పండింది.
అది కూడా స్పూఫ్‌లతో పండిన కామెడీనే. ఆ మాత్రం కామెడీ కోసం రెండు గంటలు భరించే ఓపిక ఎంతమందికి ఉంటుంది? ఆరంభ సన్నివేశాలు ఆసక్తికరంగా సాగినా... ఆ తర్వాత పట్టు తప్పింది సినిమా. తెనాలి కేసుల కోసం చేసే హంగామా, ఆయన రుక్మిణిని చూసి ప్రేమలో పడటం, కేసుల్ని రాజీ చేయడంతో ప్రథమార్థం ముగుస్తుంది.
అసలు కథని ద్వితీయార్థంలో చెప్పాలని అట్టిపెట్టుకున్నాడు దర్శకుడు. వరలక్ష్మి శరత్‌కుమార్ పాత్ర రాకతో విరామానికి ముందు సన్నివేశాలు కాస్త ఆసక్తిని రేకెత్తిస్తాయి. కథ గాడిలో పడినట్టే అనిపిస్తుంది. ఆమె కేసుని సొంతం చేసుకొని, గెలిచేంతవరకు బాగానే ఉంటుంది. కోర్టులో వాదనలు కూడా కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఆ తర్వాత మలుపు కూడా మెప్పించినా.. అనంతర సన్నివేశాల్ని మరింత ఆసక్తికరంగా, పకడ్బందీగా తీర్చిదిద్దడంలో దర్శకుడు విఫలమయ్యాడు.
మళ్లీ కామెడీ కోసమే ప్రయత్నించడం, అది కథని సిల్లీగా మార్చడంతో సినిమా పక్కదారి పట్టినట్టు అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు కూడా ఏమాత్రం ఆకట్టుకోవు. ఇద్దరు విలన్లు కాచుక్కూర్చున్నా హీరో ఒక స్కూటర్‌పై వెళ్లి సాక్ష్యాల్ని ఎత్తుకొని వచ్చేస్తాడు. కోర్టుకి అప్పగించి అయ్యిందనిపిస్తాడు. కోర్టు నేపథ్యంలో ఒక్క ఆసక్తికరమైన సన్నివేశం కూడా లేదంటే ఈ కథపై ఎలాంటి కసరత్తులు జరిగాయో ఊహించొచ్చు.
* ప్లస్ పాయింట్స్
కథ
డైలాగులు
మ్యూజిక్
* మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
రొటీన్ సీన్లు
బలవంతపు కామెడీ
* ఫైనల్ వర్డిక్ట్: కొన్ని హాస్య సన్నివేశాలు మినహా సినిమాలో చెప్పుకోదగ్గ విషయమంటూ ఏమీ లేదు.
- రివ్యూ రాసింది శ్రీ