'ట‌క్ జ‌గ‌దీష్' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు : నాని, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు తదితరులు
దర్శకత్వం : శివ నిర్వాణ
నిర్మాత‌లు : సాహు గారపాటి, హరీష్ పెద్ది
సంగీతం : థమన్ 
సినిమాటోగ్రఫర్ : ప్రసాద్ మురెళ్ళ
ఎడిటర్ : ప్రవీణ్ పుడి


రేటింగ్: 2.5/5


ఫ్యామిలీ సెంటిమెంట్ అనే జోన‌ర్ కి తిరుగులేదు. ఎప్పుడు తీసినా, ఎన్నిసార్లు తీసినా... క‌థ‌లోని ఎమోష‌న్లు క‌నెక్ట్ అయితే - సినిమా ఆడేస్తుంది. అందుకే.. మ‌న‌వాళ్లు ఎన్ని జోన‌ర్లు తీసినా, మ‌ధ్య‌మ‌ధ్య‌లో కుటుంబ క‌థా చిత్రాల‌వైపు మొగ్గు చూపిస్తుంటారు. యువ హీరోలు సైతం ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు త‌ర‌చూ చేస్తుంటారు. కుటుంబ ప్రేక్ష‌కుల అండ ఉంటే - ఫ్యామిలీ హీరో అనిపించుకుంటే - అదే వాళ్ల సినిమాల‌కు శ్రీ‌రామ ర‌క్ష‌.

 

నాని కూడా అలా కుటుంబ ప్రేక్ష‌కుల అభిమానాన్ని గెలుచుకున్న‌వాడే. వాళ్ల ప‌ల్స్ ఏమిటో త‌న‌కు బాగా తెలుసు. అందుకే `ట‌క్ జ‌గ‌దీష్‌`తో మ‌రోసారి కుటుంబ క‌థ‌ని ఎంచుకున్నాడు. నిన్నుకోరి, మ‌జిలీతో ఆక‌ట్టుకున్న శివ నిర్వాణ ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు. అమేజాన్ ప్రైమ్ లో విడుద‌లైంది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?  ఇంటిల్లిపాదికీ న‌చ్చుతుందా?


* క‌థ‌


అది.. భూదేవి పురం. అక్క‌డ క‌క్ష‌లూ, కార్ప‌ణ్యాలూ ఎక్కువ‌. అన్నాద‌మ్ములే అయినా స‌రే, ఆస్తి అన‌గానే నరుక్కోవ‌డం చాలా స‌హ‌జం. ఆ ఊరి పెద్ద‌.. ఆదిశేష‌నాయుడు (నాజ‌ర్‌). త‌న‌కు ఇద్ద‌రు కొడుకులు. బోసు (జ‌గ‌ప‌తిబాబు), జ‌గ‌దీష్ (నాని). జ‌గ‌దీష్ ని ఊర్లో అంతా ట‌క్ జ‌గ‌దీష్ అని పిలుస్తారు. త‌న‌కి కుటుంబం అంటే ప్రాణం. అయితే నాయుడు చ‌నిపోవ‌డంతో ఆ కుటుంబం ఒక్క‌సారిగా విచ్ఛిన్నం అవుతుంది. అన్న‌య్య బోస్ ప్ర‌వ‌ర్త‌న‌లో అనూహ్య‌మైన మార్పు వ‌స్తుంది. ఊర్లో ప్ర‌జ‌ల‌కు నాయుడు ఇచ్చిన మాట‌కు క‌ళంకం ఏర్ప‌డుతుంది. ఈ స‌మ‌స్య‌ల‌న్నీ ఎలా తీరాయి?  త‌న కుటుంబాన్ని జ‌గ‌దీష్ మ‌ళ్లీ ఎలా దారిలో పెట్టాడు?  అనేది మిగిలిన క‌థ‌.


* విశ్లేష‌ణ‌


కుటుంబ క‌థా చిత్రాలు అన‌గానే కొత్త క‌థలు పుట్టుకొచ్చేయ‌వు. అన్నాద‌మ్ముల అనుబంధం, వాళ్ల మ‌ధ్య వ‌చ్చే సంఘ‌ర్ష‌ణ‌, గొడ‌వ‌లు, చివ‌ర్లో క‌లుసుకోడం ఇదే ఉంటాయి. ఈ క‌థ‌లోనూ అంతే. అయితే దానికి ఊరి త‌గాదాలు, స‌వ‌తి కొడుకులు, మేన‌కోడ‌లు వ్య‌వ‌హారం ఇలా ఎగ‌స్ట్రా లేయ‌ర్స్ వేసుకుంటూ వెళ్లాడు ద‌ర్శ‌కుడు. నాని సినిమా అంటే సున్నిత‌మైన హాస్యం, మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్.. ఇవ‌న్నీ ఆశిస్తారు. అయితే ఈ క‌థ‌లో అవేం ఉండ‌వు.  నాని ఉన్నాడు క‌దా అని ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం కొన్ని సీన్లు రాసుకోవొచ్చు.కానీ.. ద‌ర్శ‌కుడు రాసుకున్న క‌థే పెద్ద‌ది. కాబ‌ట్టి... నాని కోసం, త‌న ఫ్యాన్స్ కోసం వినోదాన్ని దూరం పెట్టాడు. తొలి స‌న్నివేశాల్లో ఊరి గొడ‌వ‌లు, అన్న‌ద‌మ్ముల క‌క్ష‌లు చూపించి - ఓర‌క‌మైన సీరియ‌స్ మోడ్ లోకి ప్రేక్ష‌కుడ్ని నెట్టేశాడు. ఆ త‌ర‌వాత అదే కంటిన్యూ అయ్యింది.


నాజ‌ర్ మ‌ర‌ణంతో... జ‌గ‌ప‌తి బాబు పాత్ర‌లో అనూహ్య‌మైన మార్పు వ‌స్తుంది. ఆ మార్పే ఈ కథ‌ని మ‌రింత సీరియ‌స్ డైమ‌న్ష‌న్ లో ప‌డేస్తుంది. ఆ త‌ర‌వాత‌.. నాని ఎం.ఆర్‌.ఓగా మారి అదే ఊరికి రావ‌డం, స‌మ‌స్య‌ల్ని ఒకొక్క‌టిగా ప‌రిష్క‌రించ‌డం, ఇంట్లో గొడ‌వ‌ల్ని స‌ద్దుమ‌ణిగేలా చేయ‌డం - ఇలా సాగుతుంది. మేన‌కోడలు (ఐశ్వ‌ర్యా రాజేష్‌)తో ఎపిసోడ్ కుటుంబ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ఉంటుంది. ఓ మేన‌మావ‌...త‌న మేడ‌కోడ‌ల్ని ఎలా చూడాలి. ఎంత బాధ్య‌త‌గా ఉండాలి అనేది ఈ ఎపిసోడ్ లో చూపించారు. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి క‌నెక్ట్ అయ్యే ఎమోష‌న్స్ ఇందులో చాలా ఉంటాయి. అయితే అవ‌న్నీ పాత సినిమాల ప‌ద్ధ‌తిలోనే సాగుతాయి.


నాని నుంచి ఆశించే ఎలిమెంట్స్ లేక‌పోడం, ఆ పాత్ర‌ని మ‌రీ గంభీరంగా చూపించే ప్ర‌య‌త్నం చేయ‌డం... ప్ర‌తికూల అంశాలుగా మిగిలిపోతాయి. జ‌గ‌ప‌తిబాబు పాత్ర‌లో మార్పు రావ‌డంతో క‌థ అయిపోతుంది.  కానీ ఆ త‌ర‌వాత కూడా.. సినిమా `సాగు`తుంది. షార్ప్‌గా చెప్పాల్సిన పాయింట్ ని లెంగ్తీగా చెప్పాడు ద‌ర్శ‌కుడు. దాంతో అక్క‌డ‌క్క‌డ సీరియ‌ల్ సాగిన‌ట్టు క‌థ సాగుతుంది. శ‌త్రువు ఇంట్లోంచి అమ్మాయిని కోడ‌లుగా తెచ్చుకుని, త‌న‌ని హింసిస్తూ.. విల‌న్‌ రాక్ష‌స ఆనందం పొంద‌డం - `శివ‌రామ‌రాజు` సినిమాని గుర్తుకు తెస్తుంది. కుటుంబాన్ని క‌ల‌పాలి అని హీరో ప‌డే బాధ `చిన‌బాబు` సినిమాలా ఉంటుంది. అలా పాత సినిమాల ప్ర‌భావం `ట‌క్ జ‌గ‌దీష్‌`పై చాలా ఉంది అనిపిస్తుంది.


* న‌టీన‌టులు


నాని ఎప్పుడూ న‌టుడిగా వంద‌కు వంద తెచ్చుకుంటాడు. ఈసారీ అంతే. చాలా బ‌ల‌మైన ఎమోష‌న్ల‌ని చాలా సెటిల్డ్ గా చేశాడు. అయితే త‌న నుంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ మిస్స‌య్యింది. నాని - జ‌గ‌ప‌తిబాబుల‌ను అన్న‌ద‌మ్ములుగా చూపించారు.  నాని జ‌గ‌ప‌తిబాబుని `ఏంట్రా` అంటే ఇబ్బందిగా ఉంటుంది. జ‌గ‌ప‌తిబాబు త‌న సీనియారిటీని సిన్సియ‌ర్ గా చూపించేశాడు. కాక‌పోతే ఆ పాత్ర తాలుకూ మార్పుని ప‌ర్‌ఫెక్ట్ గా రాసుకోలేక‌పోయాడు ద‌ర్శ‌కుడు. మావ‌య్య అంటే ప‌డి చచ్చే అమ్మాయిగా ఐశ్వ‌ర్య రాజేష్ పాత్ర ఆక‌ట్టుకుంటుంది. రీతూ వ‌ర్మ కి అంత ప్రాధాన్యం ఏం లేదు. ఎప్పుడో... ఘ‌ర్ష‌ణ‌లో చూసిన గ‌ణేష్ బాలాజీని మ‌ళ్లీ ఇప్పుడు చూశాం. తిరు నిజంగా సైకోలా క‌నిపించాడు.


* సాంకేతిక వ‌ర్గం


త‌మ‌న్  పాట‌ల‌న్నీ బాగుంటాయి త‌న ఆల్బ‌మ్ లో మ‌ర్చిపోలేని ఒక్క పాటైనా ఉంటుంది. అయితే ట‌క్ జ‌గ‌దీష్ లో అలాంటి పాట మిస్స‌యింది. ఫొటోగ్ర‌ఫీ నీట్ గా ఉంది. ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం బాగా క్యాప్చ‌ర్ చేశారు. ఎమోష‌న్ కి త‌గ్గ‌ట్టుగా లైటింగ్ ఉంది. ఎడిటింగ్ ఇంకా షార్ఫ్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువ‌లు భారీగానే ఉన్నాయి. శివ నిర్వాణ చాలా ఎమోష‌న్ల‌ని, చాలా పాత్ర‌ల్నీ ఒకే సినిమాలో చూపించాల‌నుకున్నాడు. కానీ కొన్నింటికే న్యాయం చేశాడు.


* ప్ల‌స్ పాయింట్స్


ఫ్యామిలీ ఎమోష‌న్స్‌
నాని న‌ట‌న‌
సాంకేతిక వ‌ర్గం


* మైన‌స్ పాయింట్స్


ఎక్కువ పాత్ర‌లు
పాత క‌థ‌


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్:  భార‌మైన ఎమోష‌న్లు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS